OHRK Dr Mudigonda Sivaprasad: ఆంధ్రులకు శాపం!
ABN , First Publish Date - 2023-05-22T03:14:59+05:30 IST
మా పూర్వీకులు కశ్మీర్ నుంచి వచ్చారని ప్రాచీన చరిత్ర గ్రంథాలలో రాసి ఉంది. 2000 ఏళ్ల నాటి మాట ఇది. ఉద్భటారాజ్యుడు అనే ఆయన కశ్మీర్‌లో జయాపీడుడు అనే రాజుకు గురువుగా ఉండేవారు. వాళ్లు అక్కడ నుంచి కాశీకి అక్కడ నుంచి తెలంగాణకు వచ్చారు. ఆ సమయంలో తెలంగాణలో కాకతీయుల పాలన ఉండేది.
అనాదిగా శిక్షకు గురవుతున్నారు
రైతును కన్నీళ్లు పెట్టించిన వాళ్లు నశించిపోతారు
కులం ఆపాదించి ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వలేదు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చారిత్రక నవలా రచయిత డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ వ్యాఖ్యలు
ఆర్కే: శివప్రసాద్ గారు.. మీ పూర్వీకులు కశ్మీర్ నుంచి వచ్చారా?
శివప్రసాద్: మా పూర్వీకులు కశ్మీర్ నుంచి వచ్చారని ప్రాచీన చరిత్ర గ్రంథాలలో రాసి ఉంది. 2000 ఏళ్ల నాటి మాట ఇది. ఉద్భటారాజ్యుడు అనే ఆయన కశ్మీర్‌లో జయాపీడుడు అనే రాజుకు గురువుగా ఉండేవారు. వాళ్లు అక్కడ నుంచి కాశీకి అక్కడ నుంచి తెలంగాణకు వచ్చారు. ఆ సమయంలో తెలంగాణలో కాకతీయుల పాలన ఉండేది. అప్పుడు ఈ వంశస్తులు కాకతీయులకు రాజగురువులుగా ఉండేవారు. అందువల్ల ముదిగొండ అనే గ్రామాన్ని వీళ్లకు అగ్రహారంగా ఇచ్చేశారు. వరంగల్‌లో ఒక ముదిగొండ, ఖమ్మానికి 10 కిలోమీటర్ల దూరంలో మరో ముదిగొండ.. ఈ రెండూ మావే. ఇప్పుడు ఆ గ్రామాల్లో మా వాళ్లెవరూ లేరు. కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత అందరూ కృష్ణా, గుంటూరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. వరంగల్‌లోని ములుగు ఉంది కదా ఆ ములుగు ఇంటి పేరు వాళ్లు మా బంధువులే. ఇప్పటికీ మా పుట్టింటి వాళ్లు వరంగల్‌లో ఉన్నారు.
ఆర్కే: చారిత్రక నవలలను ఎందుకు ఎంచుకున్నారు?
శివప్రసాద్: భారతీయులకు, ఆంధ్రులకు అసలు చరిత్ర లేదని ప్రచారం చేశారు. కానీ మన చరిత్ర ఇదీ... అంటూ సామాన్యుడు లక్ష్యంగా నేను చారిత్రక నవలలు రాయడం మొదలుపెట్టాను. ఒక గృహిణికి చరిత్ర గురించి తెలియజేయాలన్న లక్ష్యంతో నేను ఈ చారిత్రక నవలలు రాయడం మొదలుపెట్టాను. వీటిని రాయడం ఎంత కష్టమో వాటిని చదివించడం అంతకంటే కష్టం. సమాజానికి నిజమైన చరిత్ర చెప్పాలన్న లక్ష్యంతో నేను చేసిన కృషి విజయవంతం అయింది. ప్రపంచ వ్యాప్తంగా నేను అనుకున్న ఫలితాన్ని సాధించాను. చారిత్రక నవలలు చదివించడం అనేది విస్తృతంగా పెంచాను. పరిశోధక వ్యాసాలు, కవితలు, నవలలు అన్నీ కలిపి 135 రాశాను.
ఆర్కే: మీలో రివల్యూషనరీ టైప్ కేరెక్టర్ ఉందనుకుంటా?
శివప్రసాద్: నేను మోడె్‌స్టగానే ఉంటాను. సాగరాంధ్రలో(ఆంధ్రప్రదేశ్) రాజకీయ నాయకులు మాట్లాడే బాష నేనెప్పుడూ మాట్లాడలేదు. నేను ఎన్‌జీ రంగా ఉపన్యాసాలు చాలా విన్నాను. ఎన్నడూ ఆయన నోటి వెంట ఒక్క పొల్లు మాట రాలేదు. ఇవాళ మన గుడివాడ భాష ఆనాటి నాయకుల నోటి వెంట రాలేదు. ఆ రాజకీయ నాయకులతో ఇవాళ్టి వాళ్లను పోల్చి చూస్తే ఏమనుకోవాలి. మహానుభావులు ప్రాణ త్యాగం చేసి దేశ స్వాతంత్య్ర తెచ్చింది ఇందుకేనా? టంగుటూరి ప్రకాశం పంతులు వంటి రాజకీయ నాయకుడిని ఒక్కరిని చూపించండి. ఎన్ని అన్యాయాలు, ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి. వీళ్లేమైనా శాశ్వతంగా ఉంటారా? వీళ్లేమైనా మందాతలా... మనువులా.. రాముడూ కృష్ణుడే పోయారు.
ఆర్కే: ఆంధ్రాలో ఒక కులం మీద ఒకరకమైన ద్వేషభావాన్ని వ్యాపింపచేస్తున్నారు కదా? దీనిపై ఒక వీడియో విడుదల చేసినట్లు ఉన్నారు?
శివప్రసాద్: నేను చారిత్రక పరిశోధకుడిని. కాపు, కమ్మ, రెడ్డి... ఎనిమిదో శతాబ్ధం నాటికి ఈ మూడు కులాలు వేర్వేరు కాదు. కాపు అంటే పొలాలను కాపు కాసేవారు. రెడ్డి అంటే రట్టోడి... రాష్ట్ర కూటులు వీళ్లు. దేశానికి రెడ్లు రక్షణ కల్పించారు. కమ్మవాళ్లకు కరికాల చోళుడికి లింకులు ఉన్నట్లు శాసనాలు దొరికాయి. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న కనౌజ్‌ను ఆ రోజుల్లో కన్యా కుబ్జా అని పిలిచేవారు. ఈ కనౌజ్‌ను కమ్మవాళ్లు పరిపాలించారు. దీనికి సాక్ష్యంగా ముమ్మడి నాయకుని శాసనం ఉంది. రాజ్యాధికారం కోసం ఈ మూడు కులాలు మెల్లిమెల్లిగా విడిపోయాయి.
ఆర్కే: అమరావతి పేరును వెంకటాద్రినాయుడు పెట్టారని చెప్పారు కదా.. అది ప్రస్తుత ప్రభువులకు నచ్చి ఉండదు.
శివప్రసాద్: అమరావతి మీద ఆరు నవలలు రాసాను. అమరావతి పేరును పెట్టాలని వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుకు వాళ్ల గురువు పాపయ్య రాజ్యులు చెప్పారు. అమరావతికి దగ్గరలో ఉన్న మరో ఊరికి వైకుంఠపురం అనే పేరు కూడా ఆయనే పెట్టారు. ఇవాళ వెంకటాద్రి నాయుడు ఎవరో తెలియకుండా చేశారు. రైతులు 30 వేల ఎకరాలు ఇచ్చిన రాజధాని అమరావతికి రాజకీయంగా ఇవాళ ఏ గతి పట్టిందో చూడండి. రైతులను కన్నీళ్లు పెట్టిస్తే ఎవరికైనా సరే వాళ్ల ఉసురు తగులుతుంది.
ఆర్కే: విశ్వామిత్రుడు మాదిరి జగన్మోహన్‌రెడ్డికి మీరు శాపం పెడుతున్నారు?
శివప్రసాద్: నేను ఒక వ్యక్తికి శాపం పెట్టడం లేదు. నేను ఆంధ్రా గురించి, తెలంగాణ గురించి మాట్లాడడం లేదు. రైతుకు ఎవరు కన్నీళ్లు పెట్టిస్తే వాళ్లు నశించి పోతారు. ప్రాణాలకు తెగించి శ్రమిస్తూ రైతులు ఇవాళ మనకు అన్నం పెడుతున్నారు. రైతులు పెట్టే తిండి తిని వాళ్లకు వెన్నుపోటు పొడుస్తామా. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉందా. నా మొత్తం జీవితంలో రాజకీయాలు ఇంతగా భ్రష్టు పట్టడం ఎప్పుడూ లేదు.
ఆర్కే: ఆంధ్రాకు తీవ్ర అన్యాయం చేశారు
శివప్రసాద్: కళారంగంలో ఆంధ్రప్రదేశ్‌కు చాలా అన్యాయం జరిగింది. చాలా ఉపన్యాసాలలో ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని ప్రచారం చేశాను. ఆ మహాపురుషునికి కులం ఆపాదించి భారత రత్న రాకుండా చేశారు. ఎంజీఆర్‌కు భారతరత్న ఇవ్వడంలో ఉన్న లాజిక్ ఏమిటి? ద్రవిడ రాజకీయాలలో ప్రయోజనాల కోసం ఆయనకు ఇవ్వొచ్చు. సచిన్‌కు, లతా మంగేష్కర్‌కు భారతరత్న ఇస్తారు. కానీ ఎన్టీఆర్‌కు ఇవ్వకపోవడం ఏమిటి? అంజలీదేవి, జమునా, మన దురదృష్టం ఏమిటంటే ఆంధ్రులు వాళ్లు చేయని తప్పునకు అనాదిగా శిక్షను అనుభవిస్తున్నారు. మొత్తం భారత దేశంలో అత్యంత జనసంఖ్య కలిగిన జాతి తెలుగు జాతి. ఇంతపెద్ద జాతి ఇవాళ ఎందుకు రక్తాశ్రువులు చిందించాల్సి వస్తుంది. వీళ్లు చేసిన పాపం ఏమిటి? వీళ్లంతా శపించబడ్డారు. ఈ భూగోళం మీద రాజధాని లేని రాష్ట్రం ఎక్కడన్నా ఉన్నదంటే అది తెలుగువాళ్లదే. ఇది ఎంత దురదృష్టం.
ఆర్కే: డిసెంబరు 25నే జీసస్ పుట్టాడని నిరూపిస్తే శిలువ ధరిస్తా
శివప్రసాద్: క్రిస్టియన్ సాహిత్యం మీద నేను విపరీతంగా పరిశోధన చేశాను. దానిపై క్రైస్తవ అష్టకం అని ఎనిమిది పుస్తకాలు రాశాను. ఈ చానల్ ద్వారా మొత్తం ప్రపంచానికి ఒక సవాలు విసురుతున్నా. జీసస్ క్రైస్ట్ డిసెంబరు 25న పుట్టాడు అని ఎవరైనా నిరూపించండి నా మెడలో శిలువ కట్టుకుంటాను. డిసెంబరు 25 మిత్రాస్ పుట్టినరోజు. మిత్రాస్ అంటే రోమన్ గాడ్. ఈయన సూర్యుడు. ఈ సన్ గాడ్‌ని పోప్ పూజించేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది ఏమిటి? కోనసీమలో స్వాతంత్య్రం వచ్చే నాటికి క్రిస్టియానిటీ 0.5 ఉండేది. ఇవాళ ఆ సంఖ్య 22 శాతం అయ్యింది. మీరు వేదం చదివితే ప్రయోజనం లేదు... జీస్‌సను నమ్మితే మాత్రమే దేవుడి దగ్గరకు వెళ్తారని ప్రచారం చేస్తుండడమే దీనికి ప్రధాన కారణం. నేను దాని గురించే మాట్లాడుతున్నా.