Share News

సరుకుల సరఫరా బంద్‌!

ABN , Publish Date - Dec 29 , 2023 | 03:18 AM

సంక్షేమానికి వేలు, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెబుతున్న జగన్‌ సర్కారు... గురుకులాల్లో విద్యార్థుల భోజనానికి సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదు.

సరుకుల సరఫరా బంద్‌!

ఐదు నెలలుగా గురుకులాల విద్యార్థుల భోజనం సరుకుల బిల్లులు పెండింగ్‌

సరఫరాదారులకు ఇక్కట్లు

గోడు పట్టించుకోని జగన్‌ సర్కారు

జనవరి నుంచి ఆపేస్తామని హెచ్చరిక

నిర్వహణ ఎలా అని ప్రిన్సిపాళ్ల ఆవేదన

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సంక్షేమానికి వేలు, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెబుతున్న జగన్‌ సర్కారు... గురుకులాల్లో విద్యార్థుల భోజనానికి సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలకు సరుకులు (ప్రొవిజన్స్‌) సరఫరా చేసిన వారికి గత ఐదు నెలలుగా బిల్లులు బకాయి పెట్టింది. దీంతో జనవరి నుంచి సరుకుల సరఫరా నిలిపేస్తామని సరఫరాదారులు హెచ్చరిస్తున్నారు. రెండేళ్లుగా టెండర్లు పిలవకుండా పాత రేట్లతోనే సరఫరా చేయించుకుంటూ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు నుంచి గురుకులాలకు సంబంధించి బిల్లులు విడుదల చేయడం లేదని వాపోతున్నారు. దీంతో తామిక అప్పులు చేసి సరుకులు సరఫరా చేయలేమని తెగేసి చెబుతున్నారు. బిల్లులు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే చాలీచాలని బడ్జెట్‌తో కునారిల్లుతున్న గురుకులాలకు సరఫరాదారులు సరుకులు నిలిపేస్తే గురుకులాలు ఖాళీ అవుతాయని ప్రిన్సిపాళ్లు ఆందోళన చెందుతున్నారు. గురుకులాలకు ఇచ్చిన బడ్జెట్‌ చాలక గ్యాస్‌కు బదులు కట్టెల పొయ్యలు పెట్టి వంటలు చేస్తున్నారని, ఇప్పుడు సరుకులు కూడా అందకపోతే పిల్లలకు భోజనం ఎలా అందించగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ శక్తి మేర అప్పులు చేసి గురుకులాలను నిర్వహిస్తున్నామని, ప్రతి నెలా బిల్లులు ఆలస్యమైనప్పుడు సరుకులు సరఫరా చేసే సరఫరాదారులకు నచ్చచెప్పలేకపోతున్నామని అంటున్నారు. గతంలో ఎప్పుడూ గురుకులాల బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం చూడలేదని, ఈ సర్కార్‌ వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. సరఫరాదారులు సరుకుల సరఫరా నిలిపేస్తే ఇక పిల్లలను ఇంటికి పంపించడం తప్ప వేరే గత్యంతరం లేదని ప్రిన్సిపాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 650 మంది గురుకులాల సరఫరాదారులు జనవరి నుంచి సరఫరా చేయలేమని అధికారులకు తెగేసి చెప్పారు. దీంతో సంక్రాంతి తర్వాత పాఠశాలలు తెరవలేమన్న ఆందోళన గురుకులాల మేనేజ్‌మెంట్‌లో ఏర్పడింది. బిల్లులు పంపించడం వరకే తమ పని అని, బిల్లులు చెల్లించాల్సింది ఆర్థిక శాఖ అధికారులేనని చెబుతున్నారు. ఏ నెల కూడా సక్రమంగా బిల్లులు చెల్లించిన దాఖలాల్లేవని వాపోతున్నారు. పాత రేట్లకు సరుకులు సరఫరా చేస్తున్న తమకు బిల్లులు ఆలస్యం కావడంతో వడ్డీలు చెల్లించుకోలేక తీవ్రంగా నష్టపోతున్నామని సరఫరాదారులు ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - Dec 29 , 2023 | 03:18 AM