తాడేపల్లికి నగదు కొట్టు.. రీచుల్లో ఇసుక పట్టు

ABN , First Publish Date - 2023-06-11T03:31:52+05:30 IST

‘‘తాడేపల్లికి నగదు కొట్టు... రీచుల్లో ఇసుక పట్టు... అన్నది ఒకటే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇసుక పాలసీ.

తాడేపల్లికి నగదు కొట్టు.. రీచుల్లో ఇసుక పట్టు

పేరుకే కంపెనీలకు కాంట్రాక్టు.. పెత్తనం వైసీపీ నేతలదే: టీడీపీ

అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): ‘‘తాడేపల్లికి నగదు కొట్టు... రీచుల్లో ఇసుక పట్టు... అన్నది ఒకటే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇసుక పాలసీ. గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసి తాడేపల్లికి దోచిపెట్టే విధానాన్ని తెచ్చి పెట్టింది’’ అని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. శనివారం ఆ పార్టీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇక్కడ ఒక ప్రకటన చేశారు. ‘‘టీడీపీ హయాంలో రూ.10 వేలకు అమ్మిన లారీ ఇసుక ఇప్పుడు ఏకంగా రూ.80 వేలకు చేరింది. ఇసుక పేరుతో జనాన్ని ఎంత స్థాయిలో దోచుకొంటున్నారో ఇదే ఉదాహరణ. రాష్ట్రంలోని ఇసుక రీచులన్నింటినీ ముందు జేపీ సంస్థకు అప్పగించారు. తర్వాత టర్న్‌ కీ కంపెనీకి ఇచ్చారు. అక్కడ నుంచి బ్రాక్‌స్టన్‌ ఇన్‌ఫ్రా, ఆ పిమ్మట కేకేఆర్‌ ఇన్‌ఫ్రా... అక్కడ నుంచి ఇంకో కంపెనీకి మార్చా రు. వీటన్నింటిని పేపర్‌ మీద పెట్టి వైసీపీ నేతలే మొత్తం ఇసుక వ్యాపారం చేస్తున్నారు. రాష్ట్రంలో జేపీ సంస్థ ఇసుక వ్యాపారం చేస్తోందా లేదా అంటే ఎవరూ కిక్కురుమనరు. కొవ్వూరులో ఇసుక కంట్రాక్ట్‌ తీసుకొన్న ప్రేమ్‌రాజ్‌ అనే కంట్రాక్టర్‌ నుంచి డిపాజిట్‌గా రూ.25 కోట్లు తీసుకొన్నారు. వైసీపీ పెద్దలు అడిగినంత ఇవ్వలేక అతను తప్పుకొంటానంటే కట్టిన డిపాజిట్‌ కూ డా ఇవ్వకుండా వేధిస్తే అతను ఆత్మహత్య చేసుకొన్నాడు. అతని మరణంపై కనీసం విచారణ కూడా చేయకుండా ప్రభుత్వం నిజాలు సమాధి చేసింది’’ అని ఆనందబాబు విమర్శించారు.

Updated Date - 2023-06-11T03:31:52+05:30 IST