నకిలీ వేలిముద్రతో పింఛన్ల పంపిణీ
ABN , First Publish Date - 2023-08-02T04:01:02+05:30 IST
నకిలీ వేలి ముద్రలతో రెండు నెలలుగా సాగిపోతున్న పింఛన్ల పంపిణీ వ్యవహారం మంగళవారం గ్రామస్థుల ఫిర్యాదుతో వెలుగుచూసింది.
బెంగళూరులో ఉంటూ 2 నెలలుగా పెన్షన్లు పంపిణీ చేయిస్తున్న వలంటీర్
పామూరు, ఆగస్టు 1: నకిలీ వేలి ముద్రలతో రెండు నెలలుగా సాగిపోతున్న పింఛన్ల పంపిణీ వ్యవహారం మంగళవారం గ్రామస్థుల ఫిర్యాదుతో వెలుగుచూసింది. ప్రకాశం జిల్లా పడమటకట్టకిందపల్లి పంచాయతీ పరిధిలోని కందులవారిపల్లికి చెందిన రాచగొర్ల ప్రసాద్‌యాదవ్ వలంటీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన పరిధిలో 18 సామాజిక పింఛన్లు ఉన్నాయి. కొంతకాలంగా ప్రసాద్ బెంగళూరులో ఉంటూ.. వచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం తన బొటన వేలితో డూప్లికేట్ వేలిముద్రను రూపొందించారు. దీనిని కుటుం బసభ్యులకు ఇచ్చి వలంటీర్ పోర్టల్‌లో లాగిన్ చేయించి పింఛన్లు పంపిణీ చేయిస్తున్నారు. లబ్ధిదారులను తన ఇంటికే పిలిపించుకుని సొమ్ము అందచేస్తున్నారు. దీనిపై మంగళవారం కొందరు గ్రామస్థులు.. సచివాలయ కార్యదర్శి షేక్ జానీకి ఫిర్యాదు చేశారు. కార్యదర్శి వలంటీర్ ఇంటికి వెళ్లి.. అప్పటికే ఒకరిద్దరికి పింఛన్ సొమ్ము ఇచ్చినట్టు గుర్తించారు. వలంటీర్ లేకుండా పింఛను ఎలా ఇస్తున్నారని ప్రశ్నించిన కార్యదర్శి.. ఈ విషయాన్ని ఎంపీడీవోకు తెలిపారు. ఎంపీడీవో ఆదేశాలతో అక్కడ ఉన్న రూ.55 వేల పింఛన్ల మొత్తాన్ని కార్యదర్శి స్వాధీనం చేసుకున్నారు.