Share News

కొనసాగుతున్న చలి గాలులు

ABN , Publish Date - Dec 26 , 2023 | 02:38 AM

మధ్య భారతం దాని పరిసరాల్లో అధికపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో వాయువ్య భారతం నుంచి వీస్తున్న చలిగాలులు మధ్యభారతం మీదుగా కోస్తా, రాయలసీమ వరకు విస్తరిస్తున్నాయి.

కొనసాగుతున్న చలి గాలులు

విశాఖపట్నం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మధ్య భారతం దాని పరిసరాల్లో అధికపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో వాయువ్య భారతం నుంచి వీస్తున్న చలిగాలులు మధ్యభారతం మీదుగా కోస్తా, రాయలసీమ వరకు విస్తరిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పగటిపూట ఉదయం పది, పదకొండు గంటల వరకూ చలి కొనసాగుతోంది. తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి మొదలవుతోంది. ఏజెన్సీ ఏరియాలో పగటిపూట కూడా చలి కొనసాగుతుంది. గడచిన రెండు, మూడు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. కాగా రాత్రి చలిగాలుల మరింతగా పెరగడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. రాత్రి పది తరువాత మరుసటిరోజు ఉదయం ఎనిమిది గంటల వరకు చలి ప్రభావం ఉండడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 7.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బంగాళాఖాతం నుంచి తేమగాలులు రాక నిలిచిపోవడం, అదే సమయంలో వాయువ్య దిశ నుంచి రాష్ట్రంపైకి గాలులు వీస్తుండడంతో చలి కొనసాగుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. మధ్యభారతంలో ఉన్న అధికపీడనం ప్రభావంతో నెలాఖరు వరకు చలి ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఇంకా రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంటూ వర్షాలు లేకపోవడం కూడా చలి పెరగడానికి ఒక కారణమన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 02:38 AM