Share News

హోంమంత్రి ఇలాకాలో మరో దారుణం

ABN , First Publish Date - 2023-11-29T04:27:48+05:30 IST

దళిత యువకుడిని బలిగొన్న దొమ్మేరు ఘటన మరువక ముందే హోం మంత్రి తానేటి వనిత నియోజకవర్గంలో మరో దారుణం జరిగింది.

హోంమంత్రి ఇలాకాలో మరో దారుణం

ట్రాక్టర్‌ డ్రైవర్‌ ప్రాణం తీసిన అక్రమ ఇసుక తవ్వకం

ఇసుకబాట తడుపుతుండగా నీటిట్రాక్టర్‌ బోల్తా పడి మృతి

బల్లిపాడు ర్యాంపులో ఘటన..మృతుడు దళితుడు

రూ.8 లక్షల పరిహారం ప్రకటించిన మంత్రి వనిత

అందులో ర్యాంపు ఓనర్లు రూ.5 లక్షలు ఇస్తారట!

నిజానికి ప్రభుత్వం ర్యాంపులింకా కేటాయించలేదు

మరి ఓనర్లు ఎక్కడినుంచి వచ్చారంటున్న స్థానికులు

తాళ్లపూడి, నవంబరు 28 : దళిత యువకుడిని బలిగొన్న దొమ్మేరు ఘటన మరువక ముందే హోం మంత్రి తానేటి వనిత నియోజకవర్గంలో మరో దారుణం జరిగింది. అక్రమ ఇసుక తవ్వకాలు దళితుడి ప్రాణాలు తీశాయి. గత మే నెలలో జేపీ సంస్థకు చెందిన ఇసుక కాంట్రాక్టు ముగిసింది. అయినా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు మాత్రం ఆగలేదు. దొంగ బిల్లుల చూపించి మరీ తవ్వకాలు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని బల్లిపాడు ఇసుక ర్యాంప్‌లో గత 15 రోజులుగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా గోదావరికి అడ్డుగా బాటలు వేసి రాత్రి పగలూ తేడా లేకుండా ఇసుకను తరలించేస్తున్నారు. అయినా కన్నెత్తి చూసిన అధికారులు లేరు.. పట్టించుకున్న నాయకులు లేరు. బల్లిపాడు ర్యాంపు నుంచి ఇసుక తరలించేందుకు గోదావరిలో వేసిన బాటలు తడిపే పనికి గజ్జరం గ్రామానికి చెందిన కమిడి దుర్గారావు (50) కుదిరాడు. ప్రతిరోజూ ట్రాక్టర్‌పై ట్యాంకర్‌ పెట్టుకుని బాటలు తడుపుతున్నాడు. ఇసుక అక్రమ రవాణాకు వేసిన బాటపై ఇసుక, మట్టి ఎగరకుండా నీటితో తడుపుతారు. మంగళవారం ఉదయం బాటను తడిపే సమయంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి గోదావరి నదిలో పడిపోయింది. ట్రాక్టర్‌తో పాటు పడిపోయిన డ్రైవర్‌ దుర్గారావు గోదావరి నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుమారుడు కమిడి విజయ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రమాదవశాత్తు ఘటన జరిగిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు తాళ్లపూడి ఎస్‌ఐ వెంకట రమణ తెలిపారు.

ఇసుక యజమానులెవరు మంత్రిగారూ..?

కొవ్వూరు, నవంబరు 28 : కొవ్వూరు ప్రభుత్వాస్పత్రిలో ఉన్న దుర్గారావు మృతదేహాన్ని హోం మంత్రి వనిత సందర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ప్రమాదవశాత్తు మృతిచెందిన కారణంగా ట్రాక్టరు యాజమాని నుంచి రూ.3 లక్షలు, ఇసుక ర్యాంపు యాజమాన్యం నుంచి రూ.5 లక్షలు బాధిత కుటుంబానికి అందజేస్తామని మంత్రి క్యాంపు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. అయితే, ప్రభుత్వం ఇంకా ఇసుక ర్యాంపులను కాంట్రాక్టుకే అప్పగించలేదు. ఇసుక ర్యాంపు యజమానుల నుంచి పరిహారం అందజేయిస్తామని తెలపడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ర్యాంపులు కేటాయించకుండా యజమాని ఎక్కడి నుంచి వచ్చాడని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2023-11-29T04:27:52+05:30 IST