BS Rao Death: శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ బీఎస్‌రావు హఠాన్మరణం

ABN , First Publish Date - 2023-07-14T01:19:11+05:30 IST

శ్రీచైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్‌ బొప్పన సత్యనారాయణరావు (బీఎస్‌రావు) గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో కన్నుమూశారు.

BS Rao Death: శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్‌  బీఎస్‌రావు హఠాన్మరణం

హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి

వృత్తిపరంగా వైద్యుడు..ప్రవృత్తిపరంగా విద్యావేత్త

విదేశాల్లో డాక్టర్లుగా రాణించిన దంపతులు

కుమార్తెల చదువుల కోసం భారత్‌కు..

బాలికలకు వసతితో మంచి కాలేజీ కోసం ఆరా

ఈ అన్వేషణలోనే ‘శ్రీ చైతన్య’కు బీజం

1986లో బాలికా జూనియర్‌ కాలేజీ ప్రారంభం

86 మంది విద్యార్థులతో బెజవాడలో శ్రీకారం

నేడు ఆ సంస్థల్లో 8.5 లక్షల మంది విద్యార్థులు

విజయవాడ, హైదరాబాద్‌ సిటీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): శ్రీచైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్‌ బొప్పన సత్యనారాయణరావు (బీఎస్‌రావు) గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుకు గురైన బీఎస్‌రావును కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బీఎ్‌సరావు భౌతికకాయాన్ని హైదరాబాద్‌ నుంచి విజయవాడ తాడిగడప వంద అడుగుల రోడ్డులోని ఆయన నివాసానికి తరలించారు.

ఆయన చిన్న కుమార్తె సీమ విదేశాల్లో ఉన్నారు. ఆమె వచ్చిన తర్వాత విజయవాడలోనే బీఎస్‌ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బీఎస్‌ రావుకు భార్య డాక్టర్‌ ఝాన్సీలక్ష్మీబాయి, కుమార్తెలు సుష్మా, సీమ ఉన్నారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరుకు చెందిన బొప్పన నాగభూషణం, జానమ్మ దంపతులకు మూడో సంతానంగా బీఎస్‌ రావు జన్మించారు. చిన్నతనం నుంచి ఇంటాబయటా అందరికీ తలలో నాలుకగా ఉంటూనే, చదువు పట్ల ఎనలేని శ్రద్ధ చూపేవారు. ఎస్‌ఎ్‌సఎల్సీ పూర్తి చేసిన అనంతరం విజయవాడ లయోలా కాలేజీలో పీ యూసీ చదివారు. గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. అంగలూరు చుట్టుపక్కల గ్రామాల్లో డాక్టర్‌ చదువుతున్న కుర్రాడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన అనంతరం డాక్టర్‌ బీఎస్‌ రావుగా అందరికీ చిరపరిచితులయ్యారు. లండన్‌లో ఎం ఆర్‌ఎ్‌సహెచ్‌ పూర్తిచేసి అక్కడే వైద్యవృత్తిని చేపట్టారు. 1970సంవత్సరంలో డాక్టర్‌ ఝా న్సీలక్ష్మీ భాయిని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ఆరంభించారు. వృత్తినే దైవంగా చేసుకొని ఇంగ్లం డ్‌, ఇరాన్‌ దేశాల్లో 15ఏళ్లపాటు వైద్యసేవలందించి అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చారు.

ఆ అన్వేషణే..

బీఎస్‌ రావు దంపతులు తమ కుమార్తెలను విజయవాడలో మంచి కాలేజీలో చదివించాలన్న ఆలోచనతో కాలేజీల కోసం అన్వేషణ ప్రారంభించారు. ఆ క్రమంలోనే శ్రీచైతన్య ఆలోచన పురుడుపోసుకుంది. ఈ విషయాన్ని బీఎస్‌ రావు ఓ ఇంటర్వ్యూలో ఇలా వివరించారు. ‘నేను ఇరాన్‌లో పనిచేసే సమయంలో మా కుమార్తెల కోసం మంచి ఇంటర్‌ కాలేజీని వెతికేందుకు ఇండియా వచ్చాను. కానీ నా అన్వేషణ ఫలించలేదు. బాలికలకు మంచి ఇంటర్‌ రెసిడెన్షియల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు నాంది పడింది అప్పుడే’’ అని తెలిపారు. ‘అప్పట్లో పెద్ద పెద్ద నగరాల్లోనే మంచి విద్యావసతులు ఉండేవి. గ్రామీణ విద్యార్థులకు ముఖ్యంగా బాలికలకు ఉత్తమ విద్య అందడం చాలా కష్టంగా ఉండేది. వారి ప్రతిభకు తగ్గట్టు మంచి విద్యను అందించాలన్న లక్ష్యంతో విద్యాసంస్థను ప్రారంభించాం’ అని బీఎస్‌ రావు వివరించారు. అలా 1986లో విజయవాడ పోరంకిలో శ్రీచైతన్య బాలికల జూనియర్‌ కాలేజీని స్థాపించడంతో శ్రీచైతన్య ప్రస్థానం మొదలైంది. తొలుత 86 మందితో ప్రారంభమైన ఈ సంస్థ నేడు ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించింది. ఈ సంస్థకు చెందిన 321 జూనియర్‌ కళాశాలలు, 322 టెక్నో స్కూల్స్‌, 107 సీబీఎ్‌సఈ స్కూల్స్‌ ద్వారా సుమారు 8.5 లక్షల మంది విద్యార్థుల విద్యనభ్యసిస్తున్నారు. కాగా.. వయోభారం కారణంగా 2012 నుంచి శ్రీచైతన్య విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతలను బీఎస్‌ రావు తన కుమార్తెలు సుష్మ, సీమకు అప్పగించారు.


సేవాభావం..

16ఏళ్ల ప్రాయంలో మృతిచెందిన కుమారుడు కళ్యాణ్‌ చక్రవర్తి స్మారకంగా డాక్టర్‌ బీఎస్‌ రావు దంపతులు తెలుగు రాష్టాల్లో విస్తృతమైన సేవకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ బాధిత గ్రా మాలను రెండింటిని దత్తత తీసుకున్నారు. ఫ్లోరోసిస్‌ కారణంగా కన్నుమూసిన కుటుంబాల నుం చి వందమంది చిన్నారులకు ఉచిత విద్యను అం దించే కార్యక్రమం చేపట్టారు. దీంతోపాటు ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాల నుం చి కూడా చిన్నారులకు శ్రీచైతన్య విద్యాసంస్థల ద్వారా ఉచిత విద్య అందించారు. ఇక.. విద్యారంగంలో బీఎస్‌ రావు ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ ఇండియా స్కూల్‌ ర్యాంకింగ్స్‌ నుంచి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ లీడర్‌షిప్‌ అవార్డును 2015లో అందుకున్నారు. విప్లవాత్మకమైన రెసిడెన్షియల్‌ కోచింగ్‌ ప్రోగ్రామ్‌లపై తల్లిదండ్రులకు భరోసా, పిల్లలకు జాతీయ ప్రవేశ పోటీ పరీక్షల పట్ల మక్కువ కల్పించారు బీఎస్‌ రావు. ఇప్పటివరకు 20 లక్షలమందికి ఇంటర్‌విద్య అందించడంతో పాటు 10 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఎయిమ్స్‌తోపాటు పలు ఇంజనీరింగ్‌, మెడికల్‌ కళాశాలల్లో అడ్మిషన్లు దక్కేలా చేశారు.

చివరిసారిగా..

శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు నీట్‌లో సాధించిన విజయానికిగాను ఈ నెల 9వ తేదీన కృష్ణాజిల్లా కంకిపాడులో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌ రావు పాల్గొన్నారు. అదే ఆయన పాల్గొన్న చివరి కార్యక్రమం. కాగా.. బీఎస్‌ రావు మృతికి పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఎస్‌ రావు విద్యారంగంలో అందించిన సేవలను కొనియాడారు. టీడీపీ జాతీయ ప్రధా న కార్యదర్శి నారా లోకేశ్‌ బీఎస్‌ రావు మృతి పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వైద్యునిగా, విద్యావేత్తగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. బీఎస్‌ రావు మృతి విద్యారంగానికి తీరనిలోటని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు.

విద్యారంగంలో డాక్టర్‌ బీఎస్‌ రావు ప్రస్థానం

1986 విజయవాడలో శ్రీచైతన్య మహిళా కళాశాల ప్రారంభం

1991బాలుర రెసిడెన్షియల్‌ కళాశాలతో విస్తరణ

1994 బాలికల డేస్కాలర్‌ కాలేజీ ప్రారంభం

1996లో హైదరాబాద్‌లో తొలి అడుగు

1998లో విశాఖపట్నంలో శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీ

1999లో తిరుపతిలోకి శ్రీచైతన్య ప్రవేశం

2000లో గుంటూరులో కళాశాల

2004లో డిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, రాంచీ, బొకారో, జార్ఖండ్‌, ఇండోర్‌లోకి శ్రీచైతన్య ప్రవేశం

2005లో బెల్గాంలోకి శ్రీచైతన్య

2007లో ఏఐఈఈఈ, ఎంసెట్‌లో ఫస్ట్‌ర్యాంక్‌

2008లో ఈసీఐఎల్‌లో మొదటి శ్రీచైతన్య టెక్నో స్కూల్‌

2010లో శ్రీచైతన్య ఐఎఎస్‌ అకాడమీ ప్రారంభం

Updated Date - 2023-07-14T02:31:10+05:30 IST