Share News

దండుకుని.. దగా

ABN , First Publish Date - 2023-11-20T02:30:44+05:30 IST

అరకొర జీతాలతో పనిచేస్తున్న డ్వాక్రా సిబ్బంది నుంచి దాదాపు రూ.3 కోట్లు దండుకుని దగా చేశారు. హెచ్‌ఆర్‌ పాలసీ అమలు కోసం మంత్రికి ఇవ్వాలంటూ వసూలు చేశారు. చి

దండుకుని.. దగా

మంత్రికి ఇవ్వాలంటూ 3 కోట్లు వసూలు

డ్వాక్రా మండల సమాఖ్య సిబ్బందికి మోసం

హెచ్‌ఆర్‌ పాలసీ పేరిట వంచన

అకౌంటెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు

50 వేల చొప్పున ఇచ్చేలా ఒప్పందం

పేషీ సిబ్బందికి ముడుపులు?

ఆర్నెల్లయినా పాలసీ లేదు

డబ్బులూ వెనక్కి ఇవ్వకుండా టోపీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అరకొర జీతాలతో పనిచేస్తున్న డ్వాక్రా సిబ్బంది నుంచి దాదాపు రూ.3 కోట్లు దండుకుని దగా చేశారు. హెచ్‌ఆర్‌ పాలసీ అమలు కోసం మంత్రికి ఇవ్వాలంటూ వసూలు చేశారు. చివరకు హెచ్‌ఆర్‌ పాలసీ అమలు కాకపోగా, డబ్బులు కూడా వెనక్కి ఇవ్వలేదు. డ్వాక్రా మండల సమాఖ్యలో పనిచేస్తున్న కొందరు వసూళ్ల పర్వం సాగించారు. మంత్రి పేషీకి ముడుపులు ఇచ్చినట్టు సమాచారం. 2005 నుంచి పనిచేస్తున్న సిబ్బందికి హెచ్‌ఆర్‌ పాలసీ మంజూరు చేయడం ద్వారా సెర్ప్‌లో ఉద్యోగ భద్రత వస్తుందని ఆశ చూపారు. ఈ మంత్రి హయాంలోనే పనులు పూర్తి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మండల సమాఖ్య సిబ్బంది అప్పో సప్పో చేసి ముడుపులు సమర్పించుకున్నారు. మండల సమాఖ్య అకౌంటెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు రూ.50 వేలు చొప్పున.. ఫైల్‌ ప్రక్రియ ప్రారంభించే సమయానికి రూ.25 వేలు, మంత్రి వద్ద ఓకే అయిన తర్వాత మిగిలిన రూ.25 వేలు ఇచ్చేలా కొందరు సిబ్బందితో ఒప్పందం చేసుకున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 1900 మంది నుంచి రూ.3 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. వసూలు చేసి ఆర్నెల్లు అవుతున్నా హెచ్‌ఆర్‌ పాలసీ అమలుకు నోచుకోలేదు. లంచంగా డబ్బులు ఇచ్చామని చెప్పుకోలేక తేలుకుట్టిన దొంగల్లాగా మండల సమాఖ్య సిబ్బంది మధనపడుతున్నారు. మంత్రి పేషీ అధికారులకు ఇచ్చేందుకే డబ్బులు ఇచ్చినా, ఈ మాట బహిరంగంగా చెప్పే ధైర్యం లేక కుమిలిపోతున్నారు. ఎవరిని అడగాలో అర్థంకాక అయోమయంలో పడ్డారు.

మంత్రి పేషీ సిబ్బందికి ముడుపులు?

సెర్ప్‌ ఆవిర్భావం సమయంలోనే సిబ్బంది నియామకాన్ని పకడ్బందీగా నిర్వహించారు. అప్పట్లో ఐఏఎస్‌ అధికారులే వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. గ్రూప్స్‌ తరహాలో పరీక్షలు నిర్వహించడమే కాకుండా రోస్టర్‌ ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 6 వేలమందికిపైగా సిబ్బందిని నియమించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి సుమారు 3 వేలకుపైగా సిబ్బంది ఉన్నారు. అప్పట్లో సిబ్బందికి జీతాలు పెంచకపోయినా హెచ్‌ఆర్‌ పాలసీని ప్రకటించారు. పాలసీ ప్రకారం సెర్ప్‌ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే హెల్త్‌ పాలసీ, పదవీ విరమణ వయోపరిమితి, పలు ప్రయోజనాలు దక్కుతాయి. అయితే సెర్ప్‌ ఉద్యోగులకు ఏళ్ల తరబడి జీతాలు పెరగకపోవడంతో పలు దఫాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. చివరకు గత ప్రభుత్వంలో లోకేశ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారికి వేతనాలు భారీగా పెంచారు. అయినా వారికున్న పలు సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. హెచ్‌ఆర్‌ పాలసీ ఉన్న ఎల్‌1 నుంచి ఎల్‌ 6 సెర్ప్‌ ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలు ఏవీ సరిగా అందడం లేదని ఓ వైపు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో సపోర్ట్‌ సిబ్బందిగా ఉన్న మండల సమాఖ్య ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేస్తామని కొంత మంది డబ్బులు వసూలు చేయడం, దానికి సంబంధించి సెర్ప్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మీటింగ్‌ అజెండాలో ఈ అంశం చేర్చడం వివాదాస్పదమైంది. హెచ్‌ఆర్‌ పాలసీ ద్వారా ఉద్యోగ భద్రత వస్తుందని మండల సమాఖ్య సిబ్బందిని మభ్యపెట్టి కొంతమంది ఉద్యోగులు వారి నుంచి డబ్బులు వసూలు చేసి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పేషీలోని కొంతమందికి ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో పని చేసే ఏపీఓలకు గ్రేడ్‌ పెంచి వేతనాలు పెంచారని, అదే తరహాలో మండల సమాఖ్య అకౌంటెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు కూడా హెచ్‌ఆర్‌ పాలసీ ద్వారా జీతాలు పెరుగుతాయని ఆశ పెట్టారు. డబ్బులిస్తే పనైపోతుందని నమ్మించి వసూలు చేశారు.

అధికారులు వద్దన్నా ముందుకు...

ఏళ్ల తరబడి సెర్ప్‌లో ఒక పద్ధతి ప్రకారం నియామకం, హెచ్‌ఆర్‌ పాలసీ అమలవుతున్నాయని, ఇప్పుడు ఆ విధానాన్ని మార్చవద్దని సెర్ప్‌ అధికారులు మొరపెట్టుకున్నా మంత్రి పేషీ మొండిగా ముందుకు పోయింది. వారికి హెచ్‌ఆర్‌ పాలసీ కచ్చితంగా అమలు చేస్తామని నమ్మబలికింది. అప్పట్లో సెర్ప్‌ సిబ్బందిని పోస్టు గ్రాడ్యుయేషన్‌ అర్హత ఉన్నవారినే నియమించారు. మండల సమాఖ్యలో పనిచేసే అకౌంటెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లను టెన్త్‌, ఇంటర్‌ అర్హతలతో ఉన్న వారిని నియమించారు. డ్వాక్రా గ్రూపులకు పుస్తకాలు రాసేందుకు వారిని నియమించారు. అటు సెర్ప్‌ ఉద్యోగులకు, ఇటు మండల సమాఖ్య సిబ్బందికి ఒకే రకమైన హెచ్‌ఆర్‌ పాలసీ ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని ఉన్నతాధికారులు చెప్పినా మంత్రి పట్టించుకోలేదు. సపోర్ట్‌ సిబ్బంది అందరికీ హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్నట్టు అప్పట్లో సంకేతాలిచ్చారు. అంతేకాకుండా ఆయా సిబ్బందికి సంబంధించి వివరాలు పంపించాలని అన్ని జిల్లాలకు సెర్ప్‌ సీఈఓ ఆదేశాలిచ్చారు. జిల్లాల నుంచి సమాచారం రాగానే వారికి హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభిస్తారని అప్పట్లో చెప్పారు. దీనిని నమ్మి సిబ్బంది నుంచి కొందరు డబ్బులు వసూలు చేసి సమర్పించుకున్నారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ అప్పట్లో వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాత హెచ్‌ఆర్‌ పాలసీ ప్రస్తావన లేకుండా పోయింది. మండలాల్లో డబ్బులిచ్చిన సిబ్బంది హెచ్‌ఆర్‌ పాలసీ ఏమైందంటూ ఇప్పుడు యూనియన్‌ నేతలను ఆరా తీస్తున్నారు. అయితే మంత్రి పేషీకి ముడుపులు ఇచ్చినందున గోప్యంగా ఉంచాలని, లేకపోతే మనకే ప్రమాదమని వసూలు చేసిన వాళ్లు మభ్యపెడుతున్నట్లు సమాచారం. హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయక, డబ్బులూ వెనక్కి ఇవ్వకపోవడంతో సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.

Updated Date - 2023-11-20T02:30:56+05:30 IST