ఉద్యోగులను విలన్లుగా చూపే కుట్ర
ABN , First Publish Date - 2023-03-05T03:37:27+05:30 IST
ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు, రావాల్సిన బకాయిలు అడిగితే ఉద్యోగులను విలన్లుగా చూపే కుట్రకు ప్రభుత్వం తెరలేపిందని ఏపీజేఏసీ అమరావతి సంఘ రాష్ట్ర కోశాధికారి మురళీకృష్ణనాయుడు మండిపడ్డారు.
మురళీకృష్ణ నాయుడు
గుంటూరు(తూర్పు), మార్చి 4: ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు, రావాల్సిన బకాయిలు అడిగితే ఉద్యోగులను విలన్లుగా చూపే కుట్రకు ప్రభుత్వం తెరలేపిందని ఏపీజేఏసీ అమరావతి సంఘ రాష్ట్ర కోశాధికారి మురళీకృష్ణనాయుడు మండిపడ్డారు. గుంటూరు రెవెన్యూ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. లక్షలు జీతాలు తీసుకుంటున్నారంటూ తమ అనుకూల మీడియా ద్వారా ప్రభుత్వం ఉద్యోగులపై దుష్పప్రచారం చేస్తోందన్నారు. ‘ఇకపై టీ, బిస్కెట్ చర్చలకు ఒప్పుకోం.. మా సంఘ అధ్యక్షుడు బొప్పరాజు ఆధ్వర్యంలో అంతే దీటుగా మేము కూడా సమాధానం చెబుతా’మని స్పష్టం చేశారు. నెల మొత్తం కష్టపడి ఒకటో తేదిన జీతం ఆశించడం తప్పా అన్నారు. ప్రభుత్వం వేసిన కమిటీలు ఉద్యోగుల సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని అందుకే ఉద్యమబాట పడుతున్నట్లు గుంటూరు జిల్లా జేఏసీ చైర్మన్ సంగీతరావుతెలిపారు.
ఈ నెల 9 నుంచి నిరసన కార్యక్రమాలు
ఈ నెల 9, 10 తేదీల్లో నల్లరిబ్బన్లతో విధులకు హాజరు. 13,14 తేదీల్లో మధ్యాహ్న భోజన విరామంలో కలెక్టర్, ఉన్నతాధికారుల కార్యాలయాల వద్ద నిరసనలు, 15,17,20 తేదీల్లో కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు, 21న సెల్‌డౌన్, 24న హెచ్‌వోడీ కార్యాల యాల వద్ద ధర్నాలు, 27న కొవిడ్ సమయంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరామర్శ, ఏప్రిల్ 1న పదవీ విరమణ చేసి, ప్రభుత్వ సదుపాయాల అందని ఉద్యోగుల పరామర్శ కార్యక్రమాలు ఉంటాయి.