వైసీపీ పాలనలో దళితులకు రక్షణ కరవు
ABN , First Publish Date - 2023-06-07T02:45:24+05:30 IST
రాష్ట్రంలో అధికార పార్టీతో సహా ప్రతిపక్ష టీడీపీ, జనసేన దళితులపై జరుగుతున్న దాడులను పట్టించుకున్న దాఖలాలు లేవని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు.
వైసీపీ, టీడీపీ, జనసేన దళితులకు చేసిందేమీలేదు: హర్షకుమార్
మండపేట, జూన్ 6: రాష్ట్రంలో అధికార పార్టీతో సహా ప్రతిపక్ష టీడీపీ, జనసేన దళితులపై జరుగుతున్న దాడులను పట్టించుకున్న దాఖలాలు లేవని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానని, కేసులకు భయపడనని స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులంతా దాడులను ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. దళిత వ్యతిరేక పార్టీ బీజేపీతో రాష్ట్రంలో అధికార పార్టీ, టీడీపీ, జనసేన పార్టీలు అంటకాగుతున్నాయని, వాటితో దళితులు కలిసే అవకాశం లేదన్నారు. 175 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత రాజకీయంపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులను పోటీకి నిలబెడతానని చెప్పారు.