Harirama Jogaiah: కాపుల రిజర్వేషన్‌పై హైకోర్టు మెట్లెక్కిన హరిరామజోగయ్య

ABN , First Publish Date - 2023-02-06T17:12:12+05:30 IST

తాను మరణించైనా కాపులకు రిజర్వేషన్లు సాధిస్తానని మాజీమంత్రి చేగొండి హరిరామజోగయ్య (Chegondi Harirama Jogaiah) స్పష్టం చేస్తున్నారు...

Harirama Jogaiah: కాపుల రిజర్వేషన్‌పై హైకోర్టు మెట్లెక్కిన హరిరామజోగయ్య

అమరావతి: తాను మరణించైనా కాపులకు రిజర్వేషన్లు సాధిస్తానని మాజీమంత్రి చేగొండి హరిరామజోగయ్య (Chegondi Harirama Jogaiah) స్పష్టం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి ఆయన ఓ సారి అల్టిమేటం కూడా జారీ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమరణదీక్షకు దిగారు. ఆయన దీక్షను ప్రభుత్వం భగ్నం చేసింది. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన అనేక పోరాట రూపాలను ఎంచుకుంటున్నారు. కాపులకు రిజర్వేషన్‌ (Reservation)పై జోగయ్య హైకోర్టు (High Court) ఆశ్రయించారు. కాపులకు రిజర్వేషన్‌పై న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈడబ్ల్యూఎస్‌ (EWS) కోటా కింద కాపులకు 5% రిజర్వేషన్‌ ప్రత్యేకించాలని విజ్ఞప్తి చేశారు. కాపు రిజర్వేషన్ల పిటిషన్‌ (Petition)పై రేపు మంగళవారం హైకోర్టులో విచారిస్తారు. కాపుల్లో వెనకబడినవారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాపులకు ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద రిజర్వేషన్లు కల్పించకుండా.. సీఎం జగన్‌ అడ్డుపడుతున్నారని పిటిషన్‌లో హరిరామ జోగయ్య పేర్కొన్నారు.

అగ్రవర్ణాలకు కేటాయించిన 10శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 5శాతం కాపులకు ఇస్తూ గత ఏడాది డిసెంబరు 31లోపు ఉత్తర్వులు ఇవ్వాలని కోరినా స్పందన లేదని, దీనిపై జోగయ్య ఆమరణ దీక్షకు దిగారు. పోలీసు ఉన్నతాధికారులు జోగయ్యకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల ద్వారా ఆమరణ దీక్షపై పునరాలోచించాలని చెప్పి చూశారు. 86ఏళ్ల వృద్ధాప్యంలో ఆమరణ దీక్ష వద్దని చెప్పినా జోగయ్య తన నిర్ణయం మారబోదని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పలు పార్టీలలోని కాపు సామాజికవర్గం సీనియర్‌ నాయకులు జోగయ్యను కలిసి జరిగే పరిణామాలపై చర్చించారు. అయినా దీక్ష నిర్ణయాన్ని విరమించుకోవడానికి జోగయ్య సేమిరా అన్నారు. పైగా తనను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారని ప్రకటించారు. దీంతో తన నివాసంలోనే జోగయ్య దీక్షకు దిగారు. హరిరామజోగయ్య పాలకొల్లులో చేపట్టిన దీక్షను ప్రభుత్వం భగ్నం చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-02-06T17:12:14+05:30 IST