నిజాయితీపరులను అవినీతిపరులు జైళ్లలో పెడుతున్నారు
ABN , First Publish Date - 2023-09-22T03:54:01+05:30 IST
దేశంలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. అవినీతిపరులు, నిజాయితీపరులను జైళ్లలో పెడుతున్నారు’
10వ బెయిల్ వార్షికోత్సవం జరుపుకొంటున్న సైకో: రామ్మోహన్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ‘దేశంలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. అవినీతిపరులు, నిజాయితీపరులను జైళ్లలో పెడుతున్నారు’ అని టీడీపీ ఎంపీ రామ్మెహన్‌నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం లోక్‌సభలో చంద్రయాన్ - 3 విజయంపై జరిగిన చర్చలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టు అంశాన్ని లేవనెత్తారు. ‘‘45 ఏళ్ల పాటు ఎటువంటి మచ్చ లేకుండా ప్రజాసేవ చేసిన చంద్రబాబును తప్పుడు కేసులతో జైలుకు పంపించారు. ఇది దొరతనపు కక్ష. ఇలా చేస్తుంటే మాలాంటి యువ నేతలకు ఆదర్శం ఎలా ఉంటుంది? రూ.43 వేల కోట్ల మేర దేశ సంపదను దోచుకున్న సైకోలు 10వ బెయిల్ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. వ్యవస్థను సరిదిద్దాలి. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ దేశంలోనూ, విదేశాల్లోనూ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం, చంద్రబాబుకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఎంపీలంతా గొంతు ఎత్తాలి’’ అని రామ్మోహన్‌నాయుడు విజ్ఞప్తి చేశారు.
కోర్టులోని అంశంపై సభలో మాట్లాడడానికి వీల్లేదు
వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ... ‘‘చంద్రబాబు రూ.3,300 కోట్ల మేర కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యారు. స్కిల్ డెవల్‌పమెంట్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ సీఐడీకి సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టం కింద సీఐడీ కేసు నమోదు చేసింది’’ అని తెలిపారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని సభలో లేవనెత్తడానికి వీలులేదన్న నిబంధనను ఆయన ఉటంకించారు. భరత్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు.