ఎల్ నినో వస్తోంది.. సన్నద్ధం కండి
ABN , First Publish Date - 2023-05-05T01:27:57+05:30 IST
రానున్న రెండు, మూడు నెలల్లో ‘ఎల్ నినో’ వృద్ధి చెందుతుందని, దీనివల్ల వచ్చే ప్రతికూల
● భారత్, దక్షిణాసియా దేశాల్లో కరువు, అధిక ఉష్ణోగ్రతలు
● నైరుతిలో అనేక ప్రాంతాల్లో వర్షాభావం
● ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
విశాఖపట్నం, మే 4(ఆంధ్రజ్యోతి): రానున్న రెండు, మూడు నెలల్లో ‘ఎల్ నినో’ వృద్ధి చెందుతుందని, దీనివల్ల వచ్చే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని దేశాలూ సన్నద్ధంగా ఉండాలని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. భారతదేశంతోపాటు మిగిలిన దక్షిణాసియా దేశాలు, ఇండోనేషియా, ఆస్ట్రేలియాల్లో ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొనడంతోపాటు తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రకటించడంతో వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పంటలు, తాగునీటిపై ప్రభావం చూపుతుంది. అయితే ఏ రెండు ఎల్‌నినో సంవత్సరాలు ఒకేలా ఉండవనే విషయాన్ని ప్రత్యేకించి ప్రపంచ వాతావరణ సంస్థ ప్రస్తావించింది. ‘మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడెక్కడాన్నే ఎల్ నినోకు సూచిక’గా పరిగణిస్తారు. ప్రధానంగా భారత దేశానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాల సీజన్‌పై ఎల్ నినో ప్రభావం చూపుతుందని ఇప్పటికే వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం వుందని రిటైర్డు వాతావరణ అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రపంచ వాతావరణ సంస్థ విడుదల చేసిన తాజా బులెటిన్‌ను పరిశీలిస్తే.. ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో మూడేళ్లపాటు కొనసాగిన లానినా ముగిసి, ప్రస్తుతం తటస్థ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా వేడెక్కుతున్నాయి. దీంతో మే నుంచి జూలై నాటికి ప్రస్తుతం ఉన్న తటస్థ పరిస్థితులు ‘ఎల్ నినో’గా మారేందుకు 60 శాతం అవకాశం ఉంది. తరువాత ‘జూన్ నుంచి ఆగస్టు’ నాటికి 70 శాతం, జూలై నుంచి సెప్టెంబరుకల్లా 80 శాతం వరకు అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ పరిధిలోని గ్లోబల్ ప్రొడ్యూసింగ్ సెంటర్ ఆఫ్ లాంగ్ రేంజ్ ఫోర్‌కాస్ట్ అధ్యయనంలో తేలింది. గతంలో ఎల్ నినో వల్ల 2016 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. దీని ప్రభావం 2017లో కూడా కొనసాగింది. అదేవిధంగా ప్రస్తుత ఏడాది జూలై నాటికి బలపడనున్న ఎల్ నినో ప్రభావం ఏడాది వరకూ ఉంటుంది. ఎల్ నినో ప్రతి రెండు నుంచి ఏడేళ్లకు ఒకసారి సంభవిస్తుంది. దీని ప్రభావం తొమ్మిది నుంచి 12 నెలలు తీవ్రంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడి వాతావరణం ప్రభావంతో ఈ ఏడాది జూలై తరువాత ఎల్ నినో మరింత బలపడుతుందని హెచ్చరించింది.
నైరుతిలో వర్షాలు తగ్గి ఖరీఫ్‌పై ప్రభావం!
మరోవైపు, దేశంలో జూన్ నుంచి సెప్టెంబరు వరకు ఉండే నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం లేదా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని దక్షిణాసియా క్లైమేట్ అవుట్‌లుక్ ఫోరం అంచనా వేసింది. గత నెల 27 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఫోరం 25వ సమావేశంలో ఈ నైరుతి సీజన్‌లో వర్షాలపై చర్చించారు. నైరుతి సీజన్‌లో భారతదేశంలో దక్షిణాదిలో ఎక్కువ ప్రాంతాలు, తూర్పు, ఈశాన్య, వాయువ్య భారతంలో పలు ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయని, మధ్య, పశ్చిమ భారతం, వాయువ్యంలో పలు ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంటుందని సమావేశం అభిప్రాయపడింది. అయితే జూన్, జూలై నెలల్లో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున ఖరీఫ్ పంటలపై ప్రభావం చూపుతుందని ఈ సమావేశంలో పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు.