Share News

కంటితుడుపు క్యాంపెయిన్‌

ABN , First Publish Date - 2023-12-03T03:14:25+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నిర్వహించిన ప్రత్యేక క్యాంపెయిన్‌ డే మొక్కుబడిగా సాగింది.

కంటితుడుపు క్యాంపెయిన్‌

ఓటు తొలగిస్తే న్యాయపరమైన చర్యలు

ప్రతి పౌరుడికీ స్వగ్రామంలో

ఓటు వేసే స్వేచ్ఛ

ఎన్నికల సంఘం మాజీ

కమిషనర్‌ నిమ్మగడ్డ

పోలింగ్‌ బూత్‌ల వద్ద వసతుల కొరత

బీఎల్‌వోలకు కుర్చీలు, బల్లలు లేవు

బడికి పని దినంతో ప్రత్యేక గదులూ లేవు

చెట్ల కింద కూర్చొని అభ్యంతరాల స్వీకరణ

సదుపాయాలు లేక ఓటర్లకూ తిప్పలు

కొన్నిచోట్ల బీఎల్‌వోల కోసం వెతుకులాట

అమరావతి/బాపట్ల/గుంటూరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నిర్వహించిన ప్రత్యేక క్యాంపెయిన్‌ డే మొక్కుబడిగా సాగింది. ఈ నెల 2, 3 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ బూత్‌ల్లో ఓటరు నమోదు, జాబితాల సవరణ, మార్పులు, చేర్పులకు ఈ నెల 2, 3 తేదీల్లో స్పెషల్‌ క్యాంపెయిన్‌ డేలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనిలో భాగంగా బీఎల్‌వోలు తమ పరిధిలోని పోలింగ్‌ బూత్‌ల వద్ద అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఉదయం 9గంటలకే ఈ కార్యక్రమం ప్రారంభించాల్సి ఉండగా పలుచోట్ల బీఎల్‌వోలు ఆలస్యంగా వచ్చారని, కొందరు బీఎల్‌వోలు అసలు హాజరు కాలేదని చెబుతున్నారు. చాలాచోట్ల బూత్‌ల వద్ద బీఎల్వోలు కూర్చోవడానికి కుర్చీలు, బల్లలు లేవు. ఓటర్లకు తగిన సదుపాయాలు లేవు. పలు ప్రాంతాల్లో బీఎల్‌వోలు కనిపించక దరఖాస్తులు, ఫిర్యాదు లు చేయడానికి వచ్చినవారు వెతుక్కోవాల్సి వచ్చింది. కొన్నిచోట్ల ఒకే కేంద్రంలో 9, 10 బూత్‌లు ఉన్నాయి. దీంతో ఏ బూత్‌ బీఎల్‌వో ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.

సూచిక బోర్డులు, బ్యానర్లు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. పోలింగ్‌ బూత్‌ల్లో అధిక భాగం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయి. విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండటం, బడి పనిదినం కావడంతో బీఎల్‌వోలకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేసే అవకాశంలేదు. పాఠశాల ఆవరణలో చెట్ల కింద, అరుగుల మీద బీఎల్‌వోలు కూర్చుని అభ్యంతరాలు స్వీకరించారు. ఓట్ల నమోదు, ఫిర్యాదులకు వచ్చిన ఓటర్లు సైతం చెట్ల కిందనే నిలబడ్డారు. దరఖాస్తులు నింపుకోవడానికి కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేకుండా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. బాపట్లలోని మున్సిపల్‌ హైస్కూల్‌లో బీఎల్‌వోలకు గది కేటాయించకపోవడంతో చాలాసేపు నిలబడే విధులు నిర్వహించారు. ఆయా పోలింగ్‌ స్టేషన్లలో బీఎల్‌వోలు ఎక్కడ ఉంటారన్న దానిపై అవగాహన లేక చాలామంది వచ్చి కూడా నిరాశతో వెనుదిరిగారు. కనీసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంలో యంత్రాంగం విఫలమైందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Updated Date - 2023-12-03T03:14:26+05:30 IST