Share News

పనిమనిషికీ ప్రభుత్వ వాహనమే!

ABN , First Publish Date - 2023-11-06T04:59:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరికన్నా పెద్ద హోదా గల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)కి ప్రభుత్వం రెండు కార్లు సమకూరుస్తుంది..

పనిమనిషికీ ప్రభుత్వ వాహనమే!

సీఎ్‌సకు రెండే.. ఐఎ్‌ఫఎ్‌సకు ఆరు!

అటవీశాఖలో ఆరుకార్ల అధికారిపై చర్చ

కాఫీ తోట ఖర్చు 16కోట్లు.. ఆదాయం ఐదు కోట్లే

అయినా ఇన్సెంటివ్‌ తీసుకోవడంపై ‘కాగ్‌’ ఆక్షేపణ

‘కంపా’ నిధులూ తీసుకురాలేని స్థితిలో సారు!

అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరికన్నా పెద్ద హోదా గల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)కి ప్రభుత్వం రెండు కార్లు సమకూరుస్తుంది.. కానీ అటవీశాఖలో ఒక ఐఎ్‌ఫఎస్‌ అధికారి ఏకంగా ఆరు కార్లు ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఆఖరికి ఇంట్లో పనిమనిషిని తీసుకొచ్చి దించేందుకు కూడా ప్రభుత్వ కారు వినియోగిస్తున్నట్లు సమాచారం. రెండు ఉద్యోగాలు చేస్తూ ఎందులోనూ ఆశించిన ఫలితాలు చూపించలేని ఆయన తనకు తానే ఇన్సెంటివ్‌లు తీసుకోవడాన్ని ఇటీవల కాగ్‌ తప్పుబట్టింది. ఇదే సమయంలో పరిమితికి మించి కార్ల వాడకంపై ఫిర్యాదు అందడంతో విజిలెన్స్‌ విభాగం ఆరా తీయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఐఎ్‌ఫఎస్‌ అధికారి ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌లో పాతికేళ్లకు పైగా పని చేస్తున్నారు. ఒక ఉద్యోగానికి అదనంగా రెండోదీ చేస్తున్న ఆయన రెండు ప్రభుత్వ వాహనాలతోపాటు నాలుగు అద్దె కార్లు ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసుకున్నారు. రెండు ప్రభుత్వ కార్లకు ప్రభుత్వ డ్రైవర్లు ఉండగా మరో నాలుగు కార్లకు అద్దెతో పాటు డ్రైవర్లకు జీతాలు ఖజానా నుంచే చెల్లిస్తున్నట్లు సమాచారం. అయితే అటవీ అభివృద్ధితో పాటు ఆయనకు ఉన్న మరో బాధ్యత సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు వాటిని వాడుతున్నారా.? అంటే అలాంటిది ఏమీలేదంటున్నారు. ఆయన వాడేది ప్రభుత్వ కారు ఒక్కటే.. మరో కారు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన ఆయన కోడలు రోజూ ఆఫీసుకు తీసుకెళతారని అటవీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ఏపీలో అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన రెడ్డమ్మ కావడంతో ప్రశ్నిస్తే పోలీసు కేసు పెట్టి జైళ్లో పెడతారన్న భయంతో ఎవ్వరూ నోరు విప్పడం లేదంటున్నారు.

నష్టాల్లో ఉన్నా సారుకు రూ.5లక్షల ఇన్సెంటివ్‌

ఇదిలా ఉండగా అటవీ అభివృద్ధికి గత టీడీపీ ప్రభుత్వంలో కేంద్రం నుంచి ఏటా 350కోట్ల నుంచి 250కోట్లకు తగ్గకుండా వచ్చేవి. కానీ ఇప్పుడు కనీసం వంద కోట్ల రూపాయలు కూడా తీసుకురాలేని సదరు ఐఎ్‌ఫఎస్‌ అధికారి పనితీరుపై అటవీశాఖ అధికారులు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బటన్‌ నొక్కుడుకు తప్ప దేనికీ రూపాయి ఇవ్వక పోవడంతో అటవీ అభివృద్ధి పూర్తిగా అరణ్య రోదన అయింది. గత ప్రభుత్వంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అరకు కాఫీ ఇప్పుడు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో ప్రభుత్వమే కాఫీ తోటలు పెంచుతోంది. సాగు, నిర్వహణ,, పురుగు మందులు, ఎరువులు ఇతరత్రా ఖర్చులు ఏటా 16కోట్ల రూపాయలు అటవీ శాఖ ఖర్చు చేస్తోంది. సాధించిన దిగుబడి ఎంతంటే కేవలం ఆరు కోట్ల రూపాయలు మాత్రమే. అయినా అద్భుతమైన ప్రగతి సాధించినట్లు ఉన్నతాధికారే ఏడాదికి ఐదు లక్షల రూపాయల ఇన్సెంటివ్‌ రూపంలో తీసుకున్నారు. ఈ విషయం కాగ్‌ దృష్టికి వెళ్లడంతో లాభాలు ఆర్జించినప్పుడు ఇన్సెంటివ్‌లు తీసుకుంటారు కానీ నష్టాలు వచ్చినా తీసుకుంటారా.? అని ప్రశ్నించింది. అదే అరకు ప్రాంతంలో ప్రైవేటు గిరిజన రైతులు కాఫీ తోటల నుంచి లాభాలు ఆర్జిస్తున్న తీరును సైతం ప్రస్తావించింది. విజిలెన్స్‌ సేకరించిన సమాచారం మేరకు ఐదు కార్లు పీసీసీఎఫ్‌ స్థాయి అధికారి వాడుతున్నట్లు రికార్డుల్లో ఉండగా హైదరాబాద్‌లో పనిమనిషి కోసం వినియోగిస్తున్న కారు ‘ఎర్రచందనం ఖాతా’కు చెందినదిగా తెలుస్తోంది. అంటే ఆ కారు ఎర్రచందనం కేసులో సీజైన కారా? లేక రెడ్‌ శాండల్‌ పేరుతో అద్దెకు తీసుకున్నదా? అనేది తెలియరాలేదు.

Updated Date - 2023-11-06T05:03:55+05:30 IST