Happynest ; ‘హ్యాపీ’గా కొనసాగుదాం!
ABN , First Publish Date - 2023-03-18T04:01:32+05:30 IST
‘హ్యాపీనెస్ట్’ రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు ఇది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రజలకు ప్లాట్లు నిర్మించి విక్రయించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. మొత్తం 1200 ప్లాట్లకు

ప్రాజెక్టుపై కొనుగోలుదారుల్లో ఇంకా ఆశలు
అడ్వాన్స్ వెనక్కి తీసుకునేందుకు విముఖత
సీఆర్‌డీఏ కమిషనర్ పలుమార్లు నోటీసులు
10 శాతం మంది కూడా స్పందించని వైనం
ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారితే
ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుందని నిరీక్షణ
అమరావతిలో కదలని 1200 ప్లాట్ల నిర్మాణం
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
‘హ్యాపీనెస్ట్’ రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు ఇది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రజలకు ప్లాట్లు నిర్మించి విక్రయించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. మొత్తం 1200 ప్లాట్లకు గాను అప్పట్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించగా, ఏకంగా దాదాపు లక్షమంది కొనుగోలుకు ఆసక్తి చూపారు. ప్రాధాన్య క్రమంలో మొదట దరఖాస్తు చేసుకున్న వారికి 1187 ప్లాట్లు విక్రయించారు. ఒక్కొక్కరు 5 నుంచి 10 లక్షల వరకూ అడ్వాన్స్ చెల్లించారు. ఈ క్రమంలో ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ సర్కారు అమరావతి నిర్మాణాన్ని అటకెక్కించినట్టే ఈ ప్రాజెక్టునూ నీరుగార్చింది. మూడున్నరేళ్లు కాలం గడిచిపోయాక.. కొనుగోలుదారులు స్వచ్ఛందంగా డబ్బులు వెనక్కు తీసుకుంటామంటే ఇచ్చేస్తామని సీఆర్‌డీఏ గత నాలుగు నెలలుగా ప్రకటిస్తోంది. తాజాగా ఈ నెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సీఆర్‌డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ బహిరంగ నోటీసు ఇచ్చారు. రాజధానిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం కట్టే ఉద్దేశ్యం లేదని కొనుగోలుదార్లు భావిస్తున్నా... డబ్బులు వెనక్కు తీసుకోవటానికి మాత్రం ఇష్టపడటం లేదు. ఇప్పటి వరకు పది శాతం మంది కూడా డబ్బులను వెనక్కు తీసుకోలేదు. 2022 డిసెంబరు 30 నాటికి ఐదుగురు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా స్వచ్ఛందంగా రద్దు చే సుకున్నారు. ఆ తర్వాత మరికొద్ది మంది రద్దు చేసుకోవటానికి ఆసక్తి చూపారు. అది కూడా వ్యక్తిగత అవసరాలకు డబ్బు అవసరం ఉండటంతో రద్దు చేసుకున్నారు. ఇదే విషయాన్ని సీఆర్‌డీఏకు వారు తెలియజేశారు. ఇంకా దాదాపు 1000 మందికి పైగా డబ్బులు తీసుకోవటానికి ఆసక్తి చూపించటం లేదు.
ఆశతో నిరీక్షణ
ప్రభుత్వం హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లదని తెలిసినా.. సీఆర్‌డీఏ ఆ దిశగా కదలడం లేదని తెలిసినా.. కొనుగోలుదారులు డబ్బులు వెనక్కి తీసుకోకపోవడానికి బలమైన కారణముంది. వైసీపీ ప్రభుత్వం మరో ఏడాది అధికారంలో కొనసాగనుంది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రాకపోవచ్చన్నది వారి భావన. వచ్చే ప్రభుత్వం హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. ఎలాగూ నాలుగేళ్లు ఎదురు చూశాం కాబట్టి.. మరో ఏడాది ఓపిక పట్టాలని భావిస్తున్నారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాన్ని బట్టి ఈ ప్రాజెక్టులో కొనసాగడమా? లేక డబ్బులు వెనక్కి తీసుకోవడమా? అన్నది నిర్ణయించుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
రెరా తీర్పుతో భరోసా
ఈ ప్రాజెక్టు జాప్యం కావడంతో కొనుగోలుదారులు కట్టిన డబ్బులకు 16 శాతం వడ్డీ చెల్లించాల్సిందిగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (ఏపీ రెరా) ఇటీవల ఆదేశించింది. ఈ తీర్పుతో కొనుగోలుదారులకు కొత్త శక్తి వచ్చింది. ఎప్పటికైనా తమ డబ్బులకు గ్యారెంటీ ఉంటుందన్న భరోసా వచ్చింది. ఎలాగూ వడ్డీ వస్తుందన్న భావనలో ఉన్నారు. తొందరపడి రద్దు చేసుకోకూడదని హ్యాపీనెస్ట్ కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత అయినా ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కకపోతుందా అనే ఆశతో ఎదురు చేస్తున్నారు. దీంతో సీఆర్‌డీఏ కమిషనర్ ఎన్నిసార్లు బహిరంగ నోటీసులు ఇస్తున్నా కొనుగోలుదారుల నుంచి మాత్రం స్పందన రావటం లేదు.