Share News

Employees Fire : ఈ జగన్‌ మాకొద్దు!

ABN , First Publish Date - 2023-12-11T03:10:42+05:30 IST

రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే కాక, తాము దాచుకున్న సొమ్మును సైతం దారిమళ్లించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విధాలుగా తమకు ద్రోహం చేసిన జగన్‌ సర్కార్‌ మరోసారి ఎందుకని

Employees Fire : ఈ జగన్‌ మాకొద్దు!

సర్కారుపై మండిపడుతున్న ఉద్యోగులు

మాకేం చేశారంటూ నిలదీతలు.. రూ.31 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌

సీపీఎస్‌ రద్దు హామీ హుళక్కి.. పీఆర్సీ ఇచ్చినా జీతాల్లో కోత

దాచుకున్న డబ్బులూ దారిమళ్లింపు.. సకాలంలో అందని జీతాలు, పింఛన్లు

ఈఎంఐలు కట్టలేక కష్టాలు.. సర్కారీ కొలువున్నా అప్పు చేయాల్సిన స్థితి

వేతన జీవుల సంక్షేమం ఊసే లేదు.. ఈ పాలన వద్దే వద్దంటున్న ఉద్యోగులు

‘ఉయ్‌ డోంట్‌ నీడ్‌ జగన్‌’.. ఇప్పుడు ఏ ఇద్దరు ఉద్యోగులు కనిపించినా ఇదే మాట వినిపిస్తోంది. ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ నినాదంతో ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కార్యక్రమంపై ఉద్యోగులు రివర్స్‌లో ‘మాకెందుకీ జగన్‌?’ అని నిలదీస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగని ద్రోహం తమకు జగన్‌ ప్రభుత్వంలో జరుగుతోందని మండిపడుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండ మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు ఏకంగా ఆత్మహత్యాయత్నం చేయడం ఉద్యోగుల ఆర్థిక దుస్థితికి, సర్కారు నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. మరి అసలు ఉద్యోగులు ఎందుకు మండిపడుతున్నారు? గతంలో ఎన్నడూ లేని విధంగా ఎందుకు నిలదీస్తున్నారు? ఆత్మహత్యలకూ సిద్ధం కావాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే కాక, తాము దాచుకున్న సొమ్మును సైతం దారిమళ్లించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విధాలుగా తమకు ద్రోహం చేసిన జగన్‌ సర్కార్‌ మరోసారి ఎందుకని మండిపడుతున్నారు. ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ బుక్‌లెట్‌లో సచివాలయ ఉద్యోగుల నియామకానికి సంబంధించిన అంశం ప్రస్తావించడం మినహా ఈ నాలుగున్నరేళ్లలో ఉద్యోగుల సంక్షేమానికి ఏం చేశారో చెప్పలేదు. అంటే నాలుగున్నరేళ్లుగా తమ సంక్షేమం పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం దగా చేసిందని ఉద్యోగులు రగిలిపోతున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో అప్పటి విపక్ష నాయకుడిగా ప్రస్తుత సీఎం జగన్‌ ఉద్యోగులకు హామీలు గుప్పించారు. ఉద్యోగ పక్షపాత పార్టీ అని, ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకొచ్చారు. సకాలంలో పీఆర్సీలు ఇస్తాం, డీఏలు చెల్లిస్తాం, వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తాం అంటూ ఉద్యోగులను తనవైపు ఆకర్షించారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలపై ఏనాడూ పెదవి విప్పలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగారు. కేసులతో ఉద్యోగులను నానా తిప్పలు పెట్టారు. ఉద్యోగులు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న కీలక హామీ ‘సీపీఎస్‌’ రద్దు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తానని చెప్పిన జగన్‌.. మేనిఫెస్టోలోనూ దీన్ని చేర్చారు. తీరా అధికారంలోకి వచ్చాక సీపీఎస్‌ రద్దుపై మోసం చేశారు. ఓపీఎస్‌ పునరుద్ధరించకుండా జీపీఎస్‌ అంటూ ఉద్యోగులకు కంటి మీది కునుకులేకుండా చేశారు. మేనిఫెస్టోనే బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత అంటూ గత ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఇప్పుడేవీ? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ‘‘అధికారంలోకి వచ్చిన వారంలో రద్దు అన్నావ్‌.. 250 వారాలైంది. సీపీఎస్‌ రద్దు కాలేదు. ఓపీఎస్‌ పునరుద్ధరణ జరగలేదు. దీనికేనా మరోసారి ముఖ్యమంత్రిని చేయాలి?’’ అని మండిపడుతున్నారు. గత ఎన్నికలకు ముందు.. వారంలో సీపీఎస్‌ రద్దు అని చెప్పడంతో గంపగుత్తగా ఓట్లు వేశామని ఇప్పుడు మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రివర్స్‌ పీఆర్సీ

సీఎం జగన్‌ ఏకంగా ఉద్యోగుల సర్వీస్‌ మొత్తాన్ని ప్రభావితం చేసేలా పెద్ద దెబ్బకొట్టారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. చరిత్రలో ఎవ్వరూ ఇవ్వని విధంగా పీఆర్సీ ఫిట్‌మెంట్‌ 23 శాతం ఇచ్చి ఉద్యోగులు బిత్తరపోయేలా చేశారు. గత ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే జగన్‌ 11వ పీఆర్సీ ఫిట్‌మెంట్‌ 23 శాతం ఇచ్చారు. దీంతో ఉద్యోగుల వేతనాల పెరుగుదలపై ఉక్కుపాదం మోపారనే విమర్శలు వచ్చాయి. జగన్‌ ఇచ్చిన ఫీఆర్సీ ఫిట్‌మెంట్‌ ప్రభావం ఉద్యోగుల సర్వీసు మొత్తంపై పడిందని, వేతనాల పెరుగుదల మందగించేలా స్పీడ్‌ బ్రేకర్‌ వేశారని, ఉద్యోగులు విలవిలలాడిపోతున్నారని సంఘాల నేతలు చెబుతున్నారు. ఇక, ఉద్యోగుల జీతాల నుంచి కట్‌ చేస్తున్నా హెల్త్‌కార్డులు ఇవ్వలేకపోయారని వారు మండిపడుతున్నారు.

ఈ హామీల ఊసేదీ?

గత ఎన్నికలకు ముందు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తానంటూ ఊదరగొట్టిన జగన్‌ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ ఆ హామీ నెరవేర్చలేదు. దీంతో చాలీచాలని వేతనాలతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కాలం వెళ్లదీస్తున్నారు. ఎన్నిసార్లు వినతులు, విజ్ఞాపనలు ఇచ్చినా వారి గోడు పట్టించుకునే వారేలేరు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ నియమ నిబంధనల పేరుతో వారికి, వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ పథకాలకు దూరం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిలేదు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను కొందరికే వర్తించేలా మెలికలు పెట్టారు. చట్టం చేసినా దానిని ఇంత వరకు అమలు చేయలేదు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఎప్పుడో మరిచిపోయారు.

1న జీతం అందితే.. ఒట్టు

వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, పెన్షనర్లందరూ ప్రతి నెలా వేతనం కోసం ఎదురు చూసే పస్థితిని కల్పించారు. ఉద్యోగులందరికీ వేతనాలు ప్రతి నెలా 1వ తేదీనే జమైన సంఘటనలు ఈ నాలుగున్నరేళ్లలో వేళ్లమీదే లెక్కపెట్టవచ్చు. ప్రతి నెలా 1న ప్రారంభమైన వేతనాల చెల్లింపు నెల సగం వరకు సాగుతూనే ఉంటోంది. ఎవరికి ఏ నెలలో ఏ తేదీన వేతనం పడుతుందో తెలియని పరిస్థితి దాపురించింది. దీంతో తమ ఆర్థిక ఇక్కట్లు వర్ణనాతీతంగా మారాయని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో ఏనాడైనా సకాలంలో జీతాలు, పెన్షన్లు ఇచ్చారా? అని ఉద్యోగులు నిలదీస్తున్నారు.

బకాయిల మాటేంటి?

జగనన్న వచ్చారు.. జాంజాంగా అన్నీ ఇస్తారని ఉద్యోగులు ఆశపడ్డారు. అయితే, ఈ నాలుగున్నరేళ్లలో ఉద్యోగులకు ఇవ్వాల్సినవన్నీ సకాంలలో ఇవ్వకకపోగా బకాయిలు పెంచేశారు. ఆరు నెలలకోసారి ఇవ్వాల్సిన కరువు భత్యం సకాలంలో ఇవ్వకుండా పెండింగ్‌ పెట్టారు. ఇచ్చిన డీఏలకు బకాయిల చెల్లింపులు విడతల వారీగా అంటూ జీవోలిచ్చి చేతులు దులుపుకొన్నారు. ఇప్పటి వరకు ఒక్క డీఏ బకాయినీ చెల్లించలేదు. 2018 జూలై నుంచి 2021 డిసెంబరు వరకు ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన డీఏ, 11వ పీఆర్సీ బకాయిలు సుమారు రూ.19 వేల కోట్లకు చేరుకున్నాయి. అయినా, ఇప్పటికీ చెల్లించలేదు. 2023, జనవరి, జూలై డీఏలను ప్రభుత్వం ఇంత వరకు ప్రకటించలేదు. 2022, జూలై డీఏని 2023లో ప్రకటించారు. 2 డీఏలకు కలిపి ఉద్యోగులకు రూ.7 వేల కోట్ల మేర ప్రయోజనాలు నిలిచిపోయాయి. సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రతి నెలా ప్రాన్‌ ఖాతాల్లో జమ చేయాల్సి నగదును సకాలంలో జమ చేయడంలేదని ఉద్యోగులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం.

31 వేల కోట్ల బకాయి

సీపీఎస్‌ ఉద్యోగులకు సంబంధించి ఏడాది కంట్రిబ్యూషన్‌ రూ.2300 కోట్లు, ప్రభుత్వ వాటా కూడా ఏడాదికి రూ.2300 కోట్లు. ఈ ఏడాది మార్చి నుంచి ప్రభుత్వం ఉద్యోగుల జీతాల నుంచి కంట్రిబ్యూషన్‌ సొమ్ము కంట్‌ చేస్తోంది. కానీ, ఎన్‌ఎ్‌సడీఎల్‌కి చెల్లించడం లేదు. 8 నెలల బకాయిలు రూ.1,592 కోట్లుగా ఉందని లెక్కతేలింది. మెడికల్‌ బిల్లులు, సరెండర్‌ లీవ్‌లు, ఏపీజేఎల్‌ఐ రుణాలు, విశ్రాంత ఉద్యోగులకు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, వారి పీఆర్సీ, డీఆర్‌ బకాయిలు, జీపీఎఫ్‌ రుణాలు ఇతర బిల్లుల రూపంలో దాదాపుగా రూ.2,927 వేల కోట్లు నిలిపేసింది. అన్నీ కలిపి ఉద్యోగులకు ఈ నాలుగున్నరేళ్ల కాలంలో మొత్తంగా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.31.519 కోట్లకుపైగానే ఉంటాయని ఉద్యోగులు చెబుతున్నారు.

మళ్లీ ఎందుకు వద్దంటే!

ఈ నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ‘మాకేం చేశావ్‌ జగన్‌’ అనే భావన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ‘‘సకాలంలో జీతం లేదు. డీఏలు ఇవ్వడంలేదు, పీఆర్సీతో దెబ్బకొట్టారు. వేల కోట్లు బకాయిలు పెట్టేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయలేదు. సంక్షేమం మాట మరిచారు. ఇలాంటి వ్యక్తిని మరోసారి సీఎం చేయాలా?’’ అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ‘అందుకే మళ్లీ మీరు మాకు అవసరం లేదు.. ఈ జగన్‌ మాకొద్దు!’ అని తేల్చి చెబుతున్నారు.

Updated Date - 2023-12-11T03:10:49+05:30 IST