ప్రముఖ కుటుంబాలకు ఒకటే సీటు!
ABN , Publish Date - Dec 28 , 2023 | 03:17 AM
తమ పార్టీలోని ప్రముఖ రాజకీయ కుటుంబాలకు ఈసారి ఎన్నికల్లో ఒకటే సీటు ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది.
టీడీపీ నాయకత్వం నిర్ణయం.. ఎవరికివ్వాలో మీరే
తేల్చుకోవాలని కేఈ, కోట్ల, పరిటాల కుటుంబాలకు సూచన
శ్రీనివాసరెడ్డికి కూడా.. అచ్చెన్న, రామ్మోహన్‌కు మినహాయింపు
అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తమ పార్టీలోని ప్రముఖ రాజకీయ కుటుంబాలకు ఈసారి ఎన్నికల్లో ఒకటే సీటు ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది. గతంలో కొంత ఉదారంగా వ్యవహరించి రెండేసి సీట్లు ఇచ్చిన ఆ పార్టీ.. ఈసారి మాత్రం కఠినంగా వ్యవహరించాలనుకుంటోంది. ఒక్క సీటే ఇస్తామంటూ.. తమ కుటుంబ సభ్యుల్లో ఎవరికి సీటు కావాలో వారే నిర్ణయించుకునే స్వేచ్ఛను ఆ కుటుంబాలకే వదిలిపెడుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాలు రాజకీయంగా ప్రముఖమైనవి. ఈ కుటుంబాలు ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కర్నూలు ఎంపీగా పోటీ చేయగా.. ఆయన సతీమణి సుజా త ఆలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశా రు. ఇద్దరూ ఓడిపోయారు. ఇప్పుడు కూడా సుజాత అదే స్థానానికి ఇన్‌చార్జిగా ఉన్నారు. ఈసారీ రెండు సీట్లు కావాలని ఈ కుటుంబం కోరినా టీడీపీ అధినేత చంద్రబాబు సున్నితంగా తిరస్కరించారు. పార్టీ విధానం ప్రకారం ఒకటే ఇస్తామని..
వారిద్దరిలో ఎవరు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయించుకుని చెప్పాలని సూచించారు. ఒకరే చేయా ల్సి వస్తే తన బదులు సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీ చేస్తారని సుజాత పార్టీ నేతలకు చెబుతున్నారు. అయితే ఆయన అసెంబ్లీకి పోటీ చేసే పక్షంలో ఆలూరు బదులు డోన్‌లో బరిలో దిగితే ఫలితం బాగుంటుందని కొందరు టీడీపీ నేతలు సూచిస్తున్నారు. డోన్‌కు ప్రస్తుతం వైసీపీ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సీటును టీడీపీ నాయకత్వం ఈసారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. డోన్‌కు సుబ్బారెడ్డి ఇన్‌చార్జిగా ఉన్నారు. ఈ సమీకరణలపై అధినేతను కలిసి చర్చించాలని సూర్యప్రకాశ్‌రెడ్డి భావిస్తున్నారు. మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం నుంచి ఆయన కుమారుడు శ్యాంబాబు పత్తికొండ అసెంబ్లీ స్థానానికి ఇన్‌ఛార్జిగా ఉన్నారు. అదే కుటుంబం నుంచి కేఈ తమ్ముడు, కేఈ ప్రభాకర్ కూడా సీటు కోరుతున్నారు. అయితే ఒక్కటే ఇస్తామని.. ఎవరు పోటీ చే యాలో ఆ కుటుంబమే నిర్ణయించుకోవాలని, వారి నిర్ణయం ప్రకారం అవకాశమిస్తానని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. కేఈ తన కుమారుడు శ్యాంకు అవకాశం కల్పించాలని కోరినట్లు చెబుతున్నారు.