Share News

కేజీబీవీ సమ్మెపై సర్కారు ఉలికిపాటు

ABN , Publish Date - Dec 28 , 2023 | 03:55 AM

మినిమం టైమ్‌ స్కేలు(ఎంటీఎస్‌) వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం నుంచి సమ్మెలోకి దిగిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ) ఉపాధ్యాయినిలపై ప్రభుత్వం బెదిరింపులకు దిగింది.

కేజీబీవీ సమ్మెపై సర్కారు ఉలికిపాటు

సస్పెన్షన్‌, డిస్మిస్‌ అంటూ బెదిరింపులు.. షోకాజ్‌ నోటీసులు

అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): మినిమం టైమ్‌ స్కేలు(ఎంటీఎస్‌) వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం నుంచి సమ్మెలోకి దిగిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ) ఉపాధ్యాయినిలపై ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. సమ్మెలోకి వెళ్లగానే ఉపాధ్యాయినులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20 నుంచి సమగ్రశిక్ష పరిధిలోని బోధనేతర ఉద్యోగులు సమ్మె చేస్తున్నా స్పందించని ప్రభుత్వం, కేజీబీవీ టీచర్ల విషయంలో ఆగమేఘాలపై స్పందించింది. ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యారని, క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. అవసరమైతే విధుల నుంచి సస్పెండ్‌ చేస్తామని, డిస్మిస్‌ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే, ప్రభుత్వ హెచ్చరికలను లెక్క చేసేది లేదని, సమ్మె యథావిధిగా కొనసాగుతుందని కేజీబీవీ టీచర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్‌బీటీఎస్‌ దేవి స్పష్టం చేశారు. ఇప్పటికే వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్న ఉద్యోగులను వదిలేసి ఇప్పుడే సమ్మెలోకి వచ్చిన తమకు మాత్రమే నోటీసులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. కేజీబీవీ టీచర్లకు ఎంటీఎస్‌ అమలు చేస్తామని ప్రభుత్వం జీవో కూడా జారీచేసిందని గుర్తు చేశారు. జీవోలోను అమలు చేయాలనే తాము కోరుతున్నట్టు తెలిపారు. న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె కొనసాగిస్తామన్నారు. కాగా, బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేజీబీవీ టీచర్లు ఆందోళనలు చేశారు. ఇచ్చిన మాట, జారీ చేసిన జీవోల ప్రకారం ఎంటీఎస్‌ అమలు చేసే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 03:55 AM