Sanjay: ఢిల్లీలోనూ అదే పాట

ABN , First Publish Date - 2023-09-18T02:32:11+05:30 IST

‘స్కిల్‌ స్కామ్‌’పై సీఐడీ కథలు దేశ రాజధానికీ చేరాయి. సీఐడీ చీఫ్‌ సంజయ్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి ఆదివారం ఢిల్లీలోని అశోకా హోటల్‌లో ప్రత్యేకంగా ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు.

Sanjay: ఢిల్లీలోనూ అదే పాట

‘‘డిజైన్‌టెక్‌ సంస్థ నుంచి షెల్‌ కంపెనీలకు నిధులు వెళ్లాయి. ఎవరికీ నైపుణ్య శిక్షణ ఇవ్వలేదు. 2 లక్షల మందికి శిక్షణ, ఉద్యోగాలు వంటివి కాలానుగుణంగా జరిగాయి. రూ.241 కోట్లపైనే మా దృష్టి. ఎంత మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు, ఎందరికి ఉద్యోగాలు వచ్చాయన్నది కాదు.’’

- సీఐడీ

దేశ రాజధానిలో సీఐడీ చీఫ్‌, ఏఏజీ ప్రెస్‌మీట్‌

జాతీయ మీడియా ప్రశ్నలకు తడబాటు, దాటవేత

అజేయకల్లం, ప్రేమచంద్రా రెడ్డి అరెస్టుపై ప్రశ్నలు

చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పిన వైనం

ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో జాతీయ మీడియాతో భేటీ

తెలుగు ప్రతినిధులకు ‘నో ఎంట్రీ’

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘స్కిల్‌ స్కామ్‌’పై సీఐడీ కథలు దేశ రాజధానికీ చేరాయి. సీఐడీ చీఫ్‌ సంజయ్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి ఆదివారం ఢిల్లీలోని అశోకా హోటల్‌లో ప్రత్యేకంగా ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఢిల్లీలో ఉన్న వాళ్లకు అవగాహన ఉండదని, చెప్పింది విని రాసుకుంటారని అనుకున్నారో ఏమో... తెలుగు మీడియాను అనుమతించకుండా జాతీయ మీడియా ప్రతినిధులతో మాత్రమే మాట్లాడారు. అయినప్పటికీ... విలేకరులు అనేక ప్రశ్నలు సంధించారు. వాటికి సీఐడీ చీఫ్‌ సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు క్షేత్రస్థాయిలో ఎలా ఖర్చయిందనే అంశంతో తమకు సంబంధం లేదని చెప్పారు. ఇక... ప్రభుత్వంలో ‘అత్యున్నతస్థాయి’ అనుమతి తర్వాతే దర్యాప్తు ముందుకు సాగిందని చెప్పడం గమనార్హం. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో అధికారులు అర్జా శ్రీకాంత్‌, అజయ్‌ కల్లం రెడ్డి, ప్రేమచంద్రా రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని విలేకరులు పలుమార్లు ప్రశ్నించగా... ‘‘చాలా మందిని అరెస్టు చేశాం. ఘంటా సుబ్బారావును అరెస్టు చేశాం కదా! ఆ సమయంలో అజేయ కల్లం ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు’’ అని సంజయ్‌ చెప్పారు. అప్పట్లో ఉన్నత విద్యాశాఖలో ఉన్నది అజయ్‌ జైన్‌ అని, అజేయ కల్లం కాదని పక్కనే ఉన్న పొన్నవోలు గుసగుసలాడగా... ‘చాలా పేర్లు ఎందుకొస్తున్నాయో తెలియదు’ అని సంజయ్‌ అన్నారు. ఘంటా సుబ్బారావు ఆదేశాల మేరకే ప్రేమచంద్రారెడ్డి నడుచుకున్నారని సంజయ్‌ చెప్పారు. ‘అజేయ కల్లం, ప్రేమచంద్రారెడ్డి పాత్రపై దర్యాప్తు చేస్తారా? దీనిపై ఎందుకు స్పష్టంగా మాట్లాడడం లేదు?’’ అని మీడియా ప్రశ్నించగా... దానికి బదులివ్వలేదు. దర్యాప్తులో రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా అని అడగగా... ‘‘కార్పొరేషన్‌ నిర్ణయం మేరకు సీఐడీ దర్యాప్తు చేపట్టింది. కానీ, రాజకీయ క్లియరెన్సుల దగ్గర ఆగింది. అత్యున్నత స్థాయిలో అనుమతులు వచ్చిన తర్వాత కేసు దర్యాప్తు విస్తృతిని పెంచాం. దర్యాప్తు మొదలు పెట్టినపుడు ఘంటా సుబ్బారావు ఏ1గా ఉన్నారు. ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు చంద్రబాబును ఏ1గా మార్చాం’’ అని చెప్పారు.

విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక... పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతారంటూ మైక్‌ ఆయనకు ఇచ్చారు. ‘మీరు వాస్తవాలు చెప్పకపోతే ఎలా? దేనికీ స్పష్టమైన సమాధానాలు ఇవ్వకపోతే మేం తప్పుడు సమాచారం ప్రచురించిన వాళ్లమవుతాం’’ అని విలేకరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేమచంద్రారెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని పదేపదే ప్రశ్నించగా... ‘‘ఆ సమయంలో ప్రేమచంద్రా రెడ్డి ఎండీ కాదు. త్రైపాక్షిక ఒప్పందంపై ఆయన ఎక్కడా సంతకం చేయలేదు’’ అని పొన్నవోలు బదులిచ్చారు. అలాగే ఒక సందర్భంలో.... ‘‘తక్షణమే ఫైల్‌ క్లియర్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాతో చెప్పారు. ఘంటా సుబ్బారావు నన్ను కలిసి సీఎంతో జరిగిన చర్చల మినిట్స్‌ను అందించారు’’ అని అప్పటి ఆర్థిక శాఖ అధికారి పీవీ రమేశ్‌ నోట్‌ రాశారని చెప్పారు. నోట్‌ రాసి సంతకం చేసిన పీవీ రమేశ్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని విలేకరులు ప్రశ్నించగా... ‘‘సంతకాలు చేసినంత మాత్రాన అరెస్టు చేయాలా?’’ అన్నారు. పీవీ రమేశ్‌ సెక్షన్‌ 164 కింద వాంగ్మూలం ఇచ్చారని, మరిన్ని విషయాలు ఇంకా వివరిస్తాననని సంజయ్‌ అనగా... ‘‘మీరు తప్పుడు వివరాలు చెబుతున్నారు’’ అని విలేకరులు సంజయ్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మేం 2015-18 గురించే చెబుతున్నాం

‘‘లక్షలాది మందికి శిక్షణ ఇచ్చామని నారా లోకేశ్‌ చెబుతున్నారు. నైపుణ్యాభివృద్ధికి ఎప్పటి నుంచో నిధులు విడుదలవుతున్నాయి. కానీ... మేం 2015 నుంచి 2018 మధ్యకాలం గురించే తాము మాట్లాడుతున్నాం’’ అని సంజయ్‌ చెప్పారు. దీనిపై సీమెన్స్‌ కంపెనీ కూడా అంతర్గతంగా దర్యాప్తు జరిపిందన్నారు. ‘‘సీమెన్స్‌ లీగల్‌ కౌన్సిల్‌, నోడల్‌ అధికారి అమిత్‌ 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు. జీవోలో, ఒప్పందంలో వేర్వేరు విధివిధానాలు ఉన్నాయన్నారు. 90 శాతం నిధులు సీమెన్స్‌ ఇవ్వాల్సిన విషయాన్ని ఒప్పందంలో పేర్కొనలేదన్నారు. సీమెన్స్‌ ఇండియా ఎండీగా ఉన్న సుమన్‌ బోస్‌ తన టీమ్‌కు వాస్తవాలు చెప్పలేదు. సొంత కంపెనీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పదోవపట్టించారు’’ అని చెప్పారు. 2015 డిసెంబరు నుంచి 2016 మార్చి మధ్యకాలంలో ప్రభుత్వం నుంచి నాలుగుసార్లు నిధుల విడుదల జరిగిందన్నారు.

పైలట్‌ ప్రాజెక్టు కోసం రూ.55 కోట్లు ఇవ్వవచ్చా లేదా అని పరిశీలించి ప్రణాళిక శాఖకు నివేదించాలని అప్పటి ఆర్థిక శాఖ అధికారులు ఫైల్స్‌లో స్పష్టంగా రాశారని అన్నారు. ‘‘ఒక మాజీ సీఎంని రిమాండ్‌కు పంపేదాకా కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాం. కోర్టులో దాదాపు 10గంటల పాటు వాదనలు జరిగాయి. ఏసీబీ కోర్టు జడ్జి మా వాదనలతో ఏకీభవించి చంద్రబాబుకు రిమాం డ్‌ విధించారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు కాదు’’ అని చెప్పారు. ఈ స్కామ్‌లో భాగస్వాములైన షెల్‌ కంపెనీలను గుర్తిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు మాజీ పీఏ పెండ్యాల శ్రీనివా్‌సకు ఈ నెల 5న నోటీసులివ్వగా... 24 గంటల్లోనే అమెరికాకు వెళ్లిపోయారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుకు ఇదే కారణమైందని చెప్పారు. నకిలీ ఇన్‌వాయి్‌సలు సృష్టించి నిధు ల మళ్లింపునకు సహకరించిన వారితో పెండ్యా ల శ్రీనివా్‌సకు సంబంధాలున్నాయని ఆరోపించారు. వారిలో మనోజ్‌ వాసుదేవ్‌ కూడా ఒకరని, ఆయనా దేశం వదిలి వెళ్లారని చెప్పారు.

తెలుగు మీడియాకు ‘నో ఎంట్రీ’

ఢిల్లీలో సీఐడీ చీఫ్‌, ఏఏజీ నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు తెలుగు మీడియాను అనుమతించలేదు. కేవలం జగన్‌ మీడియా ప్రతినిధులను మాత్రమే లోపలికి పంపించారు. దీనిపై ప్రశ్నించగా.. ‘వాళ్లకు అనుమతి ఉంది’ అని దబాయించారు. జాతీయ మీడియా ప్రతినిధులు కూడా... తెలుగు మీడియాను ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. తెలుగు మీడియాను దూరం ఉంచడంలో ముఖ్యమంత్రి జాతీయ మీడియా సలహాదారు కీలక పాత్ర పోషించారు.

ఏపీ భవన్‌ ఉండగా...

సాధారణంగా మంత్రులు, ఉన్నతాధికారులు ఎవరు ఢిల్లీ వచ్చినా ఏపీ భవన్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ...ఈ సారి ఏపీ భవన్‌లో కాకుండా ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం.

Updated Date - 2023-09-18T02:38:46+05:30 IST