YCP Govt Votes: పిల్లలతోనూ ఓటేయిద్దాం!
ABN , First Publish Date - 2023-07-03T02:28:37+05:30 IST
రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ‘ఎలాగైనా’ గెలవాలని భావిస్తున్న అధికార పార్టీ వైసీపీ నేతలు.. దొంగదారులు వెతుకుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపునకు దొడ్డిదారి వ్యూహాలు
పార్టీ సానుభూతిపరుల కుటుంబాలకు
చెందిన పిల్లలను ఓటర్లుగా చేర్చే కుయుక్తి
వివరాలు సేకరించే బాధ్యత వలంటీర్లకు
ఆధార్, రేషన్ కార్డుల మార్ఫింగ్‌తో జాబితాలోకి
ఒక్కో నియోజకవర్గంలో 7-8 వేల ఓట్లకు ఎత్తుగడ
పీలేరు నియోజకవర్గంలో బయటపడ్డ పన్నాగం
వలంటీర్లకు వైసీపీ నేత సహదేవరెడ్డి సందేశాలు
‘ఆంధ్రజ్యోతి’కి చిక్కిన మెసేజ్‌లు
వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం అధికార పార్టీ నేతలు అన్ని దొడ్డిదారులూ తొక్కుతున్నారు. పలు ప్రాంతాల్లో ఒకే డోర్ నంబర్‌పై వందలాది దొంగ ఓట్లు నమోదు చేయించిన ఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. ప్రతిపక్షాలకు చెందిన ఓట్లను తొలగిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. తాజాగా మరో కొత్త ఎత్తుగడ బయటపడింది. మైనారిటీ తీరని 15 నుంచి 18 ఏళ్లలోపు వారిని కూడా ఓటర్లుగా చేర్పించి, వారితో దొంగ ఓట్లు వేయించేందుకు వ్యూహం పన్నారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ‘ఎలాగైనా’ గెలవాలని భావిస్తున్న అధికార పార్టీ వైసీపీ నేతలు.. దొంగదారులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో తాజాగా చిత్తూరు జిల్లా పీలేరులో వెలుగు చూసిన ఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ఓటు హక్కు లభిస్తుంది. అయితే, వైసీపీ సానుభూతి పరుల కుటుంబాల్లోని 15-18 ఏళ్ల లోపు వారిని కూడా ఓటర్లుగా మార్చేసేందుకు, ఓటర్ల జాబితాలో చేర్చేసేందుకు నేతలు రంగంలోకి దిగారు. ఈ అనైతిక చర్యలకు వలంటీర్లను వాడేస్తున్నారు. వైసీపీ సానుభూతిపరుల కుటుంబాల్లో 15 నుంచి 18 ఏళ్లలోపు వయసున్న బాల, బాలికల వివరాలు సేకరించి తమకు అందజేయాలని వలంటీర్లకు అధికార పార్టీ నేతలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వలంటీర్లకు అధికార పార్టీ నేతలు పంపిన సందేశాలు ‘ఆంధ్రజ్యోతి’కి అందాయి. చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో కొందరు వలంటీర్లకు ఆ నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడు సహదేవరెడ్డి ఒక మెసేజ్ పంపారు. ‘‘మన పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి, మన ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మీమీ క్టస్లర్లో ఉన్న 15 నుంచి 18 ఏళ్ల వయసున్న వారి ఆధార్, వారి కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు, రెండు ఫొటోలు సేకరించి అందజేయండి’’ అని పేర్కొన్నారు. ఇలాంటి సందేశాలు మరికొన్ని నియోజకవర్గాల్లోనూ వలంటీర్లకు అందాయని సమాచారం.
వాస్తవానికి వలంటీర్లు ప్రభుత్వపరమైన విధులు తప్ప పార్టీకి సంబంధించిన పనులు అప్పగించకూడదు. అయినప్పటికీ వైసీపీ నేతలు నేరుగా వలంటీర్లకు సందేశాలు పంపి, ఆదేశాలు జారీ చేస్తుండడం వివాదాస్పదంగా మారింది. తక్కువ వయసున్న వారిని కూడా ఓటర్ల జాబితాలో చేర్చే అనైతిక పనులకు వలంటీర్లను వాడుకోవడం రాజకీయ వర్గాలను విస్మయపరుస్తోంది. వైసీపీ నేతలు తమ రాజకీయ అవసరాల కోసం బాల బాలికలను అనైతికంగా ఓటర్ల జాబితాలో చేర్చేద్దామనే ఎత్తుగడ వేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గ్రామీణ స్థాయిలో వైసీపీ నేతలు చెబుతున్నదాని ప్రకారం.. 15-18 ఏళ్లలోపు వయసున్న వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డులను సేకరించి వాటిని మార్ఫింగ్ చేయిస్తారు. వారంతా 18 ఏళ్లు పైబడిన వారేనంటూ కొత్త కార్డులు తయారు చేయిస్తారు. వాటి ఆధారంగా ఓటర్ల జాబితాలో వారి పేర్లు నమోదు చేయిస్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే మార్ఫింగ్ చేసిన ఆధార్ కార్డు, రేషన్ కార్డులు చూపిస్తారు. వాటిలో వాస్తవమైనవి ఏవో... మార్ఫింగ్ చేసినవి ఏవో తెలుసుకోవడం కష్టం. దీంతో తమ వ్యూహం పారుతుందని అధికార పార్టీ నేతల్లో ధీమా వ్యక్తం అవుతోంది. ఫలితంగా ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఏకంగా ఏడెనిమిది వేల ఓట్లు అడ్డంగా దక్కించుకోవచ్చని లెక్కలుగడుతున్నారు. ప్రసుత్తం ఈ విషయం వెలుగుచూడటంతో ప్రతిపక్ష పార్టీలు అప్రమత్తం అయ్యాయి. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి, ఈ ఓట్ల చేరికలను అడ్డుకోవడంతోపాటు వలంటీర్లను అనైతిక పనులకు వాడుకోవడంపైనా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నాయి. వైసీపీ నేతలకు అనైతికంగా ఓట్లు వేయించుకోవడం అలవాటైపోయిందని విపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. గతంలో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ నేతలు పొరుగు జిల్లాల వారిని తిరుపతి వాసులుగా చూపిస్తూ మార్ఫింగ్ చేసిన గుర్తింపు కార్డులు ఇచ్చి పోలింగ్ బూత్‌లకు పంపారు. వారిలో కొందరిని విపక్ష నేతలు, మీడియా ప్రతినిధులు గుర్తించి ప్రశ్నించే సరికి సదరు నకిలీ ఓటర్లు ఉడాయించారు. వారి వద్ద ఉన్న ఆధార్, ఓటర్ కార్డుల్లో తిరుపతి నగరంలోని ఇళ్లకు సంబంధించిన చిరునామాలు ఉండడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.