నాలుగేళ్లుగా నరకం

ABN , First Publish Date - 2023-07-08T03:23:15+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, పోలీసు కేసులతో భీతిల్లి.. ప్రాణాలు అరచేత పట్టుకుని గ్రామాలు వదిలిపోయిన టీడీపీ సానుభూతిపరుల దుస్థితి ఇది. 2019 ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి

నాలుగేళ్లుగా నరకం

వైసీపీ మూక దాడులతో భయం భయం

గ్రామాలకు దూరంగా టీడీపీ కుటుంబాలు

శిథిలమైన ఇళ్లు.. బీడువారిన పొలాలు

కాందిశీకుల్లా బతుకుతున్న పల్నాడు గ్రామాల ప్రజలు

’తాళాలు వేసి.. శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లు. సాగుకు దూరమై.. తుమ్మచెట్లు మొలిచి.. బీడుగా మారిన భూములు.

.. ఇదీ పల్నాడు ప్రాంతంలోని గురజాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని పరిస్థితి.

పిడుగురాళ్ల, మాచర్ల, నరసరావుపేట, జూలై 7: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, పోలీసు కేసులతో భీతిల్లి.. ప్రాణాలు అరచేత పట్టుకుని గ్రామాలు వదిలిపోయిన టీడీపీ సానుభూతిపరుల దుస్థితి ఇది. 2019 ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అధికార గర్వంతో విచక్షణా రహితంగా దాడులకు తెగబడటంతో భీతిల్లిన తెలుగుదేశం సానుభూతిపరులు తలో దిక్కుకు వెళ్లిపోయారు. ఉన్న ఊరు, కట్టుకున్న ఇల్లు, పంట పొలాలను వదిలేసి మైళ్ల దూరం ప్రయాణించి కాందిశీకులుగా బతుకుతున్నారు. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల, మాచవరం, దాచేపల్లి, పిన్నెల్లి, మోర్జంపాడు, తురకపాలెం, అంబాపురం, మాడుగుల, జంగమహేశ్వరపురం, సమాధానంపేట తదితర గ్రామాలకు చెందిన టీడీపీ సానుభూతిపరులు ఇప్పటికీ పొరుగూర్లలోనే తలదాచుకుంటున్నారు. నాలుగేళ్లవుతున్నా ఇప్పటికీ పిన్నెల్లి, తురకపాలెం, మోర్జంపాడు తదితర గ్రామాల్లో టీడీపీ సానుభూతిపరులపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. పాత అంబాపురంలో దోమతోటి విక్రమ్‌ను వైసీపీ మూకలు హత్య చేశాయి. భట్రుపాలెంలో రాజా నాయక్‌, దాచేపల్లిలో పురంశెట్టి అంకులు, తంగెడలో బత్తుల సుబ్బులు, సయ్యద్‌ జాను, నారాయణపురంలో నీలకంఠబాబు, దాచేపల్లిలో షేక్‌ అలీషా, పిన్నెల్లిలో ఖాదర్‌బాషా, పందిటివారిపాలెంలో పిచ్చయ్యయాదవ్‌, రామాపురంలో నాగిరెడ్డి వైసీపీ అరాచక మూకల చేతుల్లో హత్యకు గురయ్యారు. జంగమహేశ్వరపాడులో 2019 ఎన్నికల తర్వాత వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. టీడీపీకి చెందిన సుమారు 70 కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాయి. వీరిలో ఆవుల మల్లయ్య కుమారుడికి వివాహం నిశ్చయమవడంతో గతేడాది జూన్‌ 3న డబ్బులు తీసుకునేందుకు దుర్గిలోని ఏటీఎంకు వచ్చి... అక్కడి నుంచి బైక్‌పై రావులపాలెం వస్తున్నారు. మించాలపాడు సమీపంలోకి రాగానే కాపుకాచి ఉన్న వైసీపీ వర్గీయులు 15 మంది ఒక్కసారిగా రాడ్లు, గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలో జల్లయ్య చనిపోయాడు. టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలు గ్రామం వదిలి వెళ్లిపోవడంతో.. వీరికి చెందిన 400 ఎకరాల వ్యవసాయ భూమి బీడుగా మారింది. ఆత్మకూరులో 200 ఎకరాలు బీడు భూమిగా మారింది. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేతలు 15 మంది గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే గ్రామంలో శుభకార్యానికి హాజరయ్యేందుకు వీరు గ్రామానికి వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు గ్రామ పొలిమేరల్లోనే అడ్డుకున్నారు.

పోలీసులే ఊళ్లోకి రానివ్వడం లేదు

వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేత తోట చంద్రయ్యను గతేడాది జనవరి 13వ తేదీ ఉదయం నడిబజారులో అందరూ చూస్తుండగానే వైసీపీ నేతలు గొంతుకోసి హత్య చేశారు. ఆతర్వాత గ్రామానికి చెందిన 15 టీడీపీ కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాయి. వీరి కుటుంబ సభ్యుడు తోట కోటయ్య మార్చి 1న అనారోగ్యంతో మార్చి చనిపోయాడు. కడచూపు చూసేందుకు టీడీపీ వారు గ్రామానికి వచ్చారు. వీరిని పోలీసులు గ్రామ శివారులోనే నిలిపివేసి, ఒకరిద్దరినే గ్రామంలోకి పంపించారు. మళ్లీ రెండు నెలల కిందట వీరు గ్రామానికి చేరుకోగా మరుసటి రోజే పోలీసులు పంపేశారు.

వైసీపీకి పోలీసుల అండదండలు!

పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ వారి దాడులు, దౌర్జన్యాలకు పోలీసులు అన్నివిధాలుగా సహకరిస్తున్నారు. వైసీపీ దాడుల్లో గాయపడిన బాధితులపైనే కేసులు పెడుతున్నారు. తురకపాలెంలో 75 ఏళ్లకు పైబడిన వృద్ధులు షేక్‌ మాబు, చాంద్‌బీ దంపతులది హత్యలు చేసే వయసు కాకపోయినా.. వైసీపీ నేతల ఒత్తిడితో పోలీసులు వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గత ఏడాది జరిగిన గొడవలో గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న షేక్‌ ఉస్మాన్‌పై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు అండగా నిలుస్తుండడంతో గ్రామాల్లోకి అడుగు పెట్టలేకపోతున్నామని టీడీపీ సానుభూతిపరులు వాపోతున్నారు.

నాడు ప్రశాంతత: యరపతినేని

పల్నాడు ప్రాంతంలో పుట్టి పెరిగిన నాకు ఫ్యాక్షన్‌ వల్ల జరిగే నష్టమేమిటో బాగా తెలుసు. అందుకే గతంలో ఫ్యాక్షన్‌ గ్రామాల్లో అన్ని వర్గాలతో శాంతి కమిటీలు ఏర్పాటు చేసి ప్రశాంతత నెలకొల్పాం. ఇప్పుడేమో ఉద్రిక్తతలు, అరాచకం, ఆక్రమణలతో పల్నాడు అట్టుడికి పోతోంది. పొరుగూర్లలో ఉంటున్న వారందరినీ సొంత ఊరిబాట పట్టించేందుకు కృషి చేస్తాను.

Updated Date - 2023-07-08T03:23:15+05:30 IST