పెరుగుతున్నకరోనా కేసులు
ABN , Publish Date - Dec 26 , 2023 | 02:34 AM
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. విశాఖపట్టణంలో నాలుగు రోజులుగా కేసులు నమోదవుతుండగా..
విశాఖలో మరో రెండు నమోదు
మొత్తం 20కు చేరిన యాక్టివ్ కేసులు
సిక్కోలులో మూడు నమోదు
దేశంలో 64 జేఎన్.1 కేసులు
విశాఖపట్నం, శ్రీకాకుళం, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. విశాఖపట్టణంలో నాలుగు రోజులుగా కేసులు నమోదవుతుండగా.. శ్రీకాకుళంలో కొత్తగా మూడు కేసులు వచ్చా యి. విశాఖపట్టణం జిల్లాలో సోమవారం వంద మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి జగదీశ్వరరావు తెలిపారు. ఆనందపురం మండలం పడుగుపాలెంలో ఒకటి, నగర పరిధిలోని రామ్‌నగర్ ప్రాంతంలో గల ప్రగతినగర్‌లో మరొకటి వెలుగుచూశా యి. జ్వరంతోపాటు ఇతర లక్షణాలు ఉండడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వీరి నుంచి నమూనాలు సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించినట్టు జగదీశ్వరరావు తెలిపారు. వీటితో జిల్లాలో యాక్టివ్ కేసుల సం ఖ్య 20కు చేరింది. వీరిలో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారంతా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో మూడు కే సులు నమోదయ్యాయి. ఇందులో ఒకరిది మెళియాపుట్టి మండలం కాగా... మరో ఇద్దరు శ్రీకాకుళం నగరానికి చెందినవారు.
దేశంలో 64 జేఎన్.1 వేరియంట్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటి వరకు కరోనా కొత్త సబ్-వేరియంట్ ‘జేఎన్.1’ కేసులు 64 నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. వీటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో 9, కర్ణాటక 8, కేరళ 6, తమిళనాడు 4, తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సోమవారం మరో 628 కరోనా కేసులు వెలుగుచూడగా మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 4,504కు చేరింది.