Chandrababu : సైకిలెక్కండి
ABN , Publish Date - Dec 30 , 2023 | 03:31 AM
ప్రజల భూముల్ని లాక్కునేందుకు సైకో ప్రభుత్వం తాజాగా నల్ల చట్టాన్ని తెచ్చింది.
పల్లెల్లో తిరిగి ఫ్యాన్‌ను చిత్తుగా ఓడించండి
మీ భవిష్యత్‌కు మీరే బాటలు వేసుకోండి
భూముల్ని మింగే చట్టం తెచ్చిన జగన్
దీన్ని చూస్తుంటే నాకే భయమేస్తోంది
రైతుల భూములన్నీ నిషేధ జాబితాలోకి
క్లియర్ చేయడానికి వాటా అడుగుతారు
లేదంటే కార్యాలయాల చుట్టూ తిరగాలి
ఎవరినీ అడక్కుండా ఇలాంటి చట్టమా?
అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తాం
పీ4 విధానంతో పేదల అభ్యున్నతి
శాంతిపురం, రామకుప్పం సభల్లో బాబు
శాంతిపురం/రామకుప్పం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజల భూముల్ని లాక్కునేందుకు సైకో ప్రభుత్వం తాజాగా నల్ల చట్టాన్ని తెచ్చింది. దాన్ని చూస్తుంటే నాకే భయమేస్తోంది’’ అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు శుక్రవారం ఆయన పర్యటించారు. శాంతిపురం, రామకుప్పం మండలాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ‘ఈ వంద రోజులు సైకిల్ ఎక్కండి. గ్రామాల్లో తిరిగి ఫ్యాన్‌ను చిత్తుగా ఓడించండి. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి’’ అని కోరారు. ‘‘ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది ఈ ఏడాది అక్టోబరు 31వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రీసర్వే తర్వాత మన భూమి మన పేరుతో ఉందో, వైసీపీ నాయకుల పేర్లతో ఉందో తెలియని పరిస్థితి! ఈ చట్టం ప్రకారం అన్ని టైటిల్ డీడ్స్, ఆర్వోఆర్ వంటివన్నీ పోయి కొత్త వ్యవస్థ వస్తుంది. మీ భూమిని ‘22(ఏ)’లో వాళ్లే పెట్టేసి, క్లియర్ చేయిస్తానని వాళ్లే వచ్చి వాటా అడుగుతారు. నేను సీఎంగా ఉండి చూశాను. తెలంగాణలోని భూములకు సమస్యలుంటాయి. ఏపీలోని భూముల రికార్డు పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. కారణం ఏపీలో బ్రిటీషుల పాలన, తెలంగాణలో నిజాం పాలన ఉండడమే. తెలంగాణలో ఒకే భూమి ముగ్గురు, నలుగురి పేర్లతో రాసేవాళ్లు. ఏపీలో జమాబందీ చేసి ఎవరి భూమి వారికి కచ్చితంగా నమోదు చేసేవాళ్లు. ఆ తర్వాత ఎన్టీఆర్ భూమి శిస్తు రద్దు చేశారు. ఇప్పుడు ఈ సైకో కొత్త వ్యవస్థను తెచ్చి భూముల్ని లాక్కుంటున్నారు. ఒకసారి ఇలాంటి భయంకరమైన నల్ల చట్టాన్ని తెచ్చినప్పుడు పది మందితో చర్చించాలి. రీసర్వే తర్వాత నోటీసులు ఇవ్వకుండా కొత్తలెక్కలు రాసేశారు. మీ భూమి మీకు కావాలన్నా కార్యాలయాల చుట్టూ తిరగాలి’’ అని చంద్రబాబు అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
రాష్ట్రంలో బాగుపడ్దది నలుగురు రెడ్లే
‘‘వైసీపీ ప్రభుత్వంలో జగన్‌తో పాటు పెద్దిరెడ్డి, సజ్జలరెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మాత్రమే బాగుపడ్డారు. వీరుతప్ప ఏ ఒక్క రైతూ.. ఏ రెడ్డి కూడా బాగుపడిన దాఖలాలు లేవు. వైసీపీ తీరుపై ఏ రెడ్డీ సంతృప్తికరంగా లేరు’’
జగన్‌కు కమీషన్ ఏజెంట్ పెద్దిరెడ్డి...
‘‘పెద్డిరెడ్డి ఎలాంటి అనుమతులు లేకుండా, రైతులకు పరిహారం ఇవ్వకుండా ఆవులపల్లె, నేతిగుట్లపల్లె వంటి ప్రాజెక్టులను ప్రారంభించారు. బాధిత రైతులు గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. రూ.వంద కోట్ల జరిమానా విధిస్తే, సుప్రీంకోర్టుకు వెళితే రూ.25 కోట్లు చెల్లించమని చెప్పింది. ఓ వ్యక్తి అరాచకానికి రూ.25 కోట్ల ప్రజాధనం వృథా అయింది. జీఎన్‌ఎ్‌సఎస్, హెచ్‌ఎన్‌ఎ్‌సఎస్ పనులు కూడా రూ.5500 కోట్లకు పెద్దిరెడ్డి కుటుంబమే తీసుకుంది. దోపిడీ దొంగలు వీళ్లు. పనిచేయకుండానే రూ.1500 కోట్లను తీసుకున్నారు. ఎవరినీ వదిలిపెట్టను. ఆ డబ్బును కక్కించే బాధ్యత నాది. పెద్దిరెడ్డి వేల కోట్లు సంపాదిస్తే, క్వారీలను లాగేసుకుని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ 200కోట్లు సంపాదించుకున్నారు. సాక్ష్యాలతో చూపిస్తున్నా. దమ్ముంటే వీళ్లను మార్చేయ్ జగన్. పెద్దిరెడ్డి, సీఎంకు అవినీతి వాటాలు ఇచ్చే కమీషన్ ఏజెంట్ కాబట్టి జగన్ ఇలాంటివారిని పట్టించుకోరు. సామాన్య ఎమ్మెల్యేల మీద ప్రతాపం చూపిస్తున్నారు. ఎమ్మెల్యేలు చెడిపోయారన్నా, ప్రజాద్రోహులుగా మారాలన్నా జగనే కారణం. ఎడ్చెర్లలో జగన్ పత్రిక విలేకరి ఎమ్మెల్యే కిరణ్‌కుమార్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పీఏ ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు కానీ, అది హత్యా లేదా ఆత్మహత్యా అనేది తెలీదు. వాటాలు కుదరనందువల్ల మనిషి లేకుండా పోయాడు’’
మళ్లీ రైతు రాజ్యాన్ని తెస్తాం
‘‘మళ్లీ రైతు రాజ్యం తెస్తాం. రైతులకు ఏడాదికి రూ.20 వేలతో పాటు డ్రిప్ ఇరిగేషన్ వంటి గత కార్యక్రమాలను అమలు చేసి అండగా ఉంటాం. గ్రానైట్ రంగానికి పూర్వ వైభవం తెచ్చి స్థానికులే చేసుకునేలా ఏర్పాటు చేస్తాం. మైనింగ్ డైరెక్టర్‌గా బయటి రాష్ట్రానికి చెందినవాణ్ణి తీసుకొచ్చి తప్పులు చేయిస్తున్నారు. టీడీపీ వచ్చాక.. వెళ్లిపోయేందుకు ప్లాన్ వేసుకుంటున్నారు. కానీ, వదిలిపెట్టేది లేదు. ఐదేళ్లలో మేం 6లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఈ ప్రభుత్వమే ఒప్పుకొనే పరిస్థితి వచ్చింది. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఈ వంద రోజులు సైకిల్ ఎక్కండి. ఫ్యాన్‌ను చిత్తుగా ఓడించండి. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించానని ఆటోడ్రైవర్లు అధైర్యపడొద్దు. మీరు నష్టపోకుండా ప్రత్యామ్నాయంగా సర్దుబాటు చర్యలు తీసుకుంటాను’’
పీ4 విధానం తెస్తా...: ‘‘గతంలో పీ3 విధానంతో (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) ద్వారా అనేక రంగాల్లో అభివృద్ధి చేశాను. ఇప్పుడు పీ4 (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్‌నర్‌షిప్) విధానాన్ని తీసుకొచ్చి పేదరిక నిర్మూలన చేస్తాను. విదేశాల్లో స్థిరపడిన వారితో పేద కుటుంబాలను దత్తత తీసుకుని పీ4 విధానంలో అభివృద్ధి చేయిస్తాను. పేదవారికి రూ.10 ఇచ్చి రూ.వంద సంపాదించుకునే మార్గాలను చూపిస్తాను. వచ్చే ఎన్నికల్లో మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ సీఎం హయాంలో ప్రతి ఒక్కరూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నడూ లేనివిధంగా శాంతిపురం, రామకుప్పం మండలాల్లో ప్రజలు చంద్రబాబును చూడడానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు.
అంగన్వాడీల శిబిరం వద్దకువెళ్లి..
శాంతిపురం మండల సచివాలయం ఎదుట ఽసమ్మెలో ఉన్న అంగన్వాడీలను చూసి చంద్రబాబు వాహనం దిగి శిబిరం వద్దకు వెళ్లారు. వారి సమస్యలు విన్నారు. వినతిపత్రం తీసుకున్నారు. అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ‘‘అంగన్వాడీలు రోడ్డుమీద పడ్డారు. వారి జీతాన్ని .6వేల నుంచి రూ.10,500కు పెంచాం. టీడీపీ వచ్చాక వారి సమస్యల్ని పరిష్కరిస్తాం. తెలంగాణ కంటే ఎక్కువ జీతాలిస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు పట్టించుకోవడం లేదు’’ అని చంద్రబాబు మండిపడ్డారు. శాంతిపురం బహిరంగ సభలో ఆశా వర్కర్లు... చంద్రబాబుకు అర్జీ ఇవ్వగా, వారి కోరికలను కూడా పరిష్కరిస్తానని హామీనిచ్చారు. అంగన్వాడీలు, ఆశాలు, పారిశుధ్య కార్మికులు రోడ్ల మీదుంటే జగన్ మాత్రం ప్యాలె్‌సలో ఉన్నాడని ఎద్దేవా చేశారు.
మా పాసుబుక్కుల్లో జగన్ ఫొటోనా?
ఓ రైతు ఆగ్రహం
శాంతిపురం సభలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. ఎద్దులపల్లెకు చెందిన అప్పయ్య అనే రైతు స్పందించారు. పాస్‌బుక్కుల్లో సీఎం ఫొటో ఉండటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా రైతు అప్పయ్యకు, బాబుకు మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది.
చంద్రబాబు: నీ భూమి మీద నీకు హక్కు లేదంట. జగన్‌కో, మీ ప్రాంత వైసీపీ నేతకో లంచాలు ఇస్తేనే భూమి నీదవుతుంది. లేదంటే కబ్జాకు గురవుతుంది.
రైతు: అవును సార్. మా పాసుబుక్కులో జగన్ ఫొటో పెట్టారు. నా బుక్కులో ఉంటే మా తాత ఫొటో ఉండాలి. లేదా నాది, మా నాన్నది ఉండాలి. ఫొటో పెట్టుకోవడానికి ఈయనెవడు?
చంద్రబాబు: అవును, మీ పాసు బుక్కుపై ఆయన ఫొటో వేసుకోవడం ఏమిటో?
రైతు: అదేగదా సార్, అడుగుతున్నాను. మా భూ ములపై, పాసుబుక్కులమీద ఆయన పెత్తనం ఏమిటో తెలియడంలేదు.
చంద్రబాబు: అందుకే అది నల్లచట్టం. చాలా భయంకరమైనది. నీ భూములపై నీ కు హక్కు ఉండదు. భూములన్నీ జగన్ గుప్పిట్లో ఉంటాయి. జగన్‌కు, పై అధికారులకు ఎవరు కమీషనిస్తే వారి పేరుమీదికి మారిపోతాయి.