ఈఎస్‌ఐలో ‘డూప్లికేట్లు’

ABN , First Publish Date - 2023-06-02T04:20:34+05:30 IST

ఈఎస్‌ఐ పేరుతో మందులు కొనుగోలు చేసి...వాటిని మార్కెట్‌లో అమ్ముకుని కోట్లు కొల్లగొట్టిన వ్యవహారం రాష్ట్రమంతటా కలకలం రేపుతోంది. ఇదే కుంభకోణంలోని మరోకోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ఉండాల్సిన మందులు మార్కెట్‌కు ఎలా చేరాయని

ఈఎస్‌ఐలో ‘డూప్లికేట్లు’

● ఒకే పీవోతో రెండు ఆర్డర్లు సృష్టించారు

● ‘మందులమాయ’లో మరో సరికొత్త కోణం

● ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఈఎస్‌ఐలో కదలిక..మొదలైన విచారణ

(అమరావతి, ఆంధ్రజ్యోతి)

ఈఎస్‌ఐ పేరుతో మందులు కొనుగోలు చేసి...వాటిని మార్కెట్‌లో అమ్ముకుని కోట్లు కొల్లగొట్టిన వ్యవహారం రాష్ట్రమంతటా కలకలం రేపుతోంది. ఇదే కుంభకోణంలోని మరోకోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ఉండాల్సిన మందులు మార్కెట్‌కు ఎలా చేరాయని ఆడిట్‌ అధికారులు పరిశీలించే క్రమంలో కొత్త సంగతులు బయటకొచ్చాయి. స్కామ్‌ ప్రధానంగా రాజమహేంద్రవరం ఈఎస్‌ఐ సెంట్రల్‌ డ్రగ్‌ స్టోరులో బయటపడిన విషయం తెలిసిందే. రాజమహేంద్రవరం సూపరింటెండెంట్‌ గత ఏడాది మే నెల 23వ తేదీన రూ.10,24,040 విలువైన మందులు కొనుగోలు చేసేందుకు లోకల్‌ పర్చేజ్‌కు సిద్ధమయ్యారు. దీనికోసం 17 పర్చేజ్‌ ఆర్డర్లను (పీవో) తయారుచేశారు. టెండర్‌ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసిన ఏజెన్సీకి వాటిని అందించారు. సదరు ఏజెన్సీ ఆ పీవోల ఆధారంగా మందులు సరఫరా చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ దశలో ఈఎస్‌ఐ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో కొన్ని మందుల తయారీ కంపెనీలతో సమావేశమై.. ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఆయా కంపెనీల దగ్గర నుంచి మందులు దిగుమతి చేసుకోవాలంటే... కంపెనీలకు పీవోలు ఇవ్వాలి. అధికారులు సరిగ్గా ఇక్కడే అత్యంత తెలివిగా వ్యవహరించారు. రాజమహేంద్రవరం సూపరింటెండెంట్‌ స్థానిక ఏజెన్సీకి గత ఏడాది మే నెలలో ఇచ్చిన పీవోలను తాజాగా తెప్పించుకున్నారు. వాటి విలువ కేవలం రూ. రూ.10,24,040 మాత్రమే. ఆ పీవోలను పూర్తిగా మార్చివేసి... వాటికి డూప్లికేట్లను సిద్ధం చేశారు. పీవో ఆర్సీ నెంబరు మార్చలేదు, రాజమండ్రి సూపరింటెండెంట్‌ పేరు మార్చలేదు.. కానీ కంపెనీ పేరు, ఎన్ని మందులు సరఫరా చేయాలి, ఎంత మొత్తానికి చేయాలన్న వాటిని మాత్రం మార్చారు.

చివరికి రాజమహేంద్రవరం సీడీఎస్‌ జీఎస్టీ నంబర్‌ కూడా పీవోలో నమోదు చేశారు. ఉదాహరణకు... రామమహేంద్రవరం సూపరింటెండెంట్‌ 23వ తేదీన డోంపేరిడన్‌ సుస్పెన్సన్‌ 30 ఎంఎల్‌ 132 బాటిల్స్‌ కావాలని ’’సిడిఎస్‌ 2 /0252/202223’’న పీవో అర్డర్‌ పెట్టారు. దాని విలువ కేవలం రూ.831 మాత్రమే. ఈ అర్డర్‌ కాపీని ఈఎస్‌ఐ ఉన్నతాధికారులు డూప్లికేట్‌ చేశారు. ఈఎస్‌ఐ ఉన్నతాధికారులు రెబికైన్డ్‌ డిఎస్‌ఆర్‌ టాబ్లెట్‌లను 2 లక్షల సరఫరా చేయాలంటూ డూప్లికేట్‌ పీవోను సిద్ధం చేశారు. దాని విలువ రూ.44 లక్షలుగా చూపించారు. ఇలా రూ.3 కోట్ల విలువైన 17 డూప్లికేట్‌ పీవోలను సిద్ధం చేశారు. ఇది ఒక కంపెనీకి ఇచ్చిన ఆర్డర్‌. మరో నాలుగు కంపెనీలకు కూడా దాదాపు ఇంతే అర్డర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్ని కంపెనీలకు డూప్లికేట్‌ పీవోలను ఇచ్చి, కోట్ల రూపాయల విలువైన మందులు దిగుమతి చేసుకున్నారు. వాటిని మార్కెట్‌లో 80 శాతం పైగా ఽఎక్కువ ధరకు అమ్ముకుని కోట్లు ఆర్జించారు. ఈ విషయం బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఒక కంపెనీ ఆడిట్‌లో మొత్తం వ్యవహారం బయటకు వచ్చేసింది. రూ.10 లక్షల విలువైన పీవోల ఆధారంగా రూ.3 కోట్ల విలువైన పీవోలు సృష్టించి ఈఎస్‌ఐ పేరుతో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. మరోవైపు, ఈఎస్‌ఐ అధికారుల దందాపై ‘ఈఎస్‌ఐలో మందులమాయ’ పేరిట ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం ఆ సంస్థలో కలకలం రేపింది. ఈ కుంభకోణంపై కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి స్పందించారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఆదోని ఆస్పత్రుల్లో పర్చేజ్‌ ఆర్డర్లను క్షుణ్ణంగా తనిఖీలు చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు.

Updated Date - 2023-06-02T04:20:34+05:30 IST