Jagan Govt : ‘లీక్’ చేసినా గప్‌చుప్
ABN , First Publish Date - 2023-03-18T03:10:35+05:30 IST
అన్ని రాష్ట్రాలదీ ఒక దారైతే.. రాష్ట్ర ప్రభుత్వం రూటే వేరు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లోనూ పారదర్శకంగా వ్యవహరించడం లేదు. 2019 నాటి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారమే ఇందుకు ..

నియామక పరీక్షల్లో జగన్ సర్కారు దారే వేరు
తెలంగాణలో గ్రూప్-1 పేపర్ లీక్.. పరీక్ష రద్దు
మిగతా పరీక్షలు కూడా.. నిందితుల అరెస్ట్
సిట్‌తో సమగ్ర విచారణకు సర్కారు ఆదేశం
2019లో ఏపీలో గ్రామ/వార్డు
సచివాలయ ఉద్యోగాల పరీక్ష పేపర్ లీక్
ఏపీపీఎస్సీలో ఇద్దరు ఉద్యోగులపై ఆరోపణలు
సంబంధిత అభ్యర్థులకు టాప్ ర్యాంకులు
పరీక్షలు రద్దు చేయాలని విపక్షాల డిమాండ్
‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిందని పట్టించుకోని సర్కారు
లీకేజీపై విచారణ లేదు.. చర్యలూ లేవు
ఏ ఆరోపణ వచ్చినా సమర్థించుకోవడమే
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
అన్ని రాష్ట్రాలదీ ఒక దారైతే.. రాష్ట్ర ప్రభుత్వం రూటే వేరు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లోనూ పారదర్శకంగా వ్యవహరించడం లేదు. 2019 నాటి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారమే ఇందుకు నిదర్శనం. దీనిపై ఎలాంటి విచారణ, చర్యలూ లేవు. అదే తెలంగాణలో టీఎ్‌సపీఎస్సీ నిర్వహించిన పరీక్షల పేపర్ లీకైందని ఆరోపణలు రాగా అక్కడి సర్కారు వెంటనే ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది. అప్పటికే నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది. ఇతర పరీక్షలను రద్దు చేసింది. పరీక్షల నిర్వహణలో సర్కారు విఫలమైందని, చేతకానితనాన్ని ప్రదర్శించిందన్న విమర్శలు వచ్చినా రచ్చ చేయకుండా దిద్దుబాటు చర్యలు తీసుకుంది. అలాంటి ఆరోపణలే రాష్ట్రంలో వస్తే జగన్ సర్కారు పట్టించుకోలేదు. సొంత మీడియా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే వార్తలు ఎలాగూ ప్రచురించ దు. ఇతర పత్రికల్లో వార్త వచ్చినా, అందులో నిజం ఉన్నా, ఆధారాలున్నా విచారణకు ఆదేశించదు. ఏం జరిగినా అంతా అబద్ధమంటూ ఖండించడమే. అదే సర్కారుకు గిట్టనివారిపై చిన్నాచితక ఆరోపణలు వచ్చినా వాటిని భూతద్దంలో చూపించి కేసులు పెట్టడం, అరె్‌స్టలు చేయడం, వారి రిమాండ్‌ను కోర్టులు తిరస్కరిస్తే, ఇదేం పద్ధతి అంటూ రచ్చ చేయడం పరిపాటిగా మారింది.
పేపర్ లీక్‌పై విచారణే లేదు
జగన్ సర్కారు కొలువు తీరిన కొత్తలో.. 2019 సెప్టెంబరులో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.24 లక్షల ఉద్యోగాల భర్తీకి పరీక్ష నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 2019 సెప్టెంబరు 2న ఈ పరీక్షలు నిర్వహించింది. 20 లక్షల మంది పరీక్షలు రాశారు. ఏపీపీఎస్సీలో పరీక్షల విభాగంలోనే పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు పేపర్‌ను లీక్ చేశారని ‘ఆంధ్రజ్యోతి’ సెప్టెంబరు 20న వెలుగులోకి తీసుకొచ్చింది. ఒక వ్యక్తి తన కుటుంబీకులకు పేపర్ ఇవ్వడంతో వారికి టాప్ ర్యాంకు వచ్చిందని, మరో ఉద్యోగి స్వయంగా పరీక్ష రాసి టాప్ ర్యాంకు తెచ్చుకున్నారని పలు అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. 21న ప్రకటించిన ఫలితాల్లో వారికే టాప్ ర్యాంకులు రావడంతో లీకేజీ అంశంపై మరిన్ని అనుమానాలు బలపడ్డాయి. రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి. లీకేజీ ఆరోపణలపై విచారణ జరిపించాలని, పరీక్షలను రద్దు చేసి కొత్తగా నిర్వహించాలని కోరుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖరాశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, ప్రజా సంఘాల నేతలు పరీక్షలను రద్దు చేయాలని కోరారు.
ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సర్కారు నిఘా నివేదిక తెప్పించుకుంటుంది. ఆ తర్వాత శాఖాపరమైన విచారణ చేయిస్తుంది. దిద్దుబాటు చర్యలకు దిగుతుంది. అయితే, జగన్ సర్కారు ఆ పనులేవీ చేయలేదు. తమకు గిట్టని ‘ఆంధ్రజ్యోతి’లో వార్త వచ్చింది కాబట్టి అసలు స్పందించకూడదని, విచారణ, పరిశీలన వంటివి చేపట్టకూడదని భావించారు. నిజా నిజాలేమిటో నిర్ధారించకుండా ‘ఆంధ్రజ్యోతి’పై నిందలు మోపారు. కేసులు పెడతామంటూ నోటీసులు ఇచ్చారు. చివరకు ఏ విచారణ లేకుండానే లీకేజీ అంశాన్ని వదిలేశారు. ఇలాగే ప్రభుత్వంపై ఏ ఆరోపణ, విమర్శ వచ్చినా సర్కారు పట్టించుకోవడం మానేసింది. అధికారులు అవినీతికి పాల్పడినా, నేతలు అడ్డగోలు పనులు చేస్తున్నారని సాక్ష్యాధారాలతో సహా వెలుగు చూసినా విచారణ చేయకపోవడం పరిపాటిగా మారింది. దీంతో కొందరు నేతలు, అధికారులు అక్రమాలకు పాల్పడతూ కోట్లు దండుకుంటున్నారు.