విజయ్‌పై తొందరపాటు చర్యలొద్దు

ABN , First Publish Date - 2023-03-30T02:58:17+05:30 IST

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది.

విజయ్‌పై తొందరపాటు చర్యలొద్దు

సీఐడీ అధికారులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. కేసుకు సంబంధించిన అన్ని వివరాలతో తమ ముందు హాజరు కావాలని సీఐడీ అధికారులు విజయ్‌కు ఇచ్చిన 41ఏ నోటీసులపై అభ్యంతరం తెలిపింది. ఏ ఫైళ్లతో హాజరుకావాలో నిర్దిష్టంగా పేర్కొనకుండా అస్పష్టంగా నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఏప్రిల్‌ 24 వరకు విజయ్‌పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీ అధికారులను ఆదేశించింది. విచారణను ఏప్రిల్‌ 17కి వాయిదా వేసింది. బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి ఈ మేరకు ఆదేశాలిచ్చారు. నర్సీపట్నంలోని ఇంటి నిర్మాణం కోసం ఫోర్జరీ చేసి నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌వోసీ) సృష్టించారనే ఆరోపణలతో నమోదైన కేసులో అన్ని ఫైళ్లతో తమ ముందు హాజరు కావాలని రాజమహేంద్రవరం సీఐడీ అఽధికారులు ఇచ్చిన 41ఏ నోటీసులను సవాల్‌ చేస్తూ చింతకాయల విజయ్‌ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వీవీ సతీశ్‌ వాదనలు వినిపించారు. ఏ ఫైళ్లతో విచారణకు హాజరు కావాలో సీఐడీ అధికారులు నిర్దిష్టంగా పేర్కొనలేదన్నారు. ఫైళ్లు తీసుకురాలేదనే కారణం చూపి పిటిషనర్‌ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకొనే ప్రమాదం ఉందన్నారు. ఆ వివరాలు పరిగణనలోకి న్యాయస్థానం సీఐడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2023-03-30T02:58:17+05:30 IST