మాజీ ఎంపీ కేపీ రెడ్డయ్య మృతి
ABN , First Publish Date - 2023-01-14T03:36:36+05:30 IST
మచిలీపట్నం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): బందరు పార్లమెంటు మాజీ ఎంపీ కొలుసు పెదరెడ్డయ్య(81) కన్నుమూశారు.
మచిలీపట్నం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): బందరు పార్లమెంటు మాజీ ఎంపీ కొలుసు పెదరెడ్డయ్య(81) కన్నుమూశారు. విజయవాడలోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు ఆయన మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కేపీ రెడ్డయ్య పెద్ద కుమారుడు పార్థసారథి ప్రస్తుతం పెనుమలూరు శాసనసభ్యునిగా కొనసాగుతున్నారు. రెడ్డయ్య కృష్ణాజిల్లా మొవ్వ మండలం కారకంపాడులో 1942లో జన్మించారు. ఇంజనీరింగ్ చదివిన ఆయన పారిశ్రామికవేత్తగా ఎదిగారు.
కాంగ్రె్‌సతో రాజకీయం మొదలు...
1983 టీడీపీ ఆవిర్భావం సమయంలో ఉయ్యూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి కాకాని రామ్మోనరావుపై 3,095 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1985వ సంవత్సరం వరకు ఉయ్యూరు శాసనసభ్యునిగా పనిచేశారు. 1991 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావూరి సాంబశివరావుపై గెలుపొందారు. 1996లో జరిగన పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కైకాల సత్యనారాయణపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేపీ రెడ్డయ్య ఓటమిపాలయ్యారు. 2009లో ఏలూరు ఎంపీ స్థానానికి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆల్ ఇండియా యాదవ మహాసభ అధ్యక్షుడిగా 1985 నుంచి 1991 వరకు ఆయన పనిచేశారు. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండటంతో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. రెడ్డయ్య స్వగ్రామం కారకంపాడులో ఆయన అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.