Adani : అదానీ కోసం.. అడ్డగోలుగా!
ABN , First Publish Date - 2023-11-20T02:39:59+05:30 IST
అదానీ సంస్థకు జగన్ గంగవరం పోర్టులోని సర్కారు వాటాను కారుచౌకగా ఇచ్చేశారు.

బీచ్‌శాండ్’ కట్టబెట్టేందుకు రంగం సిద్ధం
బీచ్‌శాండ్ ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్, అమ్మకాలు, ఇతర ప్రక్రియలు కేవలం కేంద్ర సంస్థలు లేదా కేంద్రం అనుమతించిన రాష్ట్ర ఖనిజ సంస్థలే చేపట్టాలి. దేశ అంతర్గత భద్రత దృష్ట్యా ఇది సీరియస్ అంశం. కానీ జగన్ సర్కారుకు చట్టాలు, నియమాలు, నిబంధనలంటే లెక్కేలేదు. అవంటే గౌరవమూ లేదు. బీచ్‌శాండ్‌ను అదానీకి అడ్డగోలుగా కట్టబెట్టేందుకు సిద్ధమైంది. దేశ అంతర్గత భద్రతకు ముప్పని తెలిసినా చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతోంది.
యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
డెవలపర్ ముసుగులో ఇచ్చేందుకు సై
దేశ అంతర్గత భద్రత దృష్ట్యా
ప్రైవేటు మైనింగ్‌పై కేంద్రం నిషేధం
దానిని తుంగలో తొక్కిన సర్కారు
జ్యుడీషియల్ కమిషన్ సమీక్షలో
అడ్డంగా దొరికిపోయిన వైనం
కాంట్రాక్టర్లు నిలదీయడంతో
గుట్టువిప్పిన గనుల శాఖ
డెవలపర్‌కు ఇస్తున్నట్లు వెల్లడి ఏపీఎండీసీకి మైనింగ్ సామర్థ్యం లేనందునే
డెవలపర్‌కు ఇస్తున్నారని కమిషన్ సమర్థన ఖజానాకు చిల్లు...
అదానీ సంస్థకు జగన్ గంగవరం పోర్టులోని సర్కారు వాటాను కారుచౌకగా ఇచ్చేశారు. ఇప్పుడు బీచ్‌శాండ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ‘ఖజానాకు చిల్లు పడినా సరే! అదానీ జేబులు నిండితే చాలు’ అనేలా టెండరు డాక్యుమెంట్‌ను రూపొందించారు. ఎంఎండీఆర్ చట్టం ప్రకారం ఏపీఎండీసీ, ప్రైవేటు సంస్థతో కలిపి జాయింట్ వెంచర్ చేస్తే ప్రభుత్వ సంస్థకు 76 శాతంపైనే వాటా వస్తుంది. కానీ... 8 శాతం వాటా ఇస్తే చాలునంటూ టెండరు డాక్యుమెంటులో ప్రతిపాదించడం గమనార్హం. బీచ్‌శాండ్‌ను అప్పనంగా అదానీకి అప్పగించేందుకే ఈ తతంగం నడుపుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
దేశ అంతర్గత భద్రతను తోసిరాజని..
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘బీచ్‌శాండ్ మినరల్స్.. దేశ అంతర్గత భద్రతతో ముడిపడిన అంశం. దేశంలో ఎక్కడా ప్రైవేటు సంస్థను బీచ్‌శాండ్ మినరల్స్ మైనింగ్ చేయడానికి వీల్లేదు. ప్రైవేటు బీచ్‌శాండ్ మైనింగ్ పై నిషేధం విధిస్తున్నాం’ అని కేంద్ర సర్కారు 2019లోనే నిర్ణయం తీసుకుంది. ఎంఎండీఆర్ చట్టంలో సవరణలు కూడా చేసింది. బీచ్‌శాండ్ మైనింగ్ కేవలం ప్రభుత్వ రంగ సంస్థలే చేపట్టాలని దిశానిర్దేశం చేసింది. అయితే గౌతమ్ అదానీ స్వయంగా తాడేపల్లి వచ్చి సీఎం జగన్‌ను కలిసి అడగడంతో.. ఎలాగైనా దాన్ని కట్టబెట్టేందుకు వైసీపీ సర్కారు స్కెచ్ వేసింది. దానిని బీచ్‌శాండ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ బయటపెట్టింది. ప్రైవేటుకు మైనింగ్‌కు ఇవ్వకూడదన్న ఆదేశాలను తుంగలో తొక్కి.. జాయింట్ వెంచర్ కింద మైనింగ్ చేయకుండా.. ప్రైవేటుకే టెండర్ ఎందుకిస్తున్నారని నిలదీయడంతో గనుల శాఖ బిత్తరపోయింది. తాము డెవలపర్ పేరిట టెండర్ ఇవ్వబోతున్నామని అసలు విషయాన్ని అంగీకరించింది.
అంతర్గత భద్రతకు కీలకం..
సముద్రపు ఒడ్డున లభించే బీచ్‌శాండ్‌కు, దేశ అంతర్గత భద్రతకు ఏమిటీ సంబంధం? కేంద్రం ఆ మైనింగ్‌ను ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా ఎందుకు నిషేధం విధించింది.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ముందు బీచ్‌శాండ్ అంటే ఏమిటో, అందులో ఏమేమి ఉంటాయో తె లుసుకోవాలి. బీచ్‌శాండ్ అంటే.. సముద్రపు ఒడ్డున ఉండే అతి నాణ్యమైన ఇసుక. ఇందులో ఆరు రకాల ఖనిజాలు ఉంటాయి. 1.ఇలిమినైట్. 2.రుటైల్, 3.జిర్కాన్, 4.గార్నెట్, 5. మోనోజైట్, 6.సిలిమినైట్. వీటిని సాంకేతికంగా హై మినరల్స్‌గా పరిగణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీటికి డిమాండ్ చాలా ఎక్కువ. అన్నింటికంటే మోనోజైట్‌కు ఎక్కువ డిమాండ్, విలువ ఉన్నాయి. ఇందుకు కారణం.. దాని నిర్మాణ ఫార్ములా. ఇది అణుధార్మికతను కలిగించే థోరియంను కలిగి ఉంటుంది. థోరియంను అణువిద్యుత్ కోసం, ఇతర అణు ధార్మిక శక్తుల సృష్టికి ఉపయోగిస్తారు. అణుబాంబు తయారీలోనూ దానిదే కీలకపాత్ర. రుటైల్ నుంచి టైటానియం తీస్తారు. వీటన్నిటినీ అత్యంత విలువైన, ముఖ్యమైన ఖనిజాలుగా కేంద్రం గుర్తించింది. దక్షిణ భారత దేశంలోని సముద్ర తీరంలో అత్యంత నాణ్యమైన ఖనిజాలు ఉన్నట్లు కేంద్ర అణుశక్తి శాఖ నిర్ధారించింది. అందుకే ఈ మైనింగ్‌ను ప్రైవేటు సంస్థలకు అప్పగించకూడదని 2019లోనే ఎంఎండీఆర్ చట్టంలో సవరణలు చేసింది. బీచ్‌శాండ్ తవ్వకాలు, అమ్మకాలు, ఎగుమతుల్లో ప్రైవేటు సంస్థలను నిషేధిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఒక వేళ మైనింగ్ జరపాలనుకుంటే కేవలం కేంద్ర ప్రభుత్వ సంస్థలు.. లేదా కేంద్రం అనుమతి పొందిన రాష్ట్ర ఖనిజ విభాగాలే చేయాలి. అది కూడా కేంద్ర అణుశక్తి విభాగం అనుమతితోనే చేపట్టాలని తేల్చిచెప్పింది. అణుబాంబు తయారీకి ఉపయోగపడే థోరియం.. మోనోజైట్ నుంచి వస్తోంది. అలాగే మోనోజైట్‌తోపాటు మరో రెండు ఖనిజాలను అణువిద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తారు. కాబట్టి ఈ మినరల్స్ దేశానికి ఎంతో అవసరం. అవి దేశం దాటి వెళ్లకూడదనేది కేంద్రం ఆలోచన. పైగా దక్షిణ భారతదేశం, ప్రత్యేకించి 900 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో దొరికే బీచ్‌శాండ్ మినరల్స్ అత్యంత నాణ్యమైనవి. వాటి సంరక్షణ దేశ అంతర్గత భద్రతలో భాగమని కేంద్రం చాలా గట్టి సందేశమే ఇచ్చింది. అయినా దానిని తాకట్టు పెట్టే విధంగా జగన్ సర్కారు తెలిసి తెలిసీ కేంద్ర చట్టాలను, మార్గదర్శకాలను ఉల్లంఘించిందని స్పష్టమవుతోంది.
నిషేధ కాలంలో కంపెనీల ఏర్పాటు..
రాష్ట్రంలో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని బీచ్‌ల వెంట అత్యంత నాణ్యమైన, అమూల్యమైన బీచ్‌శాండ్ ఉంది. వాటిలో సగటున 500 మీటర్ల మేర హెవీ మినర ల్ గ్రేడ్ ఇసుక అందుబాటులో ఉందని గుర్తించారు. దీనిని ప్రాసెస్ చేస్తే అత్యంత నాణ్యమైన ఖనిజాలు బయటికొస్తాయి. వాటి విలువ వందలు, వేల కోట్లలో ఉంటుంది. అందుకే ఇక్కడి బీచ్‌శాండ్‌పై అదానీ కన్నుపడిందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రైవేటు మైనింగ్‌పై నిషేధ కాలంలో అదానీ గ్రూపు.. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా అల్లువియల్ హెవీ మినరల్స్ లిమిటెడ్, ఒడిసా కేంద్రంగా పూరీ నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలను ఏర్పాటు చేసింది. ఈ రెండింటి వివరాలను 2022లోనే ముంబై స్టాక్ ఎక్స్చేంజ్‌కు తెలిపింది. రెండు నెలల క్రితం అనూహ్యంగా గౌతమ్ అదానీ విజయవాడ వచ్చారు. తాడేపల్లికి వెళ్లి సీఎం జగన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీచ్‌శాండ్ మినరల్స్ ప్రాజెక్టు తనకే ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా గట్టిగా కోరినట్లు తెలిసింది. దీని తర్వాతే అనేక ఆసక్తి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
జేవీతో కలిపి చేయాలి..
ఎంఎండీఆర్ చట్టం ప్రకారం బీచ్‌శాండ్ మైనింగ్ చేస్తే ఏపీఎండీసీనే చేపట్టాలి. ఆ సంస్థకు అంత శక్తియుక్తులు లేవనుకుంటే జాయింట్ వెంచర్ (జేవీ) కింద ప్రైవేటు సంస్థతో కలిసి చే యాలి. అప్పుడు ప్రాజెక్టులో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి 74 శాతం వాటా, ప్రైవేటు సంస్థకు 26 శాతం వాటా ఉంటుంది. అందులోనూ మోనోజైట్ ఖనిజాన్ని ప్రైవేటు సంస్థ తవ్వి అమ్ముకోకూడదు. దానిని ఏపీఎండీసీకే అప్పగించాలి. కేంద్ర అణుశక్తి శాఖ సూచనల మేరకే దానిపై నిర్ణయాలు ఉంటాయని చట్టం చెబుతోంది ఇదే. ఇందుకు విరుద్ధంగా ఏం చేసినా చట్ట ఉల్లంఘన కిందకే వస్తుంది. తెలిసి తెలిసి ఎవరైనా చట్ట ఉల్లంఘనకు పాల్పడితే అది దేశభద్రతకు ముప్పు తీసుకొచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుందనేది నిపుణుల మాట. అయితే జగన్ సర్కారుకు అదానీ కోరిక ముందు చట్టం, రూల్స్, నిబంధనలు పెద్ద విషయాలుగా కనిపించలేదు. ఎలాగైనా అదానీకి అప్పగించే ఉద్దేశంతో పెద్ద మాస్టర్‌ప్లానే వేశారు. మైనింగ్ ప్రైవేటుకు అప్పగిస్తున్నట్లుగా కాకుండా, మైనింగ్ ఏరియా డెవలపర్ కమ్ ఆపరేటర్ పేరిట ఆ సంస్థకు ఇద్దామనుకున్నారు. గనుల శాఖ కూడా అచ్చం అలాగే టెండర్ డాక్యుమెంట్ (ఆర్‌ఎ్‌ఫపీ-రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్)ను తయారు చేసింది. దీనిని న్యాయ కమిషన్ ఆమోదం కోసం సెప్టెంబరు 22న పంపింది.
న్యాయకమిషన్‌కు ఫిర్యాదుల వెల్లువ
బీచ్‌శాండ్ టెండర్ డాక్యుమెంట్‌ను న్యాయ కమిషన్ జ్యుడీషియల్ ప్రివ్యూ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచి ప్రజలు, సంస్థల నుంచి అభిప్రాయాలు, సూచనలు కోరింది. దరిమిలా బీచ్‌శాండ్ రంగంలోనే ఉన్న కాంట్రాక్టర్ల సంఘం కార్యదర్శి శక్తిగణపతి, సదరన్ రీజియన్ మైన్స్ అండ్ మినరల్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి బాలకృష్ణన్‌తోపాటు ఇతర ప్రైవే టు సంస్థలు అనేక అభ్యంతరాలు, ప్రశ్నలు లేవనెత్తాయి. టెండర్ సాంకేతిక, ఆర్ధిక ప్రామాణిక అంశాలు.. ఏదో ఒక కంపెనీకి, లేదా దాని బినామీ కంపెనీకి కట్టబెట్టేలా ఉన్నాయని, గ్యాంబ్లింగ్ చేయడానికే అన్నట్లుగా నిబంధనలు ఉన్నాయని శక్తి గణపతి ఆరోపించారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించారని.. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఆదేశాలను ఉల్లంఘించారని న్యాయ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. జాయింట్ వెంచర్‌కు వెళ్తే 74 శాతంపైనే ఏపీఎండీసీకి వాటా వస్తుందని, అలా కాకుండా కేవలం 8 శాతం వాటా కోరడం పెద్ద గ్యాంబ్లింగ్‌లా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బడా కంపెనీల బినామీలకు టెండర్ కట్టేబెట్టేలా నిబంధనలు రూపొందించారంటూ తీవ్ర ఆరోపణలు చే శారు. వాటికి బదులిచ్చే క్రమంలో గనుల శాఖ సర్కారు దొంగ పనిని బయటపెట్టేసింది. అదానీ గ్రూపునకే చెందిన అల్లువియల్ కంపెనీ కూడా పలు సాంకేతిక అంశాలను లేవనెత్తింది.
దేశ, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే!
74 శాతంపైనే వాటాతో జాయింట్ వెంచర్ కింద మైనింగ్ చేయకుండా.. ప్రైవేటుకు 92 శాతం వాటా ఇచ్చేలా టెండర్‌ను డిజైన్ చేయడం దారుణమైన ఉల్లంఘన అని నిపుణులు చెబుతున్నారు. ఎక్కడైనా డెవలపర్‌కు మైనింగ్‌లో 92 శాతం వాటా ఇస్తారా అని కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధి గణపతి ప్రశ్నిస్తున్నారు. ‘లీజులు ఏపీఎండీసీ పేరిటే ఉన్నప్పుడు ఎంఎండీఆర్ చట్ట ప్రకారం జాయింట్ వెంచర్‌కు వెళ్లాలి. అప్పుడు ఏపీఎండీసీకి 74 శాతం, ప్రైవేటుకు 26 శాతం వాటా ఉంటుంది. ఇందుకు భిన్నంగా డెవలపర్ పేరిట టెండర్ పిలిచి ప్రైవేటుకు 92 శాతం, ఏపీఎండీసీకి 8 శాతం వాటా ఇవ్వాలని ప్రతిపాదించడం దేశ, రాష్ట్ర ప్రయోజనాలను ఉద్దేశపూర్వకంగా తాకట్టులోపెట్టడమే’ అని గనుల శాఖ రిటైర్డ్ అధికారి సాయిబాబ స్పష్టం చేశారు. ప్రభుత్వం బీచ్‌శాండ్ ను ఎవరికో ఇవ్వాలని ముందుగా నిర్ణయించుకుని టెండర్ డాక్యుమెంట్‌ను తయారు చేసిందన్నారు. ‘లీజులున్న సంస్థ తనకు 8 శాతం వాటా ఇచ్చి, 92 శాతం ప్రైవేటు తీసుకోవచ్చని చెప్పడం అంటేనే, ఎవరో పెద్ద మనుషులకు టెండర్ ఇద్దామనుకున్నారని అర్థం చేసుకోవాలి. దీనివల్ల రెండు నష్టాలు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి.. ప్రైవేటు మైనింగ్ వల్ల దేశ అంతర్గత భద్రతను దెబ్బతీసినట్లవుతుంది’ అని చెప్పారు.
సర్కారుకు 8 శాతం వాటా చాలా?
బీచ్‌శాండ్ మైనింగ్‌లో ఏపీఎండీసీకి 8 శాతం వాటా ఇస్తే చాలని టెండర్ డాక్యుమెంట్‌లో ప్రతిపాదించారు. దీనిపై విమర్శలు రేగుతున్నాయి. ‘ఇదెక్కడి ప్రాతిపదిక? ఎంఎండీఆర్ చట్టం ప్రకారం ఏపీఎండీసీ, ప్రైవేటు సంస్థతో కలిపి జాయింట్ వెంచర్ చేస్తే ప్రభుత్వ సంస్థకు 76 శాతంపైనే వాటా వస్తుంది. దీనికి భిన్నంగా కేవలం 8 శాతం వాటా కోరడం తప్పు. ప్రైవేటు సంస్థకు టెండర్ ఇచ్చేందుకే రూల్స్‌ను దానికి అనుగుణంగా డిజైన్ చేశారా అని అడుగగా.. సమాధానం ఇచ్చే క్రమంలో గనుల శాఖ అసలు విషయాన్ని బయటపెట్టింది. దేశ అంతర్గత భద్రత దృష్ట్యా బీచ్‌శాండ్ మైనింగ్‌లో ప్రైవేటు ఆపరేటర్లకు భాగస్వామ్యం కల్పించకూడదని 2019లో కేంద్రం స్పష్టమైన మార్పులు తీసుకొచ్చిందని తానే అంగీకరించింది. అంటే కాంట్రాక్టర్ల అసోసియేషన్ లేవనెత్తిన అంశానికి గనుల శాఖ డైరెక్టర్ అంగీకరించారన్న మాట. కేంద్ర ఆదేశాల ప్రకారం బీచ్‌శాండ్ తవ్వకాలను ఏ రూపేణా ప్రైవేటు సంస్థకు ఇవ్వడానికి లేదు. అలా ఇస్తే ఎంఎండీఆర్ చట్ట ఉల్లంఘన కిందకే వస్తుంది. అలాగే, దేశ అంతర్గత భద్రతకోసం తీసుకున్న నిర్ణయాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లే అవుతుంది. మరి ఏపీలో ప్రైవేటుకు ఎందుకు ఇవ్వాలనుకున్నారని ప్రశ్నించగా.. సర్కారు లోగట్టును గనుల శాఖ బయటపెట్టేసింది.
బీచ్‌శాండ్ ప్రాజెక్టు డెవలపర్ కమ్ ఆపరేటర్‌గా ఓ ప్రైవేటు సంస్థను ఎంపిక చేద్దామనుకున్నామని, అందుకే టెండర్లు పిలిచామని అంగీకరించింది. అంటే నేరుగా ప్రైవేటుకు మైనింగ్ ఇస్తే తప్పవుతుంది కాబట్టి ప్రాజెక్టు డెవలపర్ ముసుగులో ఇచ్చామని గనుల శాఖ అసలు విషయాన్ని చెప్పేసింది. నిజానికి బీచ్‌శాండ్ లీజులు రెండు ఏపీఎండీసీ పేరిటే ఉన్నాయి. మారిన నిబంధనల ప్రకారం ఆ సంస్థే మైనింగ్ చేయాలి. అంతేగాని ప్రైవేటుకు ఇవ్వకూడదు. లాజిక్‌లేని పేర్లు మార్చేసింది. ఇది చట్టవిరుద్ధమని తేలిపోయింది. ఈ అంశంపై న్యాయ కమిషన్ స్పందించింది. బీచ్‌శాండ్ మినరల్స్ తవ్వి, ఖనిజాలను వేరుచేసే శక్తిసామర్థ్యాలు ఏపీఎండీసీకి లేవని అసలు విషయం చెప్పింది. అందుకే డెవలపర్ పేరిట ప్రైవేటకు ఇవ్వజూపుతోందంటూ ప్రభుత్వ చర్యలను సమర్థించింది. ఏపీఎండీసీ పేరిటే లీజులున్నాయి. కానీ మైనింగ్ చేసే శక్తి ఆ సంస్థకు లేనప్పుడు ఎంఎండీఆర్ చట్టంలోని 17ఏ(2బీ) ప్రకారం జాయింట్ వెంచర్‌కు వెళ్లాలి. అలా వెళ్తే ఏపీఎండీసీకి 74 శాతం, ప్రైవేటు కంపెనీకి 26 శాతం వాటా ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఏపీఎండీసీకి 8 శాతం వాటా ఇస్తే చాలని టెండర్‌లో ఎందుకు ప్రస్తావించారు? ఎవరికి మేలు చేయడానికి అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. 74 శాతం వాటా తీసుకునే అవకాశం వదిలిపెట్టి.. కేవలం 8 శాతం వాటా కోరడం ఏమిటి? ప్రైవేటుకు 92 శాతం వాటా ఇవ్వడంలోని ఆంతర్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు గనుల శాఖ సమాధానమే చెప్పలేదు. దీనికి కూడా న్యాయ కమిషనే బదులిచ్చింది. టెండర్ జాయింట్ వెంచర్ కాదని, ప్రైవేటు డెవలపర్‌ది అంటూ కొత్త భాష్యం చెప్పింది.