సిగ్గు లేకుండా బాబుపై విమర్శలా..!

ABN , First Publish Date - 2023-01-01T03:31:45+05:30 IST

‘‘ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిలో ప్రచారపిచ్చి ముదిరి వెర్రిస్థాయికి చేరింది.

సిగ్గు లేకుండా బాబుపై విమర్శలా..!

జగన్‌రెడ్డికే ప్రచార పిచ్చి ముదిరింది: టీడీపీ

అమరావతి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిలో ప్రచారపిచ్చి ముదిరి వెర్రిస్థాయికి చేరింది. ప్రతిచోట తన ఫొటో, తన పార్టీ రంగు కనిపించకపోతే నిద్ర పట్టని పరిస్థితి వచ్చింది. చివరకు సర్వే రాళ్లను పాసు పుస్తకాలను కూడా వదిలిపెట్టకుండా ఫొటో వేయించుకొంటున్నారు. ఇన్ని చేస్తూ ఇంకా సిగ్గు లేకుండా చంద్రబాబును విమర్శిస్తున్నారు’’ అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రచార పిచ్చి వల్లే కందుకూరు టీడీపీ సభలో ఎనిమిది మంది చనిపోయారని వైసీపీ మంత్రులు చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. ‘‘జగన్‌కు ఉన్న ప్రచార పిచ్చి ప్రపంచంలో ఎవరికైనా ఉందా? విద్యార్థుల విదేశీ విద్య పథకానికి చంద్రబాబు ప్రభుత్వం అంబేద్కర్‌ పేరు పెడితే జగన్‌ ఆ పేరు తీసేసి తన పేరు పెట్టుకొన్నాడు. కనిపించిన ప్రతి గోడకు... భవనానికి చివరకు కరెంటు స్తంభాలకు కూడా వైసీపీ రంగులు వేయించాడు. కోర్టు అక్షింతలు వేస్తే కొన్ని తీసి వేయించాడు. రంగులు వేయడానికి... తీయడానికి వేల కోట్ల రూపాయల తగలేశాడు. చివరకు ప్రజల వ్యక్తిగత ఆస్తులైన భూములు, ఇళ్ళ స్థలాల సర్టిఫికెట్లపై కూడా తన ఫొటో వేయించుకొనే స్థితికి దిగజారాడు. మీరా చంద్రబాబును విమర్శించేది? మీ కార్యకర్త ఎవరైనా చనిపోతే వెళ్లి పరామర్శించారా? మీ ప్యాలె్‌సకు పిలిపించుకొని పరామర్శిస్తారు. చంద్రబాబు స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం, స్థైర్యం ఇచ్చారు. వైసీపీలో ఒక దళిత ఎంపీ చనిపోతే ఆయన ఇంటికి వెళ్లడానికి కూడా జగన్‌రెడ్డికి మనసు ఒప్పలేదు. తన సొంత సామాజిక వర్గం వారు చనిపోతే మాత్రం వెంటనే వెళ్లి చూసి వస్తాడు. మీ సంస్కార స్థాయి అది’’ అని ఆనందబాబు విమర్శించారు. భద్రతా వైఫల్యంతో తొక్కిసలాట జరిగితే దానిని కప్పిపుచ్చడానికి చంద్రబాబుపై నెపం మోపుతూ ఆరోపణలు చేస్తున్నారని ఆనందబాబు విమర్శించారు. కాగా, పశ్చిమ రాయలసీమ టీడీపీ పట్టభద్ర నియోజకవర్గ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి ఓ ప్రకటన చేస్తూ... ఉద్యోగులను లోకువగా చూసే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని చూసి ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తింది. ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

Updated Date - 2023-01-01T03:31:46+05:30 IST