Narayana Case : హైకోర్టు ఆదేశాలపై స్టే..
ABN , First Publish Date - 2023-01-06T13:26:54+05:30 IST
సుప్రీంకోర్టులో టీడీపీ మాజీ మంత్రి పి.నారాయణకు ఊరట లభించింది. జగన్ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురైంది.
ఢిల్లీ : సుప్రీంకోర్టులో టీడీపీ మాజీ మంత్రి పి.నారాయణకు ఊరట లభించింది. జగన్ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురైంది. పేపర్ లీకేజ్ కేసులో హైకోర్టు రిమాండ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. జగన్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. పి.నారాయణ తరపున కోర్టులో సీనియర్ కౌన్సిల్ సిద్ధార్ధ లూద్రా, గుంటూరు ప్రమోద్, గుంటూరు ప్రేరణ వాదనలు వినిపించారు. న్యాయమూర్తులు రవీంద్రభట్, దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం కేసును విచారించింది. గతంలో నారాయణకు చిత్తూరు జిల్లా కోర్టు మాజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చారు. హైకోర్టు బెయిల్ రద్దు చేసి నారాయణను సరెండర్ కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టు నేడు స్టే ఇచ్చింది.
అసలేం జరిగిందంటే..
గత ఏడాది ఏప్రిల్ - మే నెలలో పదో తరగతి పరీక్షల నిర్వహణ సందర్భంగా ప్రశ్నా పత్రాలు లీక్ కావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నారాయణను అరెస్టు చేసిన పోలీసులు చిత్తూరు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ రిమాండ్‌ను తిరస్కరించడంతో నారాయణ బెయిల్‌పై విడుదలయ్యారు. దీనిపై పోలీసులు సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణానంతరం సెషన్స్ కోర్టు.. నారాయణకు బెయిల్ ఉత్తర్వులను రద్దు చేసి ఆయన కోర్టులో లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది.