దెందులూరు ‘శ్రీమంతులు’
ABN , First Publish Date - 2023-01-29T02:54:40+05:30 IST
సొంతూరిలో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, దేవాలయాలకు స్థలాలిచ్చి, భవనాలు నిర్మించి ఇచ్చారు.
అనాథల కోసం 3 కోట్ల ఇల్లు విరాళం
ఇప్పటికే కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆలయాలకు స్థలాలు, భవనాల నిర్మాణం
జన్మభూమి కోసం మొటపర్తి కుటుంబం దాతృత్వం
దెందులూరు, జనవరి 28: సొంతూరిలో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, దేవాలయాలకు స్థలాలిచ్చి, భవనాలు నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు అనాథ పిల్లల కోసం దాదాపు 3 కోట్ల విలువైన ఇల్లు, స్థలాన్ని ప్రభుత్వానికి రాసిచ్చారు. ఏలూరు జిల్లా దెందులూరుకు చెందిన దివంగత పారిశ్రామికవేత్త మొటపర్తి వెంకట సుబ్బారావు, రామచంద్రాయమ్మ కుటుంబం జన్మభూమి కోసం దాతృత్వం చాటుకుంది. వెంకట సుబ్బారావు కుమారుడు వెంకటేశ్వరావు (వెంకట్)కు హైదరాబాద్, విజయవాడ, గుడివాడ, గన్నవరం, విశాఖపట్నంలో పలు పరిశ్రమలు, విద్యా సంస్థలు, బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. సుమారు పాతికేళ్ల క్రితం వారు హైదరాబాద్ వెళ్లిపోయారు. అప్పుడప్పుడు స్వగ్రామం వస్తుంటారు. సొంతూరికి వచ్చినప్పుడు ఉంటున్న 12 గదుల రెండంతస్తుల భవనాన్ని తాజాగా దానం చేశారు. అనాథ ఆశ్రమానికి ఉపయోగించుకునేందుకు స్ర్తీ, శిశు సంక్షేమ శాఖకు రిజిస్ర్టేషన్ చేసి శనివారం కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు వెంకట్, రామచంద్రాయమ్మ అందజేశారు. పుట్టి, పెరిగిన ఊరి కోసం కోట్ల విలువైన భూములు, భవనాలు ఇచ్చిన దాతను తన జీవితంలో చూడలేదని కలెక్టర్ అభినందించారు. చిన్నారులకు పుస్తకాలు, బ్యాగ్‌లు అందజేశారు. ఇంతకుముందు దెందులూరులోని ఎంపీడీవో, తహసీల్దార్, పోలీస్ స్టేషన్, టీటీడీ కల్యాణ మండపం, మీ సేవ కేంద్రం, జిల్లా పరిషత్ హైస్కూల్, ఉన్నత పాఠశాల, గ్రంథాలయం, వాటర్ ప్లాంట్, విద్య శాఖ కార్యాలయం, నర్సింగ్ కాలేజీ, పలు దేవాలయాలు, విద్యా సంస్థలకు వెంకట్ కుటుంబం స్థలాలను ఇవ్వడంతో పాటు భవనాలను నిర్మించి ఇచ్చింది.