క్యాష్‌ కొట్టు.. పోస్టింగ్‌ పట్టు

ABN , First Publish Date - 2023-06-01T05:28:53+05:30 IST

జైళ్ల శాఖలో సిబ్బంది బదిలీల వ్యవహారం వివాదాలకు దారి తీస్తోంది. కోరిన చోట పోస్టింగ్‌ కోసం లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. లక్షలు సమర్పించుకుంటోన్న సిబ్బందిపై న్యాయంగా పోస్టింగ్‌ దక్కాల్సిన సిబ్బంది మండిపడుతున్నారు. ఖైదీల తిండితోపాటు,

క్యాష్‌ కొట్టు.. పోస్టింగ్‌ పట్టు

● జైళ్లశాఖ సిబ్బంది బదిలీల్లో భారీ వసూళ్లు

● ఐజీ, డీఐజీలు లేకుండానే వార్డర్ల బదిలీలు

● చక్రం తిప్పుతున్న ఒక క్లర్క్‌, బయటి వ్యక్తి

● ఒక్కొక్కరి నుంచి కనీసం రెండు లక్షలు వసూలు!

● ఆధారాలతో విజిలెన్స్‌కు పంపే ప్రయత్నాలు?

(అమరావతి–ఆంధ్రజ్యోతి)

జైళ్ల శాఖలో సిబ్బంది బదిలీల వ్యవహారం వివాదాలకు దారి తీస్తోంది. కోరిన చోట పోస్టింగ్‌ కోసం లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. లక్షలు సమర్పించుకుంటోన్న సిబ్బందిపై న్యాయంగా పోస్టింగ్‌ దక్కాల్సిన సిబ్బంది మండిపడుతున్నారు. ఖైదీల తిండితోపాటు, ములాఖత్‌లకు వచ్చే వారి నుంచి వసూళ్లు చేసి ఆ సొమ్ముతో పోస్టింగ్స్‌ తెచ్చుకొంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల బదిలీల కోసం ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు జైళ్ల శాఖలో ఓ ఉన్నతాధికారికి కాసుల వర్షం కురిపిస్తోందని ఆరోపిస్తున్నారు. ఆ అధికారికి సపర్యలు చేసే ఒక క్లర్క్‌తోపాటు కాంట్రాక్టరు అవతారమెత్తి ఉన్నతాధికారికి స్నేహితుడిగా చెలామణి అవుతున్న మరో బయటి వ్యక్తి ఓ చేత్తో జాబితా మరో చేత్తో నోట్ల కట్టలు పట్టుకు తిరుగుతున్నాడని చెబుతున్నారు. నాలుగు కేంద్ర కారాగారాలతోపాటు జిల్లా జైళ్లు, సబ్‌ జైళ్లు ఉన్న మన రాష్ట్రంలో మొత్తం 1900 మంది సిబ్బంది ఉండాలి. అయితే, కొన్నేళ్లుగా ఖాళీలు భర్తీ చేయకపోవడంతో సుమారు 40శాతం వరకూ సిబ్బంది కొరత ఉంది. దీంతో రాయల సీమలోని జైళ్లలో పనిచేసే వారికి పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటోంది. రాష్ట్ర జైళ్ల శాఖలో పనిచేస్తోన్న వార్డర్లలో ఎక్కువ మంది ఉత్తరాంధ్ర వారే. దీంతో తమ ప్రాంతానికి బదిలీ చేయించుకునేందుకు వారు ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పటికే అటాచ్‌మెంట్‌ రూపంలో వెళ్లి పనిచేస్తోన్న పలువురు వార్డర్లు ఈ నెల 22 నుంచి ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును సద్వినియోగం చేసుకొంటున్నారు. తమకు అనుకూలమైన చోట పోస్టింగ్‌ దక్కించుకోవడానికి మార్గాలను చూసుకుని ఇద్దరు వ్యక్తుల ద్వారా బేరసారాలు మొదలు పెట్టారు. ఉన్నతాధికారితో సన్నిహితం ఉందంటూ ప్రైవేటు వ్యక్తి ఒకరు కనీసం రెండు లక్షల రూపాయలకు తగ్గకుండా అడుగుతున్నారని ప్రచారం జరుగుతోంది. మరికొందరు మూడు లక్షలైనా ఇస్తాం.. మాకు కోరిన పోస్టింగ్‌ ఇప్పించండి అంటూ ఆ వ్యక్తితో పాటు మరో క్లర్క్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే, జాబితా మొత్తం సిద్ధం చేసి ప్రభుత్వం ఇచ్చిన ఆఖరు తేదీ(మే 31)న బదిలీ ఆదేశాలు ఇచ్చేందుకు జైళ్ల శాఖ సిద్ధం చేసింది. అయితే, బదిలీల్లో అక్రమాలు జరిగాయంటూ కొందరు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఐజీ, డీఐజీలు లేకుండానే..

జైళ్ల శాఖ సిబ్బంది బదిలీల్లో ఒక్కొక్క హోదాకు ఒక్కో అధికారికి అర్హత ఉంటుంది. కింది స్థాయి సిబ్బంది అయిన వార్డర్ల బదిలీలు డీఐజీలు చేపడితే, చిన్న జైళ్ల సూపరిండెంట్లను ఐజీ, ఆ పై అధికారులను డీజీ బదిలీ చేస్తారు. కానీ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా వార్డర్లను సైతం డీజీ బదిలీ చేస్తున్నారంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఏ వార్డర్‌ ఎక్కడ పని చేయగలడు? ఏ హెడ్‌ వార్డర్‌తో ఎలాంటి పని చేయించవచ్చు తదితర విషయాలపై అవగాహన డీఐజీలకే ఉంటుంది. అదే విధంగా జైళ్లలో ఖైదీల సంఖ్య ఆధారంగా సిబ్బందిని నియమించుకుంటారు. కానీ, వారి అభిప్రాయం తీసుకోకుండా క్యాష్‌ కొట్టిన వారికి పోస్టింగ్‌ అనే విధానం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఖైదీల ఆరోగ్యంపై ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ సంస్థ చెన్నైలో సెమినార్‌ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఐజీతోపాటు డీఐజీలు కూడా వెళ్లడంతో ఇదే సరైన సమయమని భావించిన మధ్యవర్తి, క్లర్క్‌ ఉన్నతాధికారి ద్వారా పని పూర్తి చేయిస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.

300 బదిలీలు.. ఐదు కోట్లకుపైగా వసూళ్లు!

ఒక్కొక్కరి నుంచి రెండు లక్షలకు తగ్గకుండా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 మంది నుంచి వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. కొందరు మూడు లక్షల వరకూ సమర్పించుకోగా, మరికొందరు రాజకీయ పైరవీలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఐదు కోట్ల రూపాయలకు తగ్గకుండా వసూలైనట్లు సమాచారం. ఇందులో ఎవరి వాటా ఎంత? అనే దానిపై ఆరా తీస్తోన్న కొందరు అధికారులు ఆధారాలతో సహా ప్రభుత్వానికి, విజిలెన్స్‌కు, ఏసీబీకి పంపే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-06-01T05:28:53+05:30 IST