వరద నీటితో గోదారి పరవళ్లు

ABN , First Publish Date - 2023-07-16T02:47:18+05:30 IST

గత రెండురోజుల నుంచి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వరద నీరు క్రమకమంగా పెరుగుతూ వస్తోంది.

వరద నీటితో గోదారి పరవళ్లు

గండిపోచమ్మ అమ్మవారి గర్భగుడిలోకి నీరు

పోలవరం స్పిల్‌వే వద్ద 27.850 మీటర్ల నీటిమట్టం

48 గేట్ల ద్వారా 1.15 లక్షల క్యూసెక్కులు విడుదల

దేవీపట్నం/పోలవరం, జూలై 15: గత రెండురోజుల నుంచి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వరద నీరు క్రమకమంగా పెరుగుతూ వస్తోంది. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలోని గండిపోచమ్మ ఆలయ సమీపానికి నీరు రాగా శనివారం నదిలో వరద ఉధృతి మరింత పెరిగి అమ్మవారి గర్భగుడిలోకి నీరు చేరింది. కాగా.. సీజన్‌లో మొదటిసారి ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే 48 గేట్ల నుంచి గోదావరి వరద జలాలు దిగువకు ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు సీలేరు, ఇంద్రావతి, శబరి ఉపనదుల జలాలు, కొండవాగుల జలాలు శనివారం నాటికి పోలవరం చేరుకోవడంతో గోదావరి నీటిమట్టం పెరిగింది. స్పిల్‌వే వద్ద గోదావరి నీటిమట్టం 27.850 మీటర్లకు చేరుకోవడంతో జలవనరులశాఖ అధికారులు ముందు జాగ్రత్తగా, 48 రేడియల్‌ గేట్లు ఎత్తి ఉంచారు. స్పిల్‌వే దిగువన గోదావరి నీటిమట్టం 17.91 మీటర్లకు చేరుకుంది. లక్షా 15 వేల క్యూసెక్కుల వరద జలాలు దిగువకు విడుదల చేశారు. అఽధికారులు, ఇంజనీర్లు అప్రమత్తమై వరద పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు రక్షణ చర్యలు చేపట్టినట్టు డివిజన్‌-1 ఈఈ పి.వెంకటరమణ తెలిపారు. ఇప్పటికే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల పనులు పూర్తయ్యాయని, భారీ వరదలు వచ్చినా ప్రధాన డ్యాం గ్యాప్‌ టు పనులు నిర్విరామంగా కొనసాగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఈ మల్లికార్జునరావు తెలిపారు.

Updated Date - 2023-07-16T02:47:18+05:30 IST