Share News

ప్రతీ జీవో వెబ్‌సైట్‌లో ఉంచాల్సిందే

ABN , Publish Date - Dec 28 , 2023 | 03:31 AM

ప్రభుత్వం జారీచేసే ప్రతీ జీవోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

ప్రతీ జీవో వెబ్‌సైట్‌లో ఉంచాల్సిందే

ప్రభుత్వ నిర్ణయాలు తెలుసుకోవడం పౌరుల హక్కు

జీవోల జారీలో మరింత పారదర్శకత అవసరం

కొన్ని లోడ్‌ చేసి కొన్ని ఆపితే జనానికి తెలిసేదెలా?

జీవోలను వర్గీకరించి అందుబాటులో ఉంచండి

అందుకు విధివిధానాలను రూపొందించండి

గోప్యంగా ఉంచాల్సివస్తే ‘కాన్ఫిడెన్షియల్‌’ అని పేర్కొనండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం జారీచేసే ప్రతీ జీవోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.జీవోలలో రహస్యంగా ఉంచాల్సిన సమాచారం ఏదైనా ఉంటే ‘కాన్ఫిడెన్సియల్‌’గా పేర్కొనవచ్చని సూచించింది. జీవో నంబరు 1ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి, ఆ తరువాత జీవో నంబరు 18ని అప్‌లోడ్‌ చేస్తే, ఈ మధ్యలో జారీ చేసే జీవోలలో ఏముందో ప్రజల ఎలా తెలుసుకోవాలని ప్రశ్నించింది. ప్రభుత్వం జారీచేసే ప్రతీ జీవో గురించి తెలుసుకొనే హక్కు పౌరులకు ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం జారీ చేసే జీవోలను ఏ, బీ, సీ, డీగా వర్గీకరించి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసే విషయంలో విధివిధానాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం ఇచ్చే జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచే విషయంలో మరింత పారదర్శకత అవసరమని పేర్కొంది. ఈ వ్యవహారం రాజ్యాంగపరమైన విషయాలతో ముడిపడి ఉందని పిటిషనర్లు చెబుతున్న నేపఽథ్యంలో, లోతైన విచారణ జరుపుతామని పేర్కొంది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌ రఘునందనరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టకపోవడాన్ని సవాల్‌ చేస్తూ నెల్లూరుకు చెందిన జీఎంఎన్‌ఎస్‌ దేవి, గుంటూరుజిల్లాకు చెందిన కోమటి శ్రీనివాసరావు, న్యాయవాది ఎస్‌ఆర్‌ ఆంజనేయులు,

తెలుగువన్‌.కామ్‌ డిజిటల్‌ మీడియా ఎండీ కంఠంనేని రవిశంకర్‌, బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు బుధవారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ‘‘గతంలో ఉన్న జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో ప్రభుత్వం జారీ చేసే అన్ని జీవోలను అప్‌లోడ్‌ చేసేవారు. ఏపీగెజిట్‌ వెబ్‌సైట్‌లో కేవలం 5శాతం జీవోలను మాత్రమే ఉంచుతున్నారు. ప్రభుత్వ పాలన గురించి తెలుసుకొనే హక్కు ప్రజలకు ఉంది. జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచకపోవడంతో ప్రభుత్వ చట్టవిరుద్ధమైన నిర్ణయాలపై పౌరులు కోర్టును ఆశ్రయించలేకపోతున్నారు. కాన్ఫిడెన్సియల్‌, గోప్యత ముసుగులో ముఖ్యమైన జీవోలను ఉద్దేశపూర్వకంగా బయటపెట్టడం లేదు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సి.సుమన్‌ వాదనలు వినిపిస్తూ...ప్రాధాన్యత లేని జీవోలను (మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, అలవెన్స్‌లు) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడం లేదన్నారు. జీవో ప్రాధాన్యతను బట్టి మరుసటి రోజు లేదా ఆరు రోజులకు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నామన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... ప్రభుత్వం జారీ చేసే ప్రతీ జీవోను వర్గీకరించి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 100లో ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని పేర్కొంది.

Updated Date - Dec 28 , 2023 | 03:32 AM