ఉంటే ఉండండి.. లేదంటే పొండి
ABN , Publish Date - Dec 14 , 2023 | 02:57 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూలు తయారీ చేసే పోటు కార్మికులు, అధికారి మధ్య బుధవారం వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సిబ్బంది విధులు బహిష్కరించి ఆలయం వెలుపలకు వచ్చారు.
శ్రీవారి ఆలయంలో పోటు సిబ్బందిపై అధికారి పరుష పదజాలం
విధులు బహిష్కరించిన సిబ్బంది
తిరుమల, డిసెంబరు13(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూలు తయారీ చేసే పోటు కార్మికులు, అధికారి మధ్య బుధవారం వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సిబ్బంది విధులు బహిష్కరించి ఆలయం వెలుపలకు వచ్చారు. సాధారణంగా ఆలయం వెలుపల తయారీ చేసే బూందీని లడ్డూలు పట్టేందుకు ఆలయంలోకి పంపుతారు. అయితే బుధవారం మఽధ్యాహ్నం ఆలయంలోని పోటు సిబ్బంది డ్యూటీ దిగే సమయంలో ఏఈవో శ్రీనివాసులు అక్కడికి వచ్చి మిగిలివున్న ప్రోక్తాన్ని కూడా లడ్డూలు పట్టి వెళ్లాలని ఆదేశించారు. తమకు ఇచ్చిన పని పూర్తిచేశామని, విధులకు రానివారి పని కూడా చేయమంటే ఎలా అంటూ సిబ్బంది ప్రశ్నించారు. దీంతో ఏఈవో ఆగ్రహంతో... ‘ఉంటే ఉండండి లేదంటే బయటకు పొండంటూ’ దురుసుగా, అసభ్యకరంగా కూడా మాట్లాడడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోటు సిబ్బంది విధులను బహిష్కరించి ఆలయం వెలుపలకు వచ్చేశారు. ఆలయం వెలుపల ఉన్న బూందీ తయారీ సిబ్బంది కూడా వారితో జతకట్టారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు లడ్డూల తయారీ ఆగిపోతే భక్తులకు ఇబ్బంది కలుగుతుందని, ఏదైనా ఇబ్బంది ఉంటే పరిష్కరించుకుందామని నచ్చజెప్పడంతో పోటు సిబ్బంది తిరిగి విధులకు హాజరయ్యారు.