పల్నాడులో గంజాయి.. గుప్పు గుప్పు

ABN , First Publish Date - 2023-03-26T04:19:31+05:30 IST

పల్నాడులో గంజాయి గుప్పు మంటోంది. వైసీపీకి చెందిన ఓ గ్రామస్థాయి ప్రజాప్రతినిధి కన్నుసన్నల్లో జోరుగా వ్యాపారం సాగుతోంది.

పల్నాడులో గంజాయి.. గుప్పు గుప్పు

వైసీపీ నేత కుటుంబ సభ్యులే నిందితులు

ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే గుట్టుగా వ్యాపారం

ఎస్‌ఈబీ అధికారుల దాడి.. వివరాలు గోప్యం

50 కిలోల గంజాయి స్వాధీనం!

అదుపులో ముగ్గురు నిందితులు?

గురజాల టౌన్‌, మార్చి 25: పల్నాడులో గంజాయి గుప్పు మంటోంది. వైసీపీకి చెందిన ఓ గ్రామస్థాయి ప్రజాప్రతినిధి కన్నుసన్నల్లో జోరుగా వ్యాపారం సాగుతోంది. ఈ గుట్టంతా రచ్చకెక్కినప్పటికీ అధికారులు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. గురజాల మండలంలోని దైద గ్రామంలో సుమారు 10 ఎకరాల్లో పత్తి, మిర్చి తదితర పంటలతో పాటు గంజాయిను గుట్టుగా సాగు చేస్తున్నారు. ఈ గుట్టంతా ఆనోటా ఈనోటా పడి బట్టబయలైంది. ఈ సమాచారం కాస్త ఎస్‌ఈబీ అధికారులకు చేరడంతో వారు శనివారం తెల్ల వారుజామున గంజాయి సాగు చేస్తున్న పంట పొలాన్ని పరిశీలించారు. పొలంలో గంజాయి ప్యాకింగ్‌ చేసి ఉన్న రెండు డ్రమ్ములతోపాటు, కొన్ని గంజాయి మొక్కలను కూడా పెరికి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సాగుకు సంబంధించి గ్రామానికి చెందిన ప్రజాప్రతినిఽధి కుటుంబ సభ్యులే నిందితులుగా భావిస్తున్నారు. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచే గంజాయి సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు కావడంతో వీరి వెనుక నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధి హస్తమున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే దాడికి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించడం లేదు. ఉన్నతస్థాయి అధికారులైతే తమ సెల్‌ఫోన్లను స్విచ్చాఫ్‌ చేశారు. కాగా, గంజాయి సాగుకు సంబంధించి దైద గ్రామానికి చెందిన బాణావత్‌ అమర్‌నాయక్‌, నాగరాజు, లావూరి శ్రీనులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. డ్రమ్ముల్లో ప్యాకింగ్‌ చేసిన గంజాయి 50 కేజీల దాకా ఉండవచ్చని తెలుస్తోంది.

Updated Date - 2023-03-26T04:19:31+05:30 IST