తెలంగాణ ఖాతా నుంచి నేరుగా కట్‌!

ABN , First Publish Date - 2023-08-02T03:17:57+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలను తెలంగాణ ఖాతా నుంచి నేరుగా కట్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ఇంధనశాఖ తెలిపింది.

తెలంగాణ ఖాతా నుంచి నేరుగా కట్‌!

ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలపై

ఆర్బీఐని ఆదేశించేలా శాఖలతో సంప్రదింపులు

బకాయి చెల్లించేలా మేం బాధ్యత తీసుకున్నాం

రాజ్యసభలో కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి వెల్లడి

న్యూఢిల్లీ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలను తెలంగాణ ఖాతా నుంచి నేరుగా కట్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ఇంధనశాఖ తెలిపింది. ఈ విషయంపై రిజర్వు బ్యాంకుకు ఉత్తర్వులు జారీ చేసేలా కేంద్ర న్యాయ, ఆర్థిక శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ వెల్లడించారు. ఏపీకి తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.6 వేల కోట్లకుపైగా విద్యుత్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ విషయంపై మంగళవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి మౌఖిక సమాధానం ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎక్కువ విద్యుదుత్పత్తి కేంద్రాలు ఏపీకి వెళ్లడంతో తెలంగాణలో విద్యుత్‌ కొరత ఉండేదని, ఆ పరిస్థితిలో ఏపీ నుంచి తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేయాలని కేంద్రం ఆదేశించవచ్చని విభజన చట్టంలో పొందుపర్చారని సింగ్‌ గుర్తుచేశారు. ఆ నిబంధనను అనుసరించి తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేయాలని తాము జారీ చేసిన ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేసిందని తెలిపారు. దీనికి సంబంధించి కొంతకాలం ఏపీకి తెలంగాణ ప్రభుత్వం చెల్లింపులు చేసిందని, ఆ తర్వాత నిలిపివేసిందని చెప్పారు. ఒకవేళ చెల్లింపులు చేయకపోతే తగిన చర్యలు తీసుకోవాలని చట్టంలో ఉందని, దాని ప్రకారం బకాయిలను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించామని స్పష్టం చేశారు. తమ ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిందని, స్టే ముగిసినా కూడా బకాయిలు చెల్లించడం లేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఖాతాలోని నిధుల నుంచి ఏపీకి చెల్లించాల్సిన మొత్తాన్ని కోత పెట్టేలా రిజర్వు బ్యాంకుకు ఆదేశాలు జారీ చేసే విషయమై కేంద్ర న్యాయశాఖతో తాము సంప్రదింపులు జరిపినట్టు చెప్పారు. ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖతో చర్చిస్తున్నామన్నారు. విద్యుత్‌ బకాయిల అంశాన్ని కేంద్ర ప్రభుత్వమే పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు.

Updated Date - 2023-08-02T03:17:57+05:30 IST