వారానికి నాలుగు బిందెలే!
ABN , First Publish Date - 2023-05-03T02:44:25+05:30 IST
నలుగురైదుగురు కుటుంబ సభ్యులు ఉండే ఓ ఇంటికి నాలుగు బిందెల తాగు నీరు. ఆ నీటినే అంతా సరిపెట్టుకోవాలి.
నలుగురైదుగురు కుటుంబ సభ్యులు ఉండే ఓ ఇంటికి నాలుగు బిందెల తాగు నీరు. ఆ నీటినే అంతా సరిపెట్టుకోవాలి. ఆ నీళ్లు అయిపోతే.. మరో ఊరెళ్లి నీరు కొనుక్కోవాలి. కోస్తా తీరంలోనే ఇటువంటి గ్రామం ఉందంటే నమ్ముతారా?. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం పెద్దలక్ష్మీపురం గ్రామస్థుల తాగునీటి కష్టాలు ఇవి. వేసవి వచ్చిదంటే చాలు.. ఆ గ్రామంలో తాగునీటి సమస్య మొదలవుతుంది. ఈ గ్రామానికి వారానికి ఒక ట్యాంకర్ నీటిని అధికారులు సరఫరా చేస్తున్నారు. ఆ ట్యాంకర్ నీరు ఇంటికి 4 బిందెలు వస్తోంది. మళ్లీ వారం వరకు ఈ నీటినే వాడుకోవాలి. ట్యాంకర్ వచ్చే సమయానికి ఇంటి వద్ద లేకపోతే ఇక ఆ నీరూ అందదు. ఈ ఊరి జనాభా 320 మంది. నివాస గృహాలు 75. నీటి సమస్యపై మంగళవారం ఆ గ్రామ మహిళలు ఆందోళనకు దిగారు. నాలుగు బిందెల నీరు మూడు రోజులు వస్తాయని, ఆ నీరు అయిపోతే.. ఒడిసాలోని గ్రామానికి వెళ్లి డబ్బా నీరు రూ.20 కొని తాగుతున్నామని పులకల డిల్లమ్మ తెలిపారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ పి.లీలా నాగప్రసాద్‌ను ప్రశ్నిస్తే.. వారానికి రెండు ట్యాంకర్ల సరఫరాకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. - ఇచ్ఛాపురం రూరల్