Share News

ఇంజనీర్లను వేధిస్తే ఊరుకోం

ABN , First Publish Date - 2023-12-11T02:40:51+05:30 IST

సాధ్యం కాని టార్గెట్లు పెట్టి పంచాయతీరాజ్‌ ఇంజనీర్లను వేధించడం సరికాదని, ఉన్నతాధికారులు, కలెక్టర్లు ఇదే ధోరణి అవలంభిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఏపీ పంచాయతీరాజ్‌ ఇంజనీర్ల అసోసియేషన్‌ రాష్ట్ర

ఇంజనీర్లను వేధిస్తే ఊరుకోం

బిల్లులు చెల్లించకుండా టార్గెట్లు పూర్తి చేయడం ఎలా?

అసాధ్యమైన లక్ష్యాలతో సతాయిస్తున్నారు

ఇలాగే కొనసాగితే ఆందోళన చేపడతాం

లేకుంటే తప్పుకొంటాం... మండల ఉపాధి సిబ్బందితో చేయించుకోండి

ఏపీ పీఆర్‌ ఇంజనీర్ల అసోసియేషన్‌ తీర్మానం

అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): సాధ్యం కాని టార్గెట్లు పెట్టి పంచాయతీరాజ్‌ ఇంజనీర్లను వేధించడం సరికాదని, ఉన్నతాధికారులు, కలెక్టర్లు ఇదే ధోరణి అవలంభిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఏపీ పంచాయతీరాజ్‌ ఇంజనీర్ల అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆదివారం విజయవాడలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీవీ మురళీకృష్ణ నాయుడు, కె.సంగీతరావు ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలను కార్యవర్గం ఆమోదించింది. ఉన్నతాధికారులు, కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్సుల్లోనూ, సమీక్ష సమావేశాల్లోను, టెలీకాన్ఫరెన్స్‌ల్లోను ఇంజనీర్ల పట్ల దురుసుగా, కించపరిచే విధంగా మాట్లాడటాన్ని సమావేశం ఖండించింది. ఇంజనీర్ల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉపాధి పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో చెల్లించకుండా టార్గెట్లు పూర్తి చేయలేదని ఇంజనీర్లను వేధించడాన్ని తప్పు పట్టారు. క్వాలిటీ కంట్రోల్‌పై చీఫ్‌ ఇంజనీర్లకు ఉన్న అధికారాన్ని ఆక్రమిస్తూ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడాన్ని ఖండించారు. ఇంజనీరింగ్‌ విభాగానికి కార్యదర్శిగా ఇంజనీరే ఉండాలని దేశవ్యాప్తంగా ఇండియన్‌ ఇంజనీర్స్‌ ఫెడరేషన్‌ చేస్తున్న డిమాండ్‌కు పీఆర్‌ ఇంజనీర్లు పూర్తి మద్దతు తెలియజేస్తూ తీర్మానించారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీ మేరకు పీఆర్‌ ఇంజనీర్లపై విజిలెన్స్‌ కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకోరాదన్నారు.

ఉపాధి పనులు చేసినందుకు గాను పంచాయతీరాజ్‌ శాఖకు చెల్లించాల్సిన 3శాతం నిర్వహణా వ్యయం మంత్రి ఆదేశించినప్పటికీ పీఆర్‌ అండ్‌ ఆర్డీ కమిషనర్‌ విడుదల చేయకపోవడంతో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతభత్యాలు, ఇంజనీర్లకు చెల్లించాల్సిన వాహన అద్దె బిల్లులు, ఎఫ్‌టీఏ, ఆఫీసు నిర్వహణ ఖర్చులు చెల్లించలేకపోతున్నారన్నారు. ఉపాధి నిర్వహణా వ్యయం చెల్లించకపోతే మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనులు ఆయా మండల ఉపాధి సిబ్బందితోనే చేయించుకోవాలని, తాము తప్పుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.14,830 కోట్లతో 50వేల పనులు పంచాయతీరాజ్‌ ఇంజనీర్లు చేపడుతుండటంతో ఒత్తిడి పెరిగిందని, ఇవి కాక హౌసింగ్‌, వెటర్నరీ, అగ్రికల్చరల్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ శాఖలకు సంబంధించిన ఇతర పనులను కూడా పీఆర్‌ ఇంజనీర్లకే అప్పగించడంతో పనిభారం ఎక్కువైందన్నారు. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను నియమించి మూడేళ్లవుతున్నా.. సరైన శిక్షణ ఇప్పటికీ ఇవ్వలేదని, వారిలో 44 శాతం మంది మెకానిక్‌ ఇంజనీర్లు ఉన్నారన్నారు. తక్షణమే వారికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ సర్వీ్‌సను ఒక్క పంచాయతీరాజ్‌ శాఖలోనే పరిగణించడం సరికాదని, వారిని ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ తదితర శాఖలకు దామాషా పద్ధతిలో కేటాయించాలని, లేనిపక్షంలో వారికి పదోన్నతులు కల్పించడం కష్టమవుతుందని సమావేశం పేర్కొంది.

Updated Date - 2023-12-11T02:40:53+05:30 IST