Magunta Srinivasulu Reddy: ఢిల్లీ మద్యం స్కాంలో.. మాగుంటకు ఈడీ నోటీసులు

ABN , First Publish Date - 2023-03-17T02:49:03+05:30 IST

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలంటూ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.

Magunta Srinivasulu Reddy: ఢిల్లీ మద్యం స్కాంలో..  మాగుంటకు ఈడీ నోటీసులు

రేపు హాజరుకు ఆదేశం.. మిగతా నిందితులతో కలిపి విచారణ?

హోటళ్లలో భేటీలు, సౌత్‌ గ్రూపు వ్యవహారాలు, ముడుపులపై ఆరా!

ఈ కుంభకోణంలో ఇప్పటికే మాగుంట కుమారుడి అరెస్టు

ప్రస్తుతం తిహార్‌ జైలులో రాఘవ్‌.. బెయిల్‌పై 23న విచారణ

పిళ్లై కస్టడీ మరో 5 రోజులు పొడిగింపు

న్యూఢిల్లీ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలంటూ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. శనివారం (18న) ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో అరెస్టయిన అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో మాగుంటను ముఖాముఖి కూర్చోబెట్టి విచారిస్తామని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఈడీ గురువారం తెలిపింది. విడిగా కూడా ప్రశ్నించే అవకాశముంది. ఈ కుంభకోణంలో మాగుంట పాత్ర ఉన్నట్లు ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్లు, పలువురి రిమాండ్‌ అప్లికేషన్లలో ఈడీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేతలకు రూ.100 కోట్ల మేర సౌత్‌ గ్రూపు ముడుపులు చెల్లించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ సౌత్‌ గ్రూపులో మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌ మాగుంట, కవిత, అరబిందో ఫార్మా సంస్థ డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి భాగస్వాములుగా ఉన్నారని చెబుతోంది. సమీర్‌ మహేంద్రుకు చెందిన ఇండోస్పిరిట్స్‌ కంపెనీలో రాఘవ్‌కు 32.5 శాతం వాటాలు ఉన్నాయని ఈడీ గుర్తించింది. మద్యం విధానం రూపకల్పనలో భాగంగా జరిగిన పలు సమావేశాల్లో మాగుంట శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నట్లు ఆధారాలు సేకరించింది.

ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో కూడా సమావేశాలు జరిగాయని, వాటికి అరుణ్‌ పిళ్లై, కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబు హాజరైనట్లు పేర్కొంది. ఆయన నివాసంలో ఈడీ, సీబీఐ సోదాలు కూడా నిర్వహించాయి. ఆయా హోటళ్లలో జరిగిన సమావేశాలు, రూపకల్పనలో భాగస్వామ్యం, సౌత్‌ గ్రూపు వ్యవహారాలు, ఇతర నిందితులతో సంబంధాలు, ముడుపుల చెల్లింపు, నగదు లావాదేవీలపై ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించే అవకాశముంది. ఇప్పటికే రాఘవ్‌ మాగుంటను ఈడీ అరెస్టు చేయగా..ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నారు.

కవిత అనుమానితురాలే!

ఈ కేసులో కవిత అనుమానితురాలని ప్రత్యేక కోర్టుకు ఈడీ తెలియజేసింది. ఆమె బినామీగా చెబుతున్న అరుణ్‌ పిళ్లై కస్టడీ ముగియడంతో గురువారం ఈడీ అధికారులు ఢిల్లీ రౌజ్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కవిత ఈ కేసులో సాక్షా లేక అనుమానితురాలా అని కోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించగా.. ఆమె అనుమానితురాలేనని వారు స్పష్టం చేశారు. పిళ్లై కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించాలని కోరారు. అందుకు ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ అంగీకరించారు. ఈ నెల 20న మధ్యాహ్నం 3 గంటలకు పిళ్లైని కోర్టులో హాజరుపరచాలని సూచించారు. పిళ్లైతో ముఖాముఖిగా విచారిస్తామని గత అప్లికేషన్‌లో లేదు కదా అని జడ్జి ప్రశ్నించగా.. కస్టడీ కోరడానికి ఇది తాజా కారణమని ఈడీ తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎన్‌కే మట్టా తెలిపారు. కవిత గురువారం విచారణకు గైర్హాజరయ్యారని.. తన ప్రతినిధి ద్వారా ఆమె బ్యాంకు స్టేట్‌మెంట్లు, వ్యాపార, వ్యక్తిగత వివరాలను పంపించారని వివరించారు.

15 రోజులకు మించి ఈడీ కస్టడీకి ఇస్తే ఇది పరంపరగా కొనసాగుతుంది. ఇక ఎన్ని రోజులైనా కస్టడీకి అడుగుతూనే ఉంటారు. హోటల్లో సమావేశాల గురించి మీరు ప్రశ్నిస్తున్నారు. సమావేశంలో ఉన్నామని చెప్పినా, చెప్పకున్నా పర్వాలేదు. ఎందుకంటే మీ దగ్గర డాక్యుమెంటు రూపంలో ఆధారాలు ఉంటాయి కదా! ప్రతి ఒక్కరితో ముఖాముఖి విచారించడం ఎందుకు్‌ అని జడ్జి ప్రశ్నించారు. కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఈ నెల 24న విచారిస్తామని కోర్టు తెలిపిందని ఈడీ ప్రస్తావించింది. ఈ నెల 17న రావాలని బుచ్చిబాబుకు, 18న హాజరు కావాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి, 20న రావాలని కవితకు నోటీసులు జారీ చేశామని వెల్లడించింది.. సుదీర్ఘంగా ఈడీ కస్టడీకి పంపించడం సరికాదని పిళ్లై తరఫు న్యాయవాది మను శర్మ అన్నారు. ఇతరులతో ముఖాముఖి కూర్చోబెట్టి విచారించాల్సినంత అవసరం ఏముందని ప్రశ్నించారు. స్పందించిన జడ్జి.. ుూముఖాముఖి కూర్చోబెట్టి విచారిస్తే జవాబులు మారుతున్నాయి. దర్యాప్తులో ఇదే సమర్థమైన పద్ధతి్‌ అని చెప్పారు. రాఘవ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

Updated Date - 2023-03-17T02:49:03+05:30 IST