DSC : ‘డీఎస్సీ’పై పచ్చి దగా!
ABN , First Publish Date - 2023-12-11T03:02:51+05:30 IST
‘‘ఈ ప్రభుత్వంలో అక్షరాలా 23 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓవైపు ప్రభుత్వ బడులు బాగుచేయాలి. టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. మన పిల్లలకు బాగా చదువులు చెప్పాలి. కానీ, ఈ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోవట్లేదు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ
టీచర్ పోస్టుల ఊసెత్తని జగన్
నాలుగేళ్ల నుంచి డీఎస్సీపై ప్రచారం
మధ్యలో ఖాళీలే లేవంటూ ప్రకటన
మళ్లీ భర్తీ చేస్తామంటూ మాటలు
ఇప్పటికీ అడ్రస్ లేని నోటిఫికేషన్
డీఎస్సీ కోసం 5 లక్షల మంది నిరీక్షణ
ప్రభుత్వం నిండా ముంచిందని ఆవేదన
కొత్త ప్రభుత్వంపైనే అభ్యర్థుల ఆశలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘‘ఈ ప్రభుత్వంలో అక్షరాలా 23 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓవైపు ప్రభుత్వ బడులు బాగుచేయాలి. టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. మన పిల్లలకు బాగా చదువులు చెప్పాలి. కానీ, ఈ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోవట్లేదు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ వేస్తామని ప్రతి ఒక్కరికీ చెబుతున్నా. ఖాళీలన్నీ భర్తీ చేస్తాం’’- ఇదీ 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో సీఎం జగన్ ఇచ్చిన హామీ. కానీ, ఆయన అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు దాటిపోయింది. మెగా డీఎస్సీ కాదు కదా సాధారణ డీఎస్సీ కూడా వేయలేదు. ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. ఏటా వేల మంది టీచర్లు రిటైర్ అయిపోతూ ఖాళీలు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఓ దశలో టీచర్ పోస్టులు ఖాళీగా లేవని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రతిపక్షాలు ఆధారాలతో సహా ఖాళీ పోస్టులను బయట పెట్టేసరికి.. మాట మార్చి.. స్వల్ప సంఖ్యలోనే పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. పోనీ.. వాటినైనా భర్తీ చేశారా? అంటే లేదు. నాలుగేళ్లుగా ప్రతినెలా డీఎస్సీ అంటూ ఊరిస్తూ వచ్చిన జగన్ ప్రభుత్వం.. ఇప్పుడసలు డీఎస్సీ ఊసే ఎత్తడం లేదు. ఓవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత పెరుగుతున్నా, లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నా జగన్ ప్రభుత్వం కనీసం పట్టనట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
ఆ ఆవేశం ఏమైంది?
డీఎస్సీ, పోస్టుల భర్తీపై ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన ప్రసంగాలను గుర్తుచేసుకుంటే ఆయన ఆవేశపు హామీలే కళ్ల ముందు కదులుతాయి. అప్పట్లో నిరుద్యోగాన్ని తరిమేస్తానని, చంద్రబాబు ప్రభుత్వం లక్షల ఉద్యోగాలను ఖాళీగా పెట్టిందని ఆవేశంగా మాట్లాడేవారు. అలా ఆవేశంగా ఇచ్చిన హామీలకే నిరుద్యోగ యువత ఆకర్షితులయ్యారు. లక్షలాది ఉద్యోగ ఖాళీలను, 23 వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తానని ఇచ్చిన హామీని నమ్మారు. కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. మెగా డీఎస్సీ అనే హామీ ఒకటి ఉందని, నెరవేర్చలేకపోయామని ఆయనలో కనీసం స్పృహ కూడా లేకుండా పోయిందని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. అనేక సందర్భాల్లో నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేసినా.. వారిని అణిచి వేసేందుకే ప్రయత్నించారు తప్ప.. హామీని నెరవేర్చాలని మాత్రం ప్రయత్నించక పోవడం గమనార్హం. అప్పట్లో 23వేల ఖాళీలు ఉన్నాయని, వాటిని మెగా డీఎస్సీతో భర్తీ చేస్తామని ఆవేశంగా హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వ చ్చాక 23 పోస్టులు కూడా భర్తీ చేయలేదు. పైగా 23వేల ఖాళీలు మాయమైపోయినట్లుగా లెక్కలు చూపించారు.
ప్రకటనలే మిగులు!
వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచీ డీఎస్సీ వేస్తామని చెబుతూ వచ్చింది. మరీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ప్రకటనలు ఇంకా పెరిగాయి. కనీసం నెలకోసారి ఆయన వైసీపీ అనుకూల మీడియాలో ‘త్వరలో డీఎస్సీ’ అంటూ ప్రకటనలు చేశారు. ఆయన ప్రకటనలు చూస్తే కొద్ది రోజుల్లోనే డీఎస్సీ వేస్తారని అనిపించేది. కానీ, ఏళ్లు గడిచినా.. ఆయన ఇవే మాటలు చెబుతుండడంతో నిరుద్యోగులు ఈ ప్రభుత్వంపై ఆశలు వదులేసుకున్నారు. మరోవైపు, టీచర్ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయని ప్రభుత్వం గతంలో వివాదాస్పదంగా మిగిలిన నోటిఫికేషన్లలో అర్హులను కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకుని వాటినే ‘కొత్త ఉద్యోగాలు’గా ప్రచారం చేసుకుంటోంది. 2008 డీఎస్సీలో 1,910 మంది, 1998 డీఎస్సీలో 4,534 మందిని మినిమం టైమ్ స్కేలు ప్రాతిపదికన ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. చిత్రం ఏంటంటే 1998 డీఎస్సీకి చెందినవారిలో కొందరు ఈ ఏడాది ఉద్యోగంలో చేరిన నెల రోజుల్లోపే రిటైర్ అయిపోయారు. కనీసం ఒక్క నెల పూర్తి జీతం కూడా అందుకోలేదు. అయినా, వారిని కూడా ఉద్యోగాలు పొందిన వారి జాబితాలో ప్రభుత్వం చూపిస్తోంది. కాగా ఏడాది కిందట ఓ సందర్భంలో కేవలం 717 టీచర్ పోస్టులే ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. మళ్లీ కొంతకాలానికి మాట మార్చి 18,520 ఖాళీలున్నాయని, అయితే వాటిలో 8,366 పోస్టులు భర్తీ చేస్తే సరిపోతుందని చెప్పుకొచ్చింది. ఈ లెక్కలు చెప్పిన కొద్ది రోజులకే పాఠశాలల వారీగా ఖాళీల వివరాలు పంపాలని ఆదేశించింది. దీంతో ప్రతిసారీ లెక్కలు వేయడం, మళ్లీ వాటిని మార్చడం తప్ప నిజంగా టీచర్ పోస్టులు భర్తీ చేసే ఉద్దేశం ఏమాత్రం లేదని ‘టెట్’ అర్హులు అంచనాకు వచ్చేశారు. వైసీపీ హయాంలోనే నిర్వహించిన ‘టెట్’లో 5 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అంతకుముందు అనేక మంది టెట్ అర్హత సాధించినవారున్నారు. ఇలా 5 లక్షల మందికి పైగా నిరుద్యోగులు టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ ప్రభుత్వానికి మరో మూడు మాసాల్లో గడువు తీరిపోనున్న నేపథ్యంలో ఇక, ప్రకటన రాదని.. వచ్చే ప్రభుత్వమైనా తమను పట్టించుకోవాలని వారు కోరుతున్నారు.