Chanchalguda Jail: చంచల్‌గూడ గేట్‌.. తాడేపల్లిలో రిమోట్‌

ABN , First Publish Date - 2023-06-01T03:00:55+05:30 IST

చంచల్‌గూడ జైలులో పైరవీల జాతర! అంతేసి పెద్ద మనుషులు ఎవరున్నారనుకుంటున్నారా? ఇంకెవరు... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సన్నిహిత బంధువైన ఎంపీ అవినాశ్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి! మరొకరు...

Chanchalguda  Jail: చంచల్‌గూడ గేట్‌..   తాడేపల్లిలో రిమోట్‌

వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితులకు సకల మర్యాదలు

వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితులకు సకల మర్యాదలు

ఏపీ పవర్‌ సెంటర్‌లో తెలంగాణ అధికారి

జైల్లో ఆయనే చక్రం.. ఎడాపెడా ములాఖతలు

పైరవీలకు కేంద్రంగా మారిన కారాగారం

వరుస కడుతున్న ఏపీ జైళ్ల శాఖ అధికారులు

పోస్టింగ్‌లు, పదోన్నతుల కోసం విన్నపాలు

సీమకు చెందిన తెలంగాణ అధికారులూ

తెలంగాణ సర్కారుకు ప్రతిపాదనలు

అది.. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ కేంద్ర కారాగారం! ఎక్కడో రిమోట్‌ నొక్కితే.. అక్కడ గేట్లు తెరుచు కుంటున్నాయి. వచ్చే వారు వస్తున్నారు. పోయే వాళ్లు పోతున్నారు. కొందరు అధికారులు గేట్లు తీసుకుని మరీ లోపలికి పోతున్నారు.

‘మీకు ఇక్కడ ఏ లోటూ రాకుండా చూసుకుంటాను. మీరూ నన్ను చూసు కోవాలి’.. ఓ జైలు అధికారి విన్నపం!

‘జగన్‌ సార్‌ జైలులో ఉండగా నేను చాలా సేవలు చేశాను. ఇప్పుడు నన్ను కాస్త చూసుకొమ్మని చెప్పండి!’... ఓ అధికారి రిక్వెస్టు!

(అమరావతి-ఆంధ్రజ్యోతి): చంచల్‌గూడ జైలులో పైరవీల జాతర! అంతేసి పెద్ద మనుషులు ఎవరున్నారనుకుంటున్నారా? ఇంకెవరు... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సన్నిహిత బంధువైన ఎంపీ అవినాశ్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి! మరొకరు... అవినాశ్‌ రెడ్డికి ముఖ్య అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... వైఎస్‌ భాస్కర్‌ రెడ్డితో పాటు వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టయి, రిమాండులో ఉన్న ఇతర నిందితులకు చంచల్‌గూడ జైలులో సకల సౌకర్యాలు లభిస్తున్నాయి. ఇంకోరకంగా చెప్పాలంటే.. వాళ్లు గవర్నమెంట్‌ గెస్ట్‌హౌస్‌లో ఉన్నట్లుగానే ఉంది. ‘పెద్ద’ వాళ్లకు జైళ్లలో అన్ని వసతులు లభించడం సర్వసాధారణమే!

కానీ... ఇప్పుడు అంతకుమించి జరుగుతోంది. చంచల్‌గూడ జైలు ఇప్పుడు పైరవీలకు కేంద్రంగా మారింది. అందులోనూ... ఏపీ జైళ్లశాఖ అధికారుల రాకపోకలు బాగా సాగుతున్నాయి. ‘మాకిది చేసిపెడితే మీ రుణం ఇలా తీర్చుకుంటాం’ అంటూ క్విడ్‌ ప్రో కో ఆఫర్లు ఇస్తున్నారు. తెలంగాణ జైళ్ల శాఖలో పనిచేస్తున్న రాయలసీమకు చెందిన అధికారులు కూడా పైరవీల కోసం ప్రయత్నిస్తున్నారు. ఏపీ సీఎంవో నుంచి తెలంగాణ సర్కారుపై ఒత్తిడి తెచ్చేలా పావులు కదుపుతున్నారు. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిల ద్వారా పైరవీలు చేయిస్తున్నట్టు సమాచారం.

తెలంగాణ అధికారికి.. ఏపీలో పిలిచి పెద్దపీట

ఏపీ ముఖ్యమంత్రి ఒకప్పుడు చంచల్‌గూడ జైలులో పదహారు నెలలు గడిపిన సంగతి తెలిసిందే. అప్పట్లో హైదరాబాద్‌లో జైళ్ల శాఖలో ఉన్న అధికారి ఒకరు జగన్‌కు బాగా దగ్గరయ్యారు. అన్ని విధాలా సహకరిస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయారు. జగన్‌ ఏపీ సీఎం అయిన తర్వాత ఆ అధికారిని పిలిచి... తాడేపల్లి పవర్‌ సెంటర్‌లో చోటు ఇచ్చారు. ఒక ముఖ్య నాయకుడి వద్ద అధికారిక పోస్టు ఇచ్చేశారు. నిజానికి... కేబినెట్‌ ర్యాంక్‌ ఉన్న ఆ ముఖ్యుడికి రాష్ట్రంలోని అధికారిని ఓఎస్డీగా నియమించాలి. లేదా.. హోం కూడా చూస్తారనుకుంటే రాష్ట్ర పోలీసు అధికారిని నియమించాలి. కానీ... పొరుగు రాష్ట్రానికి చెందిన జైళ్ల శాఖ అధికారిని తీసుకురావడమే వారి ‘ముందుచూపు’నకు నిదర్శనం! ఇందులో ముఖ్య ఉద్దేశం ఒకటే! తెలంగాణ జైళ్లలోని పనులను ఈ అధికారి ద్వారా నెరవేర్చుకోవడం! అక్కడ తమ వాళ్లకు ఎలాంటి ‘లోటూ’ లేకుండా చూసుకోవడం! తెలంగాణలో కీలకంగా వ్యవహరించి వచ్చిన ఆ అధికారే... ఇప్పుడు జగన్‌ శిబిరం తరఫున చంచల్‌గూడ జైలులో చక్రం తిప్పుతున్నారు. తాడేపల్లిలో రిమోట్‌ నొక్కితే చంచల్‌గూడ జైలు గేట్లు, లాకప్‌ గదులు తెరుచుకుంటాయి. సదరు అధికారి ద్వారా... చంచల్‌గూడలో ఉన్న ‘అస్మదీయులకు’ ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నారు.

నిబంధనలు బేఖాతర్‌

వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌కుమార్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌ రెడ్డి చంచల్‌గూడ జైలులో ఉన్నారు. డబ్బులు, పరపతిని ఉపయోగించుకుని జైలులో అనధికార వసతులు పొందడం కొత్త విషయమేం కాదు. కానీ... చంచల్‌గూడ జైలును ఇప్పుడు పైరవీల కేంద్రంగా మార్చేశారు. ఏపీ జైళ్ల శాఖ అధికారులు ఏదో ఒక వంకతో చంచల్‌గూడ జైలుకు వస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల జైళ్ల శాఖ అధికారులను అడ్మినిస్ట్రేషన్‌ భవనం దాకా మాత్రమే అనుమతించాలి. ఖైదీలను ములాఖత ద్వారానే కలవాలి. కానీ..చంచల్‌గూడ జైలు అధికారులు ఆ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అధికారులు నేరుగా ఖైదీలను కలిసేందుకు అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. వీరు తమ స్థాయి, పరిచయాలను బట్టి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలను కలిసి తమ ‘విన్నపాలు’ చేసుకుంటున్నట్లు సమాచారం. ‘పరస్పర సహకారం’లో భాగంగా తమకు కావాల్సిన పోస్టింగ్‌లు ఇప్పించాలని కోరుకుంటున్నారు. విచిత్రమేమిటంటే... కొందరు తెలంగాణ అధికారులూ పైరవీలకు వెళ్లి, ‘ఏపీ ప్రభుత్వ పెద్దలతో చెప్పించండి ప్లీజ్‌’ అని వేడుకుంటున్నట్లు తెలుస్తోంది.

విన్నపాల పైరవీలు... మచ్చుకు కొన్ని...

ఒక ఐజీ, మరో డీఐజీ

మే 7వ తేదీ ఆదివారం అయినప్పటికీ తెలంగాణ జైళ్ల శాఖ ఐజీ ఒకరు చంచల్‌గూడ జైలుకు వచ్చారు. ఆయన ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన వారు. ఆయనతోపాటు... చిత్తూరు జిల్లాకే చెందిన ఏపీ జైళ్లశాఖ డీఐజీ కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి వివేకా హత్య కేసులో నిందితులు ఉన్న బ్యారక్‌లకు వెళ్లారు. శివశంకర్‌రెడ్డిని కలసి... తనకు కడప రేంజ్‌ డీఐజీగా బదిలీ కావాలంటూ ఏపీ అధికారి కోరుకున్నట్లు సమాచారం. తెలంగాణ జైళ్ల శాఖ ఐజీ... తన పోస్టింగ్‌కు సీనియారిటీ గండం ఉందని, పోస్టు పదిలంగా ఉండేలా ఏపీ సీఎంవో నుంచి తెలంగాణ సీఎంవోపై ఒత్తిడి తేవాలని శివశంకర్‌ రెడ్డి ద్వారా పైరవీకి ప్రయత్నించినట్టు సమాచారం. అలాగే... ఏపీ విద్యా శాఖలో పనిచేస్తున్న తన సమీప బంధువుకు శివశంకర్‌రెడ్డి ద్వారా మంచి పోస్టింగ్‌ ఇప్పించుకున్నట్టు తెలిసింది. ప్రొటోకాల్‌ ప్రకారం జైళ్ల శాఖ ఐజీ కారాగారానికి వస్తే.. సెలవు రోజు అయినప్పటికీ సూపరింటెండెంట్‌, ఇతర అధికారులు ఉండాల్సిందే. కానీ ఆ రోజు వీరెవరూ లేరు. అంటే ఇది అధికారిక కార్యక్రమం కాదని అర్థమవుతోంది.

పైరవీ కోసం తెలంగాణ డీఐజీ...

మే రెండో వారంలో చిత్తూరు జిల్లాకే చెందిన తెలంగాణ జైళ్ల శాఖ డీఐజీ ఎంక్వైరీ పేరుతో ఉన్నఫళంగా చంచల్‌గూడ జైలును సందర్శించారు. ఇతర బ్యారక్‌లను తూతూమంత్రంగా సందర్శించి, శివశంకర్‌రెడ్డి ఉన్న బ్యారక్‌ వద్ద ఎక్కువ సేపు గడిపినట్టు తెలిసింది. తనకు ఐజీగా పదోన్నతి రావడానికి పైరవీ చేయాల్సిందిగా శివశంకర్‌రెడ్డిని కోరినట్టు సమాచారం. గతంలో జగన్‌ చంచల్‌గూడ జైలులో ఉన్నప్పుడు ఆయన ఇక్కడే డీఎస్పీగా పనిశారు. అప్పట్లో జగన్‌కు తాను ఎన్నో సేవలు చేశానని, ఇప్పుడు తన పని చేసి పెట్టాలని కోరినట్టు తెలుస్తోంది. సీనియారిటీలో ఈ డీఐజీ ముందంజలో ఉన్నా.. ఆయన కంటే జూనియర్‌ అయిన అధికారికి ఐజీ పదవి వచ్చింది. చిత్తూరు జిల్లాకు చెందిన వీరిద్దరూ ఏపీ సర్కారు నుంచి తెలంగాణ సీఎంవోపై ఒత్తిడి తీసుకువస్తుండటంతో తెలంగాణ సర్కారు రెండు ఐజీ పోస్టులను సృష్టించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తాడేపల్లి పవర్‌ సెంటర్‌లో చేరిన తెలంగాణ జైళ్ల శాఖ అధికారి ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది.

కడప నుంచి చంచల్‌గూడకు

ఏపీ జైళ్ల శాఖ డీఐజీ చంచల్‌గూడకు వచ్చి వెళ్లిన రెండో రోజే రాయలసీమ జిల్లాలకు చెందిన ఒక జైలు సూపరింటెండెంట్‌ అక్కడికి వచ్చారు. శివశంకర్‌రెడ్డి కడప జైలులో ఉన్నప్పుడు ఈ అధికారి ఆయనతో సన్నిహితంగా ఉన్నారు. ఆ సాన్నిహిత్యంతో... తనకు డీఐజీగా ప్రమోషన్‌ ఇప్పించాలని, జైళ్ల శాఖ రాయలసీమ రేంజ్‌ అప్పగించాలని కోరినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఏపీ సీఎంవోలో ఫైళ్లు కదులుతున్నట్లు సమాచారం. అలాగే, మే 15వ తేదీన ఏపీ జైళ్ల శాఖకు చెందిన మరో డీఐజీ చంచల్‌గూడ జైలుకు వచ్చారు. కడప రేంజ్‌ పోస్టింగ్‌ కోసం మరో అధికారి పైరవీలు చేయిస్తున్నట్టు తెలుసుకుని..ఈయన నేరుగా భాస్కర్‌రెడ్డి ముందు వాలిపోయారు. తన పోస్టును కాపాడాలని కోరుకున్నారు.

సకల సదుపాయాలు...

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు చంచల్‌గూడ జైలులో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు. దీంతోపాటు పైరవీల వ్యవహారం సాగుతుండటంతో జైలు సూపరింటెండెంట్‌ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తోంది. ఇదంతా చివరకు తన మెడకు చుట్టుకుంటుందనే భయంతో నెల రోజుల పాటు సెలవుపై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సెలవు కోసం దరఖాస్తు చేసుకోగా... ఉన్నతాధికారుల వద్ద పెండింగ్‌లో ఉంది.

..

Updated Date - 2023-06-01T05:42:54+05:30 IST