అంతా.. భయానకం
ABN , First Publish Date - 2023-10-30T02:49:32+05:30 IST
ఉత్తరాంధ్రకు చెందిన పలువురు ఉద్యోగులు, పనుల కోసం వెళ్లేవారు పలాస ప్యాసింజర్, రాయగడ ప్యాసింజర్‌లో నిత్యం ప్రయాణిస్తుంటారు.
కళ్ల ముందే తోటి ప్రయాణికులు మృతి
జామి/లక్కవరపుకోట, అక్టోబరు 29: ఉత్తరాంధ్రకు చెందిన పలువురు ఉద్యోగులు, పనుల కోసం వెళ్లేవారు పలాస ప్యాసింజర్, రాయగడ ప్యాసింజర్‌లో నిత్యం ప్రయాణిస్తుంటారు. రద్దీగా ఉండటంతో బోగీల్లో నిలబడి ప్రయాణం చేస్తుంటారు. ఆదివారం రాత్రి 7గంటల సమయంలో విజయనగరం జిల్లాలో పలాస ప్యాసింజర్‌ను వెనక నుంచి రాయగడ ప్యాసింజర్ ఢీకొనడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రైలు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. బోగీల్లో ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు. అంతా భయానక పరిస్థితి ఏర్పడింది. ఈ రైల్వే లైన్‌లో మూడు లైన్లు ఉన్నాయి. మధ్య లైనులో ప్రమాదం జరిగింది. ఇదే సమయంలో ఓ లైనులో ట్యాంకర్లలో గూడ్సు, మరోపక్క లైను పట్టాలపై బొగ్గుతో గూడ్సు ప్రయాణిస్తున్నాయి. ఈ బోగీల్లో ఏ ఒక్కటైనా ట్యాంకర్లు ఉన్న గూడ్సుకు ఢీకొన్నట్టయితే పరిస్థితి మరింత భయానకంగా ఉండేదని ప్రయాణికులు చెబుతున్నారు. ఘటన స్థలాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ, శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, టీడీపీ విశాఖ పార్లమెంటు ఇన్‌చార్జి ఎం.శ్రీభరత్ తదితరులు సందర్శించారు.
20మందిలో నలుగురమే కనిపిస్తున్నాం
మాది చీపురపల్లి మండలం కాపుసంభాం గ్రామం. కొత్తవలసలో తాపీ పని చేసేందుకు 20 మంది వచ్చాం. రైలు ప్రమాదానికి గురికావడంతో అంతా చెల్లాచెదురుగా అయ్యాం. నలుగురం మాత్రమే కలసి ఉన్నాం. మాతో పాటు వచ్చిన కరణం అక్కునాయుడు చనిపోయారు.
-వెంకటరావు, రాయగడ రైలు ప్రయాణికుడు