ప్రతిపక్షాల ఓట్లపై ఫామ్-7 కత్తి
ABN , First Publish Date - 2023-11-21T03:51:13+05:30 IST
ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడానికి అధికార పార్టీ నాయకులు భారీగా ఫామ్-7 దరఖాస్తులు చేస్తున్నారు.

అధికార పార్టీ నేతల దుర్వినియోగం
‘ముసాయిదా’ తర్వాతా ఆగని వేట
కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు
పట్టించుకోని కిందిస్థాయి అధికారులు
ఈసీ ఆదేశాలూ అమలు కాని వైనం
ఓట్ల తొలగింపు ముందు విచారణ ఏదీ?
మళ్లీ అక్రమాలు జరిగే అవకాశం
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడానికి అధికార పార్టీ నాయకులు భారీగా ఫామ్-7 దరఖాస్తులు చేస్తున్నారు. ముసాయిదా జాబితా తర్వాత కూడా కుప్పలు, తెప్పలుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. అయినా పలువురు కింది స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించడం లేదు. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో ఈసీ విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. తప్పుడు ఫామ్-7 దరఖాస్తు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోతే, ఓటర్ల జాబితాలో మళ్లీ అక్రమాలు చోటు చేసుకునే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిందిస్థాయి అధికారులపై అధికార పార్టీ నేతల ఒత్తిడి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరుతో ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయడం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కష్టంగా మారింది. ప్రతిపక్షాలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర స్థాయిలో సీఈవో కార్యాలయానికి అనుబంధంగా విధులు నిర్వర్తించే అధికారులకూ పని భారం పెరిగింది.
ఇంటింటి సర్వే చేయించినా..
మరణించిన వారి ఓట్లు, చిరునామా మారినవారివి, దొంగ ఓట్లు తొలగించడానికి ఫామ్-7 ఉపయోగిస్తారు. అయితే ప్రతిపక్ష పార్టీల వారి ఓట్లను తొలగించడానికి వైసీపీ నేతలు దీన్ని ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాకు ముందు ఎన్నికల సంఘం బీఎల్‌ఏలతో ఇంటింటి సర్వే చేయించింది. అయినా జాబితాలో భారీగా అవకతవకలు ఉన్నాయి. చాలా చోట్ల మరణించినవారి ఓట్లు జాబితాలో ఉన్నాయి. చిరునామా మారిన వారి ఓట్లు కూడా ఉన్నాయి. అయితే స్థానికంగా ఉన్నవారి ఓట్లు పెద్ద సంఖ్యలో మాయమయ్యాయి. ఓటర్ల జాబితాలో కనిపించని ఓట్లు ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులవని చెబుతున్నారు. ముసాయిదా జాబితా తర్వాత కూడా ప్రతిపక్షపార్టీల ఓట్లు తొలగించడానికి అధికార పార్టీ నేతలు కుట్రపన్నినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
తప్పెవరిది?
ఫామ్-7కు సంబంధించి ఎన్నికల సంఘం నిబంధనలు కఠిన ంగానే ఉన్నాయి. అయినా ముసాయిదా జాబితాలో అర్హుల ఓట్లు తొలగిపోయాయి. అంటే తప్పెవరిది? బూత్‌లెవల్ అధికారిదా? అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఏఈఆర్‌వో)దా? ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌వో)దా? జిల్లా మొత్తాన్ని పర్యవేక్షించాల్సిన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(డీఆర్‌వో, జిల్లా కలెక్టర్)దా లేక మొత్తం వ్యవస్థను పర్యవేక్షించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘానిదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వివిధ చోట్ల దొంగ ఫామ్-7లతో ముసాయిదా జాబితాలో ఓట్లు తొలగించినా ఇప్పటికీ కింది స్థాయి అధికారులపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను పలువురు జిల్లా స్థాయి అధికారుల నుంచి బీఎల్‌వో స్థాయి వరకు పట్టించుకోలేదు. ఓట్ల చేర్పులు, మార్పులు, తొలగింపులో నిబంధనలు పాటించలేదు. పలువురు అధికారులు అధికార పార్టీకి అండగా నిలవడంతో అక్రమాలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీ నేతలు మళ్లీ అక్రమాలకు పాల్పడుతున్నా ఎన్నికల అధికారులు, ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల విధులకు వలంటీర్లను దూరంగా ఉంచాలనే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు బుట్టదాఖలవుతున్నాయి. జిల్లా స్థాయిలో ఆదేశాలను అమలు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ఎన్నికల విధుల్లో వలంటీర్లు పాల్గొంటున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
ఓటు తొలగించాలంటే...
ఒక వ్యక్తి ఓటు తొలగించడానికి ఫామ్-7 దరఖాస్తు వస్తే రిజిస్టర్ పోస్టు ద్వారా ఆ వ్యక్తికి నోటీసు ఇవ్వాలి. నోటీసు ఇచ్చిన తర్వాత 15 రోజుల వరకు సమయం ఇవ్వాలి. నోటీసుకు సమాధానం రాకపోతే బీఎల్‌వో వెళ్లి వ్యక్తిగతంగా విచారణ చేయాలి. ఒకే వ్యక్తి బల్క్‌గా ఫామ్-7లు దరఖాస్తు చేస్తే బీఎల్‌వో ఒక్కరే వెళ్లి విచారించడానికి వీలులేదు. బీఎల్‌వో, ఏఈఆర్‌వో, ఈఆర్‌వోలతో కూడిన కమిటీ విచారించాలి. విచారణ సమయంలో ఆ బూత్‌కి సంబంధించి రాజకీయ పార్టీలు నియమించిన బీఎల్‌ఏలకు సమాచారం అందించాలి. దరఖాస్తు చేసిన వ్యక్తిని విచారించాలి. నిజమని తేలితే ఓటు తొలగించవచ్చు. లేకపోతే దొంగ ఫామ్-7 దరఖాస్తు చేసినందుకు ఆ వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఫామ్-7 ద్వారా ఒక ఓటు తొలగించడానికి ఇంత ప్రాసెస్ ఉంది. అయినా ఇబ్బడి ముబ్బడిగా అర్హులైన వారి ఓట్లు తొలగించడానికి.. అధికార పార్టీ నాయకులకు అధికారులు సహకరించడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని తెలుస్తోంది. ఒక వ్యక్తి పర్సనల్‌గా 5కు మించి ఫామ్-7లు దరఖాస్తు చేయడానికి వీల్లేదనే నిబంధన ఎన్నికల సంఘం విధించింది. అయితే ఆన్‌లైన్‌లో చేసే ఫామ్-7 దరఖాస్తులకు పరిమితులు విధించలేదు. దీనిని అధికార పార్టీ నేతలు అవకాశంగా తీసుకుని ఇష్టానుసారం దరఖాస్తు చేస్తున్నారు.