YS Avinash Reddy: సీబీఐ మళ్లీ నోటీసులిస్తే విచారణకు హాజరవుతా

ABN , First Publish Date - 2023-01-25T02:45:03+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇచ్చిన నోటీసులపై కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి స్పందించారు.

YS Avinash Reddy: సీబీఐ మళ్లీ నోటీసులిస్తే విచారణకు హాజరవుతా

ముందస్తు కార్యక్రమాల వల్లే వెళ్లలేకపోయా: అవినాశ్‌

అరెస్టు చేస్తారని ప్రచారం.. వైసీపీలో కలవరం

హైదరాబాద్‌ కోర్టుకు వివేకా హత్యకేసు ఫైళ్లు

కడప కోర్టు నుంచి 3 ట్రంకు పెట్టెల్లో సీబీఐ కోర్టుకు

కడప, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇచ్చిన నోటీసులపై కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి స్పందించారు. సీబీఐ అఽధికారులు సోమవారం మధ్యాహ్నం తనకు నోటీసులిచ్చి.. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలన్నారని.. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా మంగళవారం రాలేకపోతున్నట్లు చెప్పానన్నారు. విచారణకు నాలుగైదు రోజులు సమయం కోరానని, సీబీఐ మళ్లీ నోటీసులిస్తే విచారణకు హాజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తానని తెలిపారు. మంగళవారం గండి దేవస్థానం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన అభియోగాలను జీర్ణించుకోలేకపోతున్నానని.. నిజం బయటకు రావాలని కోరుకుంటున్నానని.. రెండున్నరేళ్లుగా తనపై, తన కుటుంబంపై మీడియా అసత్య ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. ఇంకోవైపు.. వివేకా హత్య కేసులో అవినాశ్‌కు సీబీఐ నోటీసులివ్వడం వైసీపీలో కలకలం సృష్టిస్తోంది.

వివేకా అజాత శత్రువు. పార్టీలకతీతంగా ఆయన్ను అభిమానిస్తారు. అలాంటి వ్యక్తి హత్య కేసులో ఆయన కుటుంబానికే చెందిన అవినాశ్‌రెడ్డికి నోటీసులివ్వడం, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి కోసం సీబీఐ ఆరా తీయడం వంటి కీలక పరిణామాలు తమ పార్టీకి భారీ నష్టం కలిగిస్తాయని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. అవినాశ్‌ మంగళవారం చక్రాయపేట మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మళ్లీ నోటీసులిచ్చేందుకు సీబీఐ అధికారులు ఇక్కడకు వస్తున్నారని వార్తలు రావడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే వారెవరూ రాలేదు. అలాగే హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బృందాలు వస్తున్నాయని, అవినాశ్‌ను అరెస్టు చేస్తారని సోషల్‌ మీడియాలోనూ ప్రచారం సాగింది. కానీ సాయంత్రం వరకు సీబీఐ అధికారులు పులివెందుల వెళ్లలేదు.

Updated Date - 2023-01-25T02:45:04+05:30 IST