వాణిజ్య పన్నులశాఖలో నలుగురి అరెస్టు

ABN , First Publish Date - 2023-06-01T04:55:13+05:30 IST

ఆడిటర్ల నుంచి డబ్బులు వసూలు చేయడం, జీఎస్టీని తక్కువగా వసూలు చేసి ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చుతున్నారన్న అభియోగాలతో రాష్ట్ర పన్నుల శాఖ(వాణిజ్య పన్నుల శాఖ)లో పనిచేస్తున్న నలుగురిని విజయవాడ పోలీసులు అరెస్టు

వాణిజ్య పన్నులశాఖలో నలుగురి అరెస్టు

ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని అభియోగాలు

ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో వీరు కీలకం

● గవర్నర్‌ను కలిసినందుకే కక్షసాధింపు: సూర్యనారాయణ

విజయవాడ, మే 31(ఆంధ్రజ్యోతి): ఆడిటర్ల నుంచి డబ్బులు వసూలు చేయడం, జీఎస్టీని తక్కువగా వసూలు చేసి ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చుతున్నారన్న అభియోగాలతో రాష్ట్ర పన్నుల శాఖ(వాణిజ్య పన్నుల శాఖ)లో పనిచేస్తున్న నలుగురిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో ఆడిట్‌ విభాగంలో జీఎస్టీవోగా పనిచేస్తున్న మోహర్‌ కుమార్‌, గుడివాడ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ సంధ్య, కమిషనర్‌ కార్యాలయంలోని సీనియర్‌ అసిస్టెంట్‌ చలపతి, విజయవాడ జాయింట్‌ కమిషనర్‌ 1 కార్యాలయంలో సబార్డినేట్‌గా పనిచేస్తున్న సత్యనారాయణలను బుధవారం అరెస్టు చేశారు. విజయవాడ–1 స్టేట్‌ టాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌ ఈ నలుగురిపై పటమట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్రైం నంబర్‌ 52/2023తో ఐపీసీ 167, 409, 477(ఎ), 201, 420, 384, 120(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నలుగురూ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్వప్రయోజనాల కోసం తనిఖీలు చేస్తూ, సమన్ల రూపంలో తప్పుడు రికార్డులు తయారు చేస్తున్నారని, రిజిస్టర్లలో తప్పుల నమోదు, రిజిస్టర్ల పరిశీలిలన వంటి విషయాల్లో ఏపీ జీఎస్టీ చట్టం–2017 నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. డీలర్లు, వ్యాపారుల ఆదాయాన్ని తక్కువగా చూపించి వారి నుంచి తక్కువ జీఎస్టీ వసూలు చేస్తున్నారని, తద్వారా భారీగా ముడుపులు అందుకొంటున్నారని ఆరోపించారు. జీఎస్టీ ఎగవేతదారులు, తక్కువ జీఎస్టీ చూపించిన డీలర్లు, ఏజెన్సీలను బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈఎస్‌ఐ, నీరు–చెట్టు వంటి పథకాల్లోని ఆడిటర్లనూ పిలిపించుకుని ఆ ఫైళ్లను మూసివేయడానికి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేశారని, పన్ను ఎగవేతదారుల నుంచి మామూళ్లు తీసుకుని జరిమానా విధించడం లేదని పేర్కొన్నారు. ఈ నలుగురినీ కొద్దినెలల క్రితమే విధుల నుంచి సస్పెండ్‌ చేయగా, హైకోర్టును ఆశ్రయించి తిరిగి విధుల్లో చేరారు. వీరిలో మోహర్‌కుమార్‌ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలోను ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. మిగిలినవారూ ఈఉద్యోగ సంఘాల్లో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కొద్దినెలలుగా ప్రభుత్వంపై ఒంటికాలిపై లేస్తోంది. ఈ నేపథ్యంలో సంఘ గుర్తింపును రద్దు చేయడానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. కాగా, ఈ నలుగురితోపాటు జాయింట్‌ కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయి అధికారులపైనా అభియోగాలు నమోదు చేశారు. అయినా ఈ నలుగురిని మాత్రమే అరెస్టు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కిందిస్థాయి ఉద్యోగులను బలి చేశారు

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉగ్రవాదులతోనో, నక్సలైట్లతోనో జతకట్ట లేదు. ఒక నిరాధార వార్తను రెండేళ్ల తర్వాత ప్రభుత్వం పైకి తీసుకొచ్చి నలుగురిని అరెస్టు చేయించింది. తొమ్మిది మందిపై శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటివరకు ఆ విచారణ ప్రారంభం కాలేదు. జాయింట్‌ కమిషనర్‌ మధుబాబు, డిప్యూటీ కమిషనర్‌ నిర్మలజ్యోతి, అసిస్టెంట్‌ కమిషనర్‌ శారదాదేవిలను వదిలిపెట్టి, వారు చెప్పినట్టు చేసిన ఉద్యోగులపై క్రిమినల్‌ చర్యలకు పూనుకుంది.

– కేఆర్‌ సూర్యనారాయణ

నా భార్య ఆచూకీ చెప్పండి

నా భార్య ఆచూకీ చెప్పాలి. దొంగతనం చేసిన వారి విషయంలో ఎలా వ్యవహరిస్తారో అలా వ్యవహరించారు. పట్టపగలు మహిళా అధికారిని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లిన రాష్ట్రంలో బతకడం అనవసరం. ఆమె ఆచూకీ చెప్పకపోతే నన్ను చంపేయండి.

గుడివాడ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌

సంధ్య భర్త శివరామరెడ్డి

Updated Date - 2023-06-01T04:55:13+05:30 IST