ఓట్ల ఆటలో కేసుల వేట!
ABN , First Publish Date - 2023-11-06T04:40:53+05:30 IST
కాలు కదిపితే కేసు, నోరు మెదిపితే కేసు! ఇదంతా విపక్ష నేతలు, కార్యకర్తలపై కక్ష సాధించేందుకే అని ఇప్పటిదాకా అనుకుంటున్నారు.
ఎడాపెడా కేసుల వెనుక ‘ఎన్నికల వ్యూహం’
‘ఒక్క చాన్స్ ప్లీజ్’ అని అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత... ‘మళ్లీ మళ్లీ నేనే’ అని చెప్పారు. ప్రజలకు మేలు చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి... జనం ఓట్లతో గెలుస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ... వైసీపీ ‘వ్యూహం’ వేరని ఇప్పుడు విశ్లేషకులు చెబుతున్నారు. అదేమిటంటే... వలంటీర్లను సైన్యంగా వాడుకోవడం! విపక్ష సానుభూతిపరుల ఓట్లపై వేటు వేయడం! విపక్షానికి చెందిన క్రియాశీల కార్యకర్తలను కేసుల చట్రంలో ఇరికించడం! ఇదో... అనైతిక, అరాజకీయ, నీచ వ్యూహం!
ఇప్పుడు కేసులు పెట్టడం... ఎన్నికల ముందు చర్యలు తీసుకోవడం! పోలీసుల ద్వారా భయపెట్టడం, బెదరగొట్టడం, పోలింగ్ ముందు అరెస్టులు, బైండోవర్లు చేయడం! పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోకుండా అడ్డుకోవడం! ఇదో బరితెగింపు రాజకీయం!
కేసుల వెనుక లోతైన వ్యూహముందని చెబుతున్నారు. ‘అతనిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. పోలింగ్ ఏజెంట్‌గా పనికిరాడు’ అని ఎన్నికల రోజు అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు. బైండోవర్ కేసులున్న వ్యక్తులను తమ ముందు హాజరుపరచాలని ఆర్డీవో స్థాయి అధికారి ఆదేశించవచ్చు. ఇది... క్రియాశీల కార్యకర్తల చేతులు కట్టివేయడమే!
తప్పుడు కేసులు.. పెద్దసంఖ్యలో నిందితులు
క్రియాశీల విపక్ష కార్యకర్తలు, నేతలే లక్ష్యం
ఇప్పుడు కేసులు.. ఎన్నికల ముందు చర్యలు
అరెస్టు, బైండోవర్ల పేరుతో బెదిరించే వ్యూహం
పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోకుండా చూసే లక్ష్యం
క్రియాశీల కార్యకర్తల డేటా ఇప్పటికే పోలీసులకు
ఒక్కో పోలింగ్ బూత్‌లో 50-60 మంది టార్గెట్
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
కాలు కదిపితే కేసు, నోరు మెదిపితే కేసు! ఇదంతా విపక్ష నేతలు, కార్యకర్తలపై కక్ష సాధించేందుకే అని ఇప్పటిదాకా అనుకుంటున్నారు. కానీ.. దీని వెనుక చాలా పెద్ద వ్యూహం ఉందని ఇప్పుడు అర్థమవుతోంది. జనబలంతో గెలవాల్సిన ఎన్నికలను అధికార బలం, పోలీసు బలంతో హస్తగతం చేసుకోవాలని వైసీపీ పెద్దలు పెద్ద వ్యూహమే రచించారు. ఎన్నికలొచ్చే నాటికి టీడీపీలోని క్రియాశీల కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లుగా వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎన్నికల రోజు పోలింగ్ బూత్‌లో కూర్చోడానికి ఆ పార్టీకి ఏజెంట్లు దొరకకుండా చేయడమే జగన్ పార్టీ వ్యూహమని తెలుస్తోంది. ఇందుకోసం రాష్ట్రమంతటా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై ఎడాపెడా అడ్డగోలు ఆరోపణలతో కేసులు పెడుతున్నారు. గ్రామాల్లో రాజకీయ పార్టీలకు కార్యకర్తల బలం ఉన్నా, ఎన్నికల సమయంలో పోలింగ్ వ్యవహారాలు కొద్దిమంది కీలకమైన కార్యకర్తలు మాత్రమే నిర్వహించగలరు. గ్రామాల్లోగానీ, వార్డుల్లోగానీ వారి సంఖ్య పరిమితంగా ఉంటుంది. అలాంటి వారిపైనే వైసీపీ ఇప్పుడు టార్గెట్ పెట్టింది. ప్రతి బూత్ పరిధిలో 50-60 మందిని పోలింగ్ రోజునాటికి మూసేసేలా.. ఇప్పటినుంచే కేసుల కత్తులు నూరుతున్నారు. బోగస్ ఓట్లను ఎన్నికల జాబితాలోకి భారీగా చేర్చడంలో ఇప్పటికే అధికారపార్టీ సక్సెస్ అయింది. పోలింగ్ బూత్‌లను కూడా గుప్పిటపడితే గెలుపు సాధించవచ్చునన్నది వైసీపీ పెద్దల ఎత్తుగడ!
పోలీసులకు ఆదేశాలు...
రాష్ట్రంలోని టీడీపీ, జనసేన కార్యకర్తల జాబితాలు ఇప్పటికే పోలీసు స్టేషన్లకు చేరాయి. అందులోనూ... పోలింగ్ బూత్‌ల్లో టీడీపీ ఏజెంట్లుగా పనిచేసే వారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయాలని ఆదేశాలు అందాయి. అన్ని పోలీసు స్టేషన్ల ఎస్‌ఐలు.. కీలక కార్యకర్తల డేటాను సచివాలయ మహిళా పోలీసుల ద్వారా తెప్పించుకున్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన కీలక కార్యకర్తలెవరు... వారి నేపథ్యం ఏమిటి..... ఆధార్, ఫోన్ నంబర్లు, వారిపై ఏమైనా కేసులున్నాయా... వారిపై ఎలాంటి కేసులు పెట్టొచ్చు... ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలపడం, పత్రికా ముఖంగా విమర్శలు చేస్తున్నారా.... తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఎన్నికల సమయానికివీరందరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడమే లక్ష్యంగా సర్కారు నుంచి పోలీసులకు, వైసీపీ నేతలకు సంకేతాలందాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1500 మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదయ్యాయి.
కనుసన్నల్లో ఓటరు జాబితా...
ఓటర్ల జాబితాపై గత రెండేళ్ల నుంచి వైసీపీ ప్రత్యేక నిఘా పెట్టింది. బీఎల్‌వోల నియామకంతో పాటు వలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో యఽథేచ్ఛగా వాడుకున్నారు. ఎన్నికల కమిషన్ ఎన్నిసార్లు హెచ్చరించినా వలంటీర్ల జోక్యం కొనసాగుతూనే ఉంది. చివరకు ఓటర్ల జాబితాలో దొంగ ఓట్ల నమోదు చేయడంలో సక్సెస్ అయ్యారు. లక్షల బోగస్ ఓటర్లు ఓటర్ల జాబితాలోకి చేరాయి. వైసీపీ పెద్దల కనుసన్నల్లోనే ఓటరు జాబితా ప్రక్రియ కొనసాగిందన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే గానీ కదలిక రాలేదు. అయినా.. రోజువారీ ఫిర్యాదులపై చర్యలు తీసుకునే అధికారులు కరువయ్యారు. ముందు బోగస్ ఓటర్లను చేర్చిన అధికారపార్టీ, ఆ తర్వాత ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఓట్లను ఫారం-7 ద్వారా భారీ సంఖ్యలో తొలగించేందుకు ప్రయత్నించారు. దానిపై విచారణ నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతుండగానే ఇప్పుడు పోలింగ్ బూత్ ఏజెంట్లపై కన్నేసింది. కేసుల చట్రాన్ని బిగిస్తోంది.
కదిలితే కేసు.. అడిగితే అరెస్టు!
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థి పార్టీ నేతలపై కేసుల పరంపర కొనసాగించింది. టీడీపీలో చంద్రబాబు తర్వాత స్థాయి నాయకులందరిపైనా ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి. చంద్రబాబుపైనా రోజుకు ఒక కేసు చొప్పున పెడుతూ... 53 రోజులు జైలులో ఉంచారు. టీడీపీ కార్యకర్తలపై కేసులకు అంతూపొంతు లేకుండా పోతోంది. హౌస్ అరెస్టులు, నిర్బంధాలు యఽథేచ్ఛగా వారిపై సాగిస్తున్నారు. గ్రామాల్లోగానీ, పట్టణాల్లోగానీ ఎవరైనా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తే వారికి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఉపాధి హామీ పథకం, ఇతర పనులకు సంబంధించి అవకతవకలకు సంబంధించి ఫిర్యాదులు చేస్తే ఏకంగా దాడులకు తెగబడుతున్నారు. పోలీసు స్టేషన్లకు బాధితులు వెళ్లి ఫిర్యాదు చేస్తే.... పోలీసులు వైసీపీ కార్యకర్తలైన నిందితులతో ఎదురు ఫిర్యాదు చేయిస్తున్నారు. చివరకు బాధితుడిపైనే కేసు నమోదవుతోంది.
విచ్చలవిడి కేసుల వెనుక వ్యూహం
‘అంగళ్లు’ ఘటనపై పోలీసులు 5కేసులు నమోదు చేశారు. ఒక్క కేసులోనే 159 మందిని నిందితులుగా చేర్చారు. నిందితుల జాబితాలో ‘ఇతరులు’ అని రాసేసి, ఎప్పటికప్పుడు వాళ్లు లక్ష్యంగా పెట్టుకున్న వారిని కేసుల్లో చేర్చుతున్నారు. వీరంతా టీడీపీ క్రియాశీల కార్యకర్తలే.
పుంగనూరు గొడవకు సంబంధించి పోలీసులు ఏడు కేసులు పెట్టారు. ఇందులో ఏకంగా 470 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను నిందితులుగా చేర్చారు. క్రియాశీల కార్యకర్తలను ఎంచుకుని మరీ కేసులు పెట్టారు.
యువగళం పాదయాత్ర సందర్భంగా భీమవరంలో వైసీపీ కార్యకర్తలు రచ్చ రచ్చ చేశారు. కానీ పోలీసులు 52 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు పెట్టారు.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జరిగిన బంద్‌లో పాల్గొన్న ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తోపాటు 43 మందిపై కేసు పెట్టారు. అదే రోజున ఒక వ్యాపారిపై హత్యాయత్నం చేశారంటూ 12 మందిపై కేసు పెట్టారు.
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు బాపట్ల జిల్లావ్యాప్తంగా దాదాపు 900 మందిపై కేసులు నమోదు చేశారు.