అసైన్డ్‌ రైతుల ఆకలి కేకలు

ABN , First Publish Date - 2023-03-19T03:29:27+05:30 IST

రాజధాని కోసం భూములు త్యాగం చేసిన నేరానికి అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు ఆకలి చావులు, ఆర్తనాదాలు మిగిలాయి

అసైన్డ్‌ రైతుల ఆకలి కేకలు

రాజధానిలో తారస్థాయికి చేరిన ప్రభుత్వ కక్ష సాధింపు

సీఐడీ విచారణ సాకుతో కౌలు చెల్లింపు నిరాకరణ

చేతిలో పొలం లేక.. కౌలు డబ్బులు రాక ఇబ్బందులు

సమరానికి సిద్ధమవుతున్న రైతులు

(గుంటూరు - ఆంధ్రజ్యోతి)

రాజధాని కోసం భూములు త్యాగం చేసిన నేరానికి అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు ఆకలి చావులు, ఆర్తనాదాలు మిగిలాయి. రాష్ట్రం కోసం, రాజధాని కోసమంటూ జీవనాధారమైన భూములిచ్చిన రైతులపై కక్ష కట్టిన రాష్ట్ర ప్రభుత్వం కౌలు చెల్లించకుండా కడుపుపై కొడుతోంది. గతేడాది మేలో ఇవ్వాల్సిన కౌలు మళ్లీ మే వస్తున్నా.. ఇప్పటికీ ఇవ్వకపోవడంతో 29 గ్రామాలకు చెందిన 3,139 మంది అసైన్డ్‌ రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. చేతిలో పొలం లేక, చేసేందుకు పనిలేక, కౌలు డబ్బులు చేతికి రాక ఆకలితో అల్లాడిపోతున్నారు. రాజధాని కోసం 29 గ్రామాలకు చెందిన 28,309 మంది రైతులు భూ సమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) పథకం కింద 34 వేల ఎకరాల భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. వీరిలో 3,139 మంది అసైన్డ్‌ రైతులు తమకున్న 2,689 ఎకరాల భూమిని ఇచ్చేశారు. వీరంతా అట్టడుగు వర్గాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులే. భూములిచ్చిన రైతులకు జరీబు అయితే ఎకరాకు రూ.50 వేలు, మెట్ట అయితే రూ.30వేలు కౌలుతోపాటు ఏటా 10శాతం చొప్పున కౌలు పెంచేలా గత ప్రభుత్వం రైతులతో చట్టబద్ధమైన సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం వీరికి కౌలు చెల్లించేందుకు నిరాకరిస్తోంది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న వంకతో కొన్నాళ్లపాటు వేధించింది. ఈ అంశంపై కోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో కొత్త మార్గం ఎంచుకుంది. సీఐడీ కేసులు, విచారణ పేరుతో వీరికి కౌలు చెల్లించకుండా వాయిదా వేస్తూ వస్తోంది.

ఆరు కేటగిరీల్లో భూ సమీకరణ

రాజధాని కోసం భూములిచ్చిన రైతులను ప్రభుత్వం ఆరు కేటగిరీలుగా నిర్ణయించింది. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికోద్యోగులు, రాజకీయ బాధితులను కేటగిరీ-1గా నిర్ణయించింది. ఈ విభాగంలో ఉన్న 52 మంది రైతులు 72 ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించారు. కేటగిరీ-2లో 1954కు ముందు పట్టా పొందినవారు 1,145 మంది 1,409 ఎకరాలు, కేటగిరీ-3లో 1977 చట్టం తర్వాత పట్టాలు పొదిన 980 మంది 588 ఎకరాలు, కేటగిరీ-5లో ఉన్న 295 మంది 237 ఎకరాలు ఇచ్చారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం వీరందరికీ కౌలుతోపాటు నివాస, వాణిజ్య సముదాయాలను ఇవ్వాలి. కాగా 290 ఎకరాల భూమిని ఇచ్చిన కేటగిరి-4లోని 440 మంది రైతులు, 90 ఎకరాలు ఇచ్చిన కేటగిరి-6లోని 227 మంది రైతులకు కౌలు మాత్రమే ఇస్తారు. కానీ వీరిలో ఏ ఒక్కరికీ గతేడాది కౌలు చెల్లించలేదు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సీఐడీ విచారణలో నిజమైన రైతులుగా తేలారని చెబుతున్న అసైన్డ్‌ రైతులకు కూడా ప్రభుత్వం కౌలు ఎగవేస్తోంది. 1423 ఫసలీ, 1బీ, అడంగల్‌లో నమోదై ఉన్న వారిని మాత్రమే అసలైన రైతులుగా గుర్తించడం, ఆర్‌ఓఆర్‌, తహసీల్దారు రికార్డుల్లో లేనివారి భూములను లెక్కలోకి రాని భూములుగా భావించి వారిని నాట్‌ ట్యాలీడ్‌ జాబితాలో పెట్టింది. అయితే ఈ విచారణకు ప్రామాణికత లేదని, అన్యాయంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోనీ ఈ లెక్కన చూసుకున్నా 1, 2, 3, 5 కేటగిరీల్లో ఉన్న2,472 మంది రైతులకు కౌలు చెల్లించాల్సి ఉంది. కానీ వారికి కూడా గతేడాది కౌలు చెల్లించలేదు.

రెండో ఏడాది వస్తున్నా అందని కౌలు

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు రాజధాని రైతులపై కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తోంది. ఏ ఏడాదికాయేడాది కౌలు చెల్లించకుండా వేధిస్తోంది. గత నాలుగేళ్లలో కోర్టు మెట్లెక్కకుండా రైతులకు కౌలు దక్కిన సందర్భం లేదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కిందటేడాది కూడా కోర్టు మొట్టిక్కాయలు వేయడంతో రైతులకు జూన్‌లో కౌలు ఇచ్చింది. కానీ అసైన్డ్‌ రైతులకు మాత్రం చెల్లించలేదు. మళ్లీ మే నెల కూడా వస్తోంది. కానీ కౌలు చెల్లింపుపై అదే మొండి వైఖరితో వ్యవహరిస్తోంది. దీంతో అసైన్డ్‌ రైతులు సీఆర్డీఏపై సమరానికి సిద్ధమవుతున్నారు.

Updated Date - 2023-03-19T03:29:27+05:30 IST