Share News

ఉద్యోగం ఒత్తిడితో నాన్నను పోగొట్టుకున్నా!

ABN , Publish Date - Dec 30 , 2023 | 02:48 AM

‘రెండు మూడు రోజులు సమ్మె చేస్తేనే షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఈ ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా మా నాన్నను పోగొట్టుకున్నాను.

ఉద్యోగం ఒత్తిడితో నాన్నను పోగొట్టుకున్నా!

ఆయన్ను ఎవరు తెచ్చిస్తారు?

సమగ్ర శిక్ష అధికారిని నిలదీసిన కేజీబీవీ ఉద్యోగి

అనంతపురం విద్య, డిసెంబరు 29: ‘రెండు మూడు రోజులు సమ్మె చేస్తేనే షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఈ ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా మా నాన్నను పోగొట్టుకున్నాను. ఎవరు తెచ్చిస్తారు మా నాన్నను..?’ అని కేజీబీవీ ఉద్యోగి సునీత కన్నీటిపర్యంతమయ్యారు. అనంతపురంలోని సమగ్ర శిక్ష ప్రాజెక్టు కార్యాలయం వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సమ్మెలో భాగంగా 10వ రోజు అనంతపురం కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. అనంతరం సమగ్రశిక్ష ప్రాజెక్టు కార్యాలయాన్ని ముట్టడించారు. సకాలంలో జీతాలు చెల్లించాలని, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన సమగ్రశిక్ష ఉద్యోగులలో 62 మందికి అధికారులు నోటీసులు ఇచ్చారు. దీన్ని నిరసిస్తూ ఉద్యోగులు సమగ్రశిక్ష ప్రాజెక్టు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో పామిడి సీఆర్టీ (కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్‌) సునీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక దశలో కన్నీరు పెట్టుకున్నారు. ‘సమ్మెలోకి వచ్చిన రెండు మూడు రోజులకు నోటీసులిచ్చారు. మూడు, నాలుగు నెలలు జీతాలు ఇవ్వకుంటే మేమెవరికి నోటీసులు ఇవ్వాలి?’ అని ఏపీసీ వరప్రసాద్‌ను ప్రశ్నించారు. ‘పొద్దున్న క్లాస్‌కు వెళితే సాయంత్రం 4 గంటల వరకూ నిర్విరామంగా పాఠాలు బోధిస్తున్నాం. తీవ్రమైన పని ఒత్తిడి ఉంటోంది. మా నాన్నకు హార్ట్‌ స్ర్టోక్‌ వచ్చినపుడు 20 సార్లు ఫోన్‌ చేశారు. కంటిన్యూగా క్లాసులు ఉండటంతో ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేకపోయాను. ఈ కారణంగానే మా నాన్నను కోల్పోయాను’ అనిఆమె కన్నీరు పెట్టుకున్నారు.

Updated Date - Dec 30 , 2023 | 02:48 AM